సమాంతర ఉధృత గాలుల(స్ట్రెయిట్ లైన్ విండ్స్ స్టార్మ్) వల్లే ములుగు జిల్లా తాడ్వాయి అటవీ ప్రాంతంలో 500 ఎకరాల్లో చెట్లు నేలకూలినట్లు అటవీ శాఖ ప్రాథమికంగా నిర్ధారించింది. గాలి పీడ నం తీవ్రంగా ఉన్నప్పుడు దాని మార్గంలో ఏదైనా అడ్డుగా వస్తే కూల్చేస్తుంది. ఇదే రకమైన విపత్తు ఇక్కడ జరిగినట్లు ఫారెస్టు శాఖ అధికారుల పరిశీలనలో తేలింది. ఈ డౌన్ బరస్ట్ చుట్టుపక్కల గ్రామాల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. 1984లో పస్రాలోని లవ్వాల అటవీ ప్రాంతంలో ఇదే తరహాలో ఉపద్రవం వచ్చిందని పేర్కొంటున్నారు.
– వరంగల్, సెప్టెంబర్15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మేడారం-తాడ్వాయి రోడ్డులో కొండేటి వాగు నుంచి కొండపర్తి వరకు ఆగస్టు 31న సాయంత్రం 5 నుంచి 7గంటల వరకు దట్టమైన మేఘాలతో, గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో వీచిన సమాంతర ఉధృత గాలుల(స్ట్రెయిట్ లైన్ విండ్స్ స్టార్మ్) వల్ల 500 ఎకరాల విస్తీర్ణంలోని అటవీ సంపద పూర్తి గా దెబ్బతిన్నది. దాదాపు 60 వేలకుపైగా దట్టమైన చెట్లు కూలిపోయాయి. తకువ లోతులో ఉండి విస్తరించే లక్షణం ఉన్న వందేండ్ల వృక్షాలు కొమ్మల వల్ల ఉధృతి, గాలి, వాన నీటి బరువుకు ఊగి కూకటి వేళ్లతో సహా నేల కొరిగాయి. చిన్నగా, సన్నగా ఉన్న చెట్లు సగానికి విరిగి తెగి పడ్డాయి.
ఈ ప్రాంతంలో అంతా ఇసుక నేలలే కావడం, 4 అడుగుల కింది నేలలో రాతి గుండ్లు ఉండడం వల్ల చెట్ల వేరు వ్యవస్థ లోపలికి కాకుండా సమాంతరంగా వ్యాపించి ఉన్నది. అంకుశంగా ఉండాల్సిన తల్లి వేరు కొద్ది దూరం వరకే ఉండడంతో పెద్ద చెట్లు కూలిపోయాయి. సమాంతర ఉధృత గాలుల తరహా ఉపద్రవం మన రాష్ట్రంలోనూ గతంలో వచ్చినట్లు అటవీ శాఖ రిటైర్డ్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 10 అటవీ బృందాలు పడిపోయిన చెట్లను లెకిస్తూ సంరక్షణ చర్యలు చేపడుతున్నారు. అటవీ శాఖ సిబ్బంది నిరంతరం గస్తీ తిరుగుతూ దెబ్బతిన్న అటవీ ప్రాంతాన్ని సంరక్షించే ప్రక్రియను మొదలుపెట్టారు.
ఇలాంటి సంరక్షణ చర్యలు కచ్చితంగా కొనసాగిస్తే ఐదారేండ్లలో అటవీ ప్రాంతం తిరిగి పునరుజ్జీవమయ్యే అవకాశం ఉంటుంది. విశాలమైన అటవీ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ వాతావరణ పరిశీలన కేంద్రం ఉంటే ఏం జరిగిందనేది కచ్చితంగా తెలిసేదని చెబుతున్నారు.
తాడ్వాయి అటవీ ప్రాంతంలో వాతావరణ పరంగా జరిగిన ఉపద్రవం ఏమిటనే నివేదికలు, సమాచారం కావాలని ములుగు జిల్లా అటవీ అధికారి హైదరాబాద్లోని కేంద్ర ప్రభుత్వ వాతావరణ కేంద్రానికి లేఖ రాశారు. ఆ ప్రాంతంలో వర్షపాత నమోదు కేంద్రమే ఉన్నదని, ఇతర సమగ్రమైన నివేదికలు వచ్చే పరిశీలన కేంద్రం లేదని అక్కడి నుంచి జవాబు వచ్చింది. వాతావరణ నివేదికలు లేకపోవడంతో తాడ్వాయి అటవీ ప్రాంతంలో జరిగిన ఉపద్రవంపై అటవీ శాఖ త్వరగా తుది నిర్ధారణకు రాలేకపోతున్నది.
ఇలాంటి ప్రకృతి వైపరీత్యం ఈ ప్రాంతానికి కొత్త అయినా దేశంలో ఎన్నో ప్రాంతాల్లో వస్తున్నది. తుఫాన్ రూపాల్లో ఉపద్రవాలు వచ్చి అడవులు ధ్వంసమవుతున్నాయి. నాలుగు దశాబ్దాల క్రితం పస్రాలోని లవ్వాల అటవీ ప్రాంతంలో ఇలాంటి నష్టం వాటిల్లింది. ఇప్పుడు స్ట్రెయిట్ లైన్ విండ్స్ వచ్చిన ప్రాంతం చుట్టూ కామారం, ఊరట్టం, మేడారం, కొండపర్తి గ్రామాలు ఉన్నాయి.
అడవి కారణంగానే అంత పెద్ద ఉపద్రవం వచ్చినా గ్రామాలు ఉండగలిగాయి. అడవి తాను ధ్వంసమై ఆ గ్రామాలను కాపాడింది. ఈ ప్రక్రియే అడవులు మానవాళికి చేసే మేలు. ఇది అనూహ్యమైన వాతావరణ మార్పుల వల్ల జరిగిన ప్రకృతి వైపరీత్యం. కేంద్ర ప్రభుత్వం ఏటూరునాగారంలో వాతావరణ పరిశీలన కేంద్రం(అబ్జర్వేటరీ) ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు చేపట్టవచ్చు.
తాడ్వాయి అడవుల్లో వచ్చిన ఉపద్రవంతో కొండపర్తి గ్రామం బాగా దెబ్బతిన్నది. కామారం, ఊరట్టం, మేడారం గ్రామాలు దీని ప్రభావానికి గురయ్యాయి. తీవ్రమైన గాలితో వచ్చిన విపత్తు కారణంగా ఇండ్ల పైకప్పులు లేచి కిలోమీటర్ల దూరంలో పడిపోయాయి. వరదల నష్టంతో ఇండ్లు కోల్పోయిన వారికి ఇచ్చినట్లే తమకూ పరిహారం ఇవ్వాలని కొండపర్తి వాసులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇండ్లు కోల్పోవడంతో తమ పరిస్థితి దయనీయంగా ఉన్నదని, రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా సాయం చేయాలని కోరుతున్నారు. విపత్తుతో పశువులను కోల్పోయామని, రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.