కాశీబుగ్గ, జూలై4 : నానా తంటాలు పడి పసుపు పంట పండించి అమ్ముకుందామంటే గిట్టుబాటు ధర రాక రైతులు లబోదిబోమంటున్నారు. పెట్టిన పెట్టుబడి కుడా రావడం లేదని వాపోతున్నారు. ఈ-నామ్‌తో కరీదు వ్యాపారులు ఆన్లైన్లో టెండర్ వేయడంతో ధరలు తక్కువకే పడుతున్నాయని, ఎంత వేస్తే అంతకే అమ్ముకోవాల్సి వస్తుందని చెబుతున్నారు.
గరి ష్ఠ, కనిష్ఠ కొనుగోలుకు చాలా వ్యత్యాసం ఉంటుంది. దీంతో చాలా మంది రైతులకు ధరలు నచ్చక కోల్డ్ స్టోరేజీల్లో భద్రపరుచుకుని పెరిగిన తర్వాతే విక్రయిస్తున్నారు. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు కాడి పసుపు 20,720, గోల 8760 క్వింటాళ్లు రాగా, ఇటీవల క్వింటా సరుకుకు రూ. 13,500 అత్యధికంగా పలికాయి. శుక్రవారం మార్కెట్‌కు 44లాట్స్ (కుప్పలు) రాగా, అందులో క్వింటాల్ కాడి రకం అత్యధికంగా రూ. 12,859, కనిష్ఠంగా రూ. 8500, గోల రకం అత్య ధికంగా రూ, 10, 577, కనిష్ఠంగా రూ.8288 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.
చాలా మంది రైతులు కోల్డ్ స్టోరేజీల్లో భద్రపరుచుకొని ధరలు వచ్చినప్పుడు అమ్ముకుంటు న్నారు. మార్కెట్‌కు పసుపు తీసుకొచ్చినందుకు ట్రాన్స్‌పోర్టు చార్జీలతో పాటు యార్డులో కుప్ప గా పోసినందుకు, బ్యాగుల్లో నింపి, లోడింగ్ చేసినందుకు, కోల్డు స్టోరేజ్‌కు తరలించేందుకు ట్రాన్స్‌పోర్టు, కోల్డులో వేసినందుకు హమాలీ చార్జీలు బస్తాకు రూ.30 వరకు అవుతున్నాయి.
వరంగల్ మార్కెట్‌కు సుమారు 40 బస్తాల నాణ్యమైన దేశవాళీ పసుపు కొమ్ములు తీసుకొచ్చా. అయినా క్వింటాకు రూ.10,150 ధర పడింది. ఆ ధర గిట్టుబాటు కాదని కోల్డ్ స్టోరేజీకి తీసుకెళ్తున్న. ధరలు తక్కువగా ఉన్నా కొందరు రైతులు పెట్టుబడుల కోసం వచ్చిన కాడికి అమ్ముకుంటున్నారు. అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి గిట్టుబాటు ధరలు వచ్చేలా చర్యలు తీసుకోవాలి.
– మార్త మల్లయ్య, రైతు, మందపల్లి, దుగ్గొండి మండలం