వరంగల్, మే 5 (నమస్తే తెలంగాణ) : రైతుల అభ్యున్నతి, సబ్బండవర్గాల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది. అనేక సంక్షేమ పథకాలను అమ లు చేస్తూ ఇంటింటికీ ఫలాలు అందిస్తున్నది. రాజకీయాలకు అతీతంగా వాటిని ప్రతి రైతు కుటుంబానికి వర్తింపజేస్తున్నది. వ్యవసాయానికి 24గంటల నాణ్యమైన ఉచిత కరంటు సరఫరా చేస్తున్నది. పంట పెట్టుబడి కోసం ప్రతి సంవత్సరం రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందిస్తున్నది. ఎవరైనా రైతు చనిపోతే ఆ కుటుంబానికి రైతుబీమా ద్వారా రూ.5లక్షలు ఆర్థిక సాయం చేస్తున్నది. కాళేశ్వరం వంటి నీటి ప్రాజెక్టుల నిర్మాణంతో సాగు నీటిని ప్రతి ఎకరాకు అందుబాటులోకి తెచ్చింది. ప్రతి సీజన్లో రైతులకు సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేస్తున్నది. ప్రభుత్వ మద్దతు ధర దక్కేలా వానాకాలం, యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తున్నది. ఎరువుల కొరతను కూడా తీర్చింది. దీంతో పాటు ప్రతి రైతు కుటుంబానికి ఆసరా, కల్యాణలక్ష్మి, ఆరోగ్యశ్రీ, కేసీఆర్ కిట్, ఫీజు రీయింబర్స్మెంట్ ఓవర్సీస్, సీఎం రిలీఫ్‌ఫండ్ వంటి పథకాలను అమలు చేస్తున్నది. పార్టీలకు అతీతంగా రైతు కుటుంబాలు ఈ పథకాలను పొందుతున్నాయి. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు సైతం లబ్ధిదారులుగా ఉన్నారు.
కాంగ్రెస్ హయాంలో రైతుల అరిగోస
యూపీఏ పాలనలోనే రైతులు అరిగోస పడ్డ విషయం ప్రతి కర్షకుడికి తెలిసిందే. ఆ పార్టీ హయాంలోనే రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా జరిగాయి. సాగునీరు లేక, సమయానికి ఎరువులు, విత్తనాలు అందక, పెట్టుబడులు ఎల్లక, అప్పుల బాధతో వేలాది మంది రైతులు ఉరికొయ్యల పాలయ్యారు. పురుగుల మందునే పెరుగన్నం చేసుకున్నారు.
కాంగ్రెస్ నేతలకూ సంక్షేమ ఫలాలు
సంపద పెంచాలి.. పేదలకు పంచాలనే నినాదంతో పరిపాలన సాగిస్తున్న టీఆర్ఎస్ సర్కారు అన్ని వర్గాలకు సంతృప్త స్థాయిలో పథకాలను అమలు చేస్తున్నది. ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరంటు, ప్రతి ఎకరాకు సాగునీరు, సంక్షేమ హాస్టళ్లు వంటి ప్రతి పథకంలోనూ కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు లబ్ధిదారులుగా ఉన్నారు. రైతు బంధు కింద ఆరు జిల్లాల్లో వేల మంది కార్యకర్తలు లబ్ధిపొందుతున్నారు. కల్యాణలక్ష్మి, ఆసరా, ఉచిత కరంటు, సాగునీటి సౌకర్యాలు అందరికీ చేరుతున్నాయి. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ విధానాలు కనిపించనట్లుగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం వరంగల్‌లో రైతు సంఘర్షణ సభ నిర్వహిస్తుండడం, దానికి ఆ పార్టీ జాతీయ నేత రాహుల్‌గాంధీ వస్తుండడంతో హస్తం పార్టీ పరిపాలన సాగిస్తున్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల్లో అమలవుతున్న పథకాలపై చర్చ జరుగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయరంగంలో అమలు చేస్తున్న పథకాల్లో ఒకటోరెండో ఈ రాష్ర్టాల్లో అమలవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలోని సంక్షేమ పథకాలను ఆ రాష్ర్టాల్లోనూ అమలు చేసేలా కాంగ్రెస్ జాతీయ నాయకత్వం చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఏవీ పట్టక.. రైతుల పేరుతో రాజకీయం
ఇవన్నీ పట్టని కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్‌గాంధీ శుక్రవారం వరంగల్ వస్తున్నారు. రైతు సంఘర్షణ పేరుతో ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్వహిస్తున్న బహిరంగసభకు హాజరవుతున్నారు. తెలంగాణలో వ్యవసాయరంగం సాధించిన గణనీయమైన అభివృద్ధిపై ఏమాత్రం అవగాహన లేని రాహుల్‌గాంధీతో సభ ఏర్పాటుపై ఉమ్మడి జిల్లా రైతులు, ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలోని పథకాలు కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, వామపక్షాలు, ఇతర పార్టీలు అనే తేడా లేకుండా ప్రతి పార్టీలో ఉన్న రైతులకు చేరుతున్నాయి. ఇవన్నీ మరిచి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు రైతుల పేరు చెప్పుకొని సభ ఏర్పాటు చేయడంపై ఆ పార్టీ శ్రేణుల్లోనే అయోమయం నెలకొంది.
మచ్చుకు కొందరు..
మహబూబాబాద్ పట్టణానికి చెందిన ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి 50.17ఎకరాల భూమి ఉంది. ఆయనకు ఏడాదికి వానకాలం పంట ముందు రూ. 2,52,125 రైతుబంధు కింద జమయ్యాయి. యాసంగికి రూ.2,52,125 జమయ్యాయి. అంటే ఒక సంవత్సరానికి రూ.5,04,250 పడుతున్నాయి. రైతు బంధు పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం రూ.16,13,750 ఆయన బ్యాంకు ఖాతాలో జమయ్యాయి. భూపాలపల్లి జిల్లాలో మల్హర్ మండలం వల్లెంకుంటకు చెందిన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అయిత ప్రకాశ్‌రెడ్డికి రైతుబంధు ద్వారా ఆరు ఎకరాలకు ఏటా రూ.60వేల సాయం అందుతున్నది. భూపాపల్లి నియోజకవర్గ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణకు 15 ఎకరాలకు రూ.1.5లక్షలు జమవుతున్నాయి. భూపాలపల్లి పట్టణాధ్యక్షుడు దేవన్‌కు 20 గుంటలకు గాను రూ.5వేలు, ఆసరా పింఛన్ ప్రతి నెల రూ. 2016 చొప్పున పొందుతున్నారు. జనగామ జిల్లా సిద్దెంకి గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ జిల్లా నేత సుంకరి శ్రీనివాస్‌రెడ్డికి 19 ఎకరాలకు గాను రైతుబంధు ద్వారా 1.90లక్షలు వస్తున్నాయి. ఇలా ఉమ్మడి జిల్లాలో వేలాది మంది కాంగ్రెస్ నాయకులు వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు.
అవును.. బరాబర్ మస్తు చేత్తాండు..
దేవరుప్పుల, మే 5: మాది ఎన్కటి నుంచి కాంగ్రెస్ కుటుంబమే. ఆ పార్టీలనే ఉంటు న్నం. అయినా నాకు రెండు వేల పింఛన్ వత్తాంది. నా బిడ్డకు కల్యాణలక్ష్మి వచ్చింది. ఇంకో బిడ్డకు కల్యాణలక్ష్మితోనే పెండ్లి చేస్తననే భరోసా ఉంది. నా కొడుకుకు దళితబంధు వస్తదనే నమ్మకం ఉంది. సీసీరోడ్లు నల్లాలు. చెట్లు చేమలు.. గిట్ల మా ఊరైతె మంచిగైంది. ఇదంత కేసీఆర్‌తోనే సాధ్యమైంది. ఏ మాటకమాటె చెప్పాలె. తెలంగాణ రాంగనే కేసీఅర్ సీఎం అవుడు ప్రజల అదృష్టం. ఎన్నిచేయాల్నో అన్ని చేశిండు. ఇన్ని ఇకమతులు తెలిసినోడు ఏ పార్టీల లేడు. చెయ్యలేందంటె తప్పుల పడుతం. కాంగ్రెస్ పార్టీల నాయకుడు లేకుండ అయిండు. ఇంత తిప్పల పడెటోడు మా పార్టీల కనవడుతలేడు. మంచి పనులు చేసేటోళ్లను మెచ్చుకుంటె తప్పేముంది.
– దౌపాటి మల్లయ్య, కాంగ్రెస్ నాయకుడు, ధర్మాపురం, దేవరుప్పుల మండలం
గడపగడపకూ సంక్షేమం బాగుంది..
చిట్యాల, మే 5 : కేసీఆర్ ప్రభుత్వం పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ రైతుబంధు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. మా నాన్న పేరు మీద నాలుగెకరాల వ్యవసాయ భూమి ఉంది. ప్రతి ఏటా రూ.40వేల సాయం అందుతోంది. తెలంగాణ వచ్చిన తర్వాత గడపగడపకూ సంక్షేమ పథకాలు నేరుగా అందుతున్నాయి. మాది నిరుపేద కుటుంబం. నేను కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేస్తున్నా. మాకు డబుల్‌బెడ్ రూమ్ ఇల్లు కూడా మంజూరుచేయాలని కోరుతున్నా. అలాగే యువతకు ఉద్యోగ నియామకాల్లో టీశాట్, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో కోచింగ్ ఇవ్వడం బాగుంది. స్టడీ మెటీరియల్ ఇస్తే బాగుంటుంది.
– బుదారపు రాము, కాంగ్రెస్ కార్యకర్త(కైలాపూర్), చిట్యాల
ఎక్కువ పథకాలు మేనిఫెస్టోలో లేనివే
దేవరుప్పుల, మే 5 : మా నాయన ఊర్ల కాంగ్రెస్ లీడర్. మా కుటుంబం అదే పార్టీల కొనసాగుతోంది. నేడు దివ్యాంగుడిని. సైకిళ్లు రిపేరు చేస్తా. నాకు దివ్యాంగ పింఛన్, మా అమ్మ యాదమ్మకు వృద్ధ్దాప్య పింఛన్ వస్తోంది. మా చెల్లె డిగ్రీ చేసింది. కేసీఆర్ లాంటి లీడర్ దొరకడం తెలంగాణ ప్రజల అదృష్టం. నేనైతె ఆయన పెట్టిన పథకాలకు ఫిదా అయిన. ఈ రోజులల్ల పార్టీలు మేనిఫెస్టోలో ఊదరగొట్టిన పథకాలే అమలుచేస్తలేవు. అలాంటిది కేసీఆర్ మేనిఫెస్టోలో లేనివి కూడా అద్భుతంగా అమలుచేస్తుండు. అన్ని వర్గాలకు మేలు చేస్తుండు. ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు, రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చే పథకాలు ఆషామాషీ కాదు. మేం దళితులం. మాకోసం దళితబంధు పథకం పెట్టడం చాలాబాగుంది. ఆర్థికంగా ఎదగడానికి మంచి మేలు చేస్తున్నరు. డబుల్బెడ్రూంలల్ల దివ్యాంగులకు రిజర్వేషన్లు ఇవ్వడం మాకు కలిసొచ్చింది. మా ఊరు కూడా చాలా మంచిగైంది. ఇగ రాహుల్‌గాంధీ మీటింగ్‌కు పోయి కొత్తగ ఏమన్న చెప్తడో ఇంట.
– దౌపాటి వెంకటేశ్, దివ్యాంగుడు, కాంగ్రెస్ నేత, ధర్మాపురం
పార్టీలకతీతంగా సంక్షేమం బాగుంది..
జఫర్‌గఢ్, మే 5 : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు అలాగే రాజకీయ పార్టీలకు అతీతంగా అందుతున్నాయి. మాది జనగామ జిల్లా జఫర్గడ్ మండలం సాగరం గ్రామం. నాకు గ్రామంలో నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధుతో ఏటా రూ.40వేలు వస్తున్నాయి. నాకు దివ్యాంగుల కోటా కింద ప్రతి నెలా రూ.3వేల పింఛన్ వస్తోంది. మా నాన్న ఈ మధ్యే చనిపోయారు. ఆయనకు మొన్నటిదాక వృద్ధాప్య పింఛన్ వచ్చేది. నేను వ్యవసాయానికి వాడుతున్న బోరు మోటార్లకు 24గంటల నాణ్యమైన కరంట్ రావడంతో పంటలు బాగా పండిస్తున్నాను. మోటార్లు కాలిపోవడం లేదు. నాకు రైతు బీమా వర్తిస్తుంది. సంక్షేమ ప థకాలు అన్ని వర్గాలకు అందించడం హర్షణీయం.
– కత్తుల ఎల్లయ్య, కాంగ్రెస్ జిల్లా నాయకుడు, సాగరం, జఫర్‌గఢ్
పార్టీ వేరైనా.. పైరవీ లేకుంటనే ఇచ్చిన్రు..
మల్హర్, మే 5 : తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ తెచ్చిన పథకాలన్నీ బాగున్నయ్. ఏ స్కీమ్ అయినా ఆ పార్టీ, ఈ పార్టీ అని చూడకుండా సాయం అందించడం గొప్ప విషయం. అందులో కల్యాణలక్ష్మి పథకం అద్భుతం. ముఖ్యంగా ఆడబిడ్డలున్న పేద కుటుంబాలకు ఎంతో భరోసానిస్తుంది. పెళ్లి ఖర్చుల కోసం లక్షా నూటపదహార్లు ఇవ్వడమంటే మామూలు విషయం కాదు. నేను కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిని. పోయిన యేడు నా బిడ్డ పెళ్లి చేసిన. పార్టీ వేరే అయినా గింత పైరవీ చేయకుంటనే కల్యాణలక్ష్మి కింద ప్రభుత్వం రూ.1,00,116 ఇచ్చింది. ఎవరి చుట్టూ తిరగకుంటనే పని అయింది. ఇదొక్కటే కాదు.. అన్ని వర్గాలకు పథకాలు అందిస్తున్నడు కేసీఆర్.
– లింగపల్లి నర్సింగారావు, కాంగ్రెస్ సీనియర్ నేత, తాడిచర్ల
నాకు రైతుబంధు, బిడ్డకు కల్యాణలక్ష్మి
కేసముద్రం, మే 5 : నాకు నాలుగున్నర ఎకరాల భూమి ఉంది. కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు కింద ఏడాదికి రూ.45వేలు జమచేత్తాంది. ఈ డబ్బులు పెట్టుబడికి అయితానయ్. ఇదివరకు ఎవుసం పనులకు పైసల్ లేక ఇబ్బంది అయ్యేది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినంక రైతు రందివోయింది. కష్టాలు తీరినయ్. ఇద్దరు బిడ్డలు. చిన్న బిడ్డ లావణ్యకు రెండేళ్ల క్రితం పెళ్లి చేసిన. కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు పెట్టిన. ఎసోంటి పైరవి లేకుంటనే కొన్ని నెలలకు రూ.1,00,116 వచ్చినయ్. ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బును నా బిడ్డకే ఇచ్చిన. నాకు, నా బిడ్డకు సాయం చేసిన కేసీఆర్ సారుకు రుణపడి ఉంట.
– పులిగిల్ల గుట్టయ్య, కల్వల
రాహుల్ వస్తే.. ఏమన్న మారుతదా..?
దేవరుప్పుల, మే 5 : ఊరన్న కాడ ఆంజనేయుని గుడి ఉన్నట్టే.. తెలంగాణ సీఎం కేసీఆర్ పెట్టిన పథకం అందని ఇల్లు లేదు. మాది కాంగ్రెస్ పార్టీయే. నేను ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యుడిని. విద్యాకమిటీల సుత పనిజేశిన. నాకు మూడెకరాల భూమి ఉంది. పెట్టుబడి సాయం కింద రూ.30వేల రైతుబంధు పైసల్ పడ్తున్నయ్. నా బిడ్డకు కల్యాణలక్ష్మి వచ్చింది. కేసీఆర్ కిట్ ఇచ్చిన్రు. ఇంటికి నల్లా పెట్టిన్రు. అసలు గోదావరి నీళ్లతోటి మా ఊరి చెరువులు నిండుతయని ఎవరూ కలల సుత అనుకోలే. అన్నితీర్ల సౌలత్లతోటి ఊరు జబర్దస్త్ అయింది. గిట్ల అన్ని పనులు అయితున్నయంటే కేసీఆర్ ఆలోచనతోటే. నాగలి దున్నెటోనికే భూమి లోతుపాతులు తెలుస్తయ్. ఆయనకు తెలంగాణ మీద మంచి పట్టుంది. గెట్టురాయి తెలువని తరీఖల కాంగ్రెస్ పార్టీ తయారైంది. అండ్లదండ్లనే పుల్లలు పెట్టుకుంటాన్రు. రాహుల్‌గాంధీ వస్తే లేస్తదంటరా? ఎనుకట నుంచి కాంగ్రెస్ పార్టీలనే ఉంటున్నా.. పార్టీ ఏం మారలే.
– నల్ల యాదయ్య, దళితరైతు, నీర్మాల,దేవరుప్పుల మండలం