జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మళ్లీ పోడు దందా జోరందుకున్నది. అక్రమార్కులు గొడ్డళ్లతో కాకుండా రాత్రి వేళల్లో ప్రత్యేక యంత్రాలు వినియోగిస్తూ చెట్లను నేలమట్టం చేస్తున్నారు. ఇప్పటికే సుమారు 30 ఎకరాల్లో వృక్షాలు తొలగించి చదును చేశారు. వారం రోజులుగా ఇది కొనసాగుతున్నా అటువైపు చూసే వారే లేరు. తమపై కేసులు నమోదైనా.. ఎప్పటికైనా భూమి దక్కుతుందనే ధీమాతో చెట్లను నరికేస్తున్నారు. మంథని నియోజకవర్గంలోని మహాముత్తారం మండల పరిధిలో పలువురు నేతల కనుసన్నల్లోనే ఈ దందా దర్జాగా సాగుతున్నది. వీరికి అటవీ శాఖ సిబ్బందే అండగా ఉంటున్నారనే ఆరోపణలూ వెల్లువెత్తాయి. దీంతో స్పందించిన జిల్లా అధికారులు పోడు స్థలానికి చేరుకొని కేసులు నమోదు చేస్తున్నారు. సహకరించిన శాఖ సిబ్బందిపై ఆరా తీస్తున్నారు.
– జయశంకర్ భూపాలపల్లి, జూన్ 30 (నమస్తే తెలంగాణ)
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి, మహాముత్తారం మండలాల పరిధిలో రోజు రోజుకు పోడు దందా పెరిగిపోతున్నది. ఆజంనగర్ రేంజ్ పరిధిలోని ఈ అడవుల్లో వారం రోజులుగా అడవిలోని చెట్లను యథేచ్ఛగా నరికేస్తున్నా సంబంధిత అధికారుల చర్యలు కరువయ్యాయి. ఈ రేంజ్‌లోని యామన్‌పెల్లి, కేశవాపూర్, సింగారం, దూదేకులపల్లి, నందిగామ ప్రాంతాల్లో అటవీ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ప్రస్తుతం మహాముత్తారం మండల పరిధిలో పోడు దందా జోరుగా సాగుతున్నది. బ్యాటరీలు, చార్జింగ్‌తో పనిచేసే రం పపు యంత్రాలతో అక్రమార్కులు రాత్రి వేళల్లో త క్కువ సమయంలో ఎక్కువ చెట్లను నరికేస్తున్నారు. ఈ క్రమంలో ఆజంనగర్ రేంజ్‌కు సమీపంలోని మహాముత్తారం మండల పరిధి అడవుల్లో సుమా రు 30 ఎకరాల్లో పోడు జరిగినట్లు తెలుస్తున్నది.
జిల్లాలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులందరికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టాలిచ్చి భరోసా కల్పించింది. ఇకపై సెంటు అటవీభూమి సైతం పోడు జరగొద్దని ఆదేశించడంతో దానికి చెక్ పడింది. కాగా ప్రభుత్వం మారడంతో మళ్లీ అడవుల్లో పోడు దందా ప్రారంభమైంది. జిల్లాలోని 92 గ్రామ పంచాయతీల్లో 164 హ్యాబిటేషన్స్‌లో 3,210 మంది రైతులకు 7,892.91 ఎకారలకు బీఆర్ఎస్ ప్రభుత్వం పోడు పట్టాలిచ్చింది. భూపాలపల్లి మండలంలో 647 మంది రైతులకు 1345.04 ఎకరాలు, చిట్యాలలో 140 మందికి 287.76, గణపురంలో 13 మందికి 26.75 , కాటారంలో నలుగురికి 6.85, మహాదేవ్‌పూర్‌లో 290 మందికి 564.12, మహాముత్తారంలో 1,528 మందికి 4,173.39, మల్హర్‌లో 209 మందికి 396.41, పలిమెలలో 362 మందికి 1,058.31, రేగొండ మండలంలో 17 మంది రైతులకు 33.92 ఎకరాలకు పోడు పట్టాలిచ్చింది.
మహాముత్తారం అడవుల్లో పోడు చేసిన వ్యక్తులపై కేసులు నమోదు చేస్తున్నాం. యామన్‌పెల్లి తదితర ప్రాంతాల్లో పోడు జరిగింది. ప్రస్తుతం ఐదుగురిపై కేసు నమోదు చేశాం. విచారణ ఇంకా కొనసాగుతున్నది. కేసుకు సంబంధించి ఎవరినీ వదిలి పెట్టం. అడవుల్లో చెట్లను నరికివేసి పోడు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం.