టేకుమట్ల, డిసెంబర్ 14 : టేకుమట్ల మండలంలోని మానేరు, చలివాగుల్లో నిబంధనలకు పాతరేసి ప్రతి రోజు భారీగా ఇసుకను తోడేస్తున్నారు. స్థానిక అవసరాలకు ఎలాంటి ఆంక్షలు, అనుమతులు లేకుండా పగలు మాత్రమే ఇసుకను తీసుకెళ్లవచ్చని, గ్రామీణ ప్రాంత ప్రజల నిర్మాణాలకు సహకరించాలని స్థానిక ఎమ్మెల్యే సూచించారు. ఇదే అదునుగా భావించిన కొందరు ఇసుక వ్యాపారులు రెచ్చిపోతున్నారు. మండలంలోని రాఘవరెడ్డిపేట, రామకృష్ణాపూర్(వీ), బూర్నపల్లి, ద్వారకాపేట, కలికోటపల్లిలోని వాగుల నుంచి అడ్డూ అదుపు లేకుండా ఇసుకను తవ్వి వందలాది ట్రాక్టర్లలో రేగొండ మండలంలోని ప్రధాన రహదారి వెంట ఉన్న గ్రామాల్లో, హనుమకొండ జిల్లా పరకాలలో డంప్ చేస్తున్నారు.
అక్కడి నుంచి లారీల్లో ఇతర పట్టణాలకు తరలిస్తున్నారు. మానేరులో ఉదయం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు, చలివాగులో మాత్రం రోజంతా ఇసుకను తోడేస్తున్నారు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేస్తే ట్రాక్టర్లను పట్టుకుంటున్నారని, రాజకీయ ఒత్తిళ్లతో తిరిగి వదిలేస్తున్నారని మండల ప్రజలు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుమ్మడవెల్లి- రామకృష్ణాపూర్ (వీ) గ్రామాల మధ్యలో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన చెక్ డ్యామ్ కింద నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తోడడంతో బండలు తేలి ప్రమాదకరంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కూలీలది మరో దందా..
ఇక్కడి కూలీలు స్థానికులకు రూ. 400 నుంచి రూ. 500కు ట్రాక్టర్ లోడ్ చేస్తారు. అయితే ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువ ట్రాక్టర్లు వస్తుండడంతో వారి నుంచి రూ. 1,500 వసూలు చేస్తున్నారు. డబ్బులు ఎక్కువ వస్తుండడంతో స్థానికులను పక్కన పెట్టి బయటి వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్, ఎమ్మెల్యే దృష్టి సారించి స్థానికేతరులకు కాకుండా స్థానిక అవసరాలకు మాత్రమే అనుమతులివ్వాలని ప్రజలు కోరుతున్నారు. ఇదే విషయమై కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ టేకుమట్ల మండలాధ్యక్షుడు సట్ట రవిగౌడ్, ఇతర నాయకులు స్థానిక తహసీల్దార్, ఎస్సైకి వినతిపత్రం ఇచ్చినప్పటికీ ఎలాంటి ఫలితం లేదు.
డస్ట్ పేరిట నిల్వ..
మండలంలోని కలికోటపల్లి మానేరు వాగు ఒడ్డున ఉన్న ఇసుక మేటలను డస్ట్ పేరుతో ఎలాంటి అనుమతులు లేకుండానే రహదారి వెంట అక్రమంగా నిల్వ చేస్తున్నారు. ఇక్కడి నుంచి పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలోని ఇటుక బట్టీల వ్యాపారులు తరలించుకుపోతున్నట్లు సమాచారం. అధికారులు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని చెపుతున్నా పంట పొలాల్లో పేరుకుపోయిన డస్ట్ మాటున వాగును ఆనుకొనే పెద్ద ఎత్తున ఇసుక డంప్‌లు ఏర్పాటు చేస్తున్నారు. వాగు వెంట ఇసుక డంప్ చేసుకోవడానికి తాము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని మైనింగ్ ఏడీ జయరాజ్ తెలిపారు. ఈ విషయమై తహసీల్దార్ విజయలక్ష్మి మాట్లాడుతూ తన భూమిలో వేసిన ఇసుక మేటలను తొలగించుకుంటానని ఓ రైతు కోరగా అందుకు సంబంధించిన వివరాలతో మైనింగ్ అధికారులకు లేఖ రాశామని, కానీ వారు అనుమతులిచ్చినట్లు తమకు కాపీ పంపించలేదని పేర్కొన్నారు. కాగా, పొలాల్లో వేసిన ఇసుక మేటలను తీసి వాగులో పోయాలని లేదా గెట్లుగా పోసుకోవాలని, లారీలతో ఇతర ప్రాంతాలకు తరలించడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
అధికారులను శాసిస్తున్న అక్రమార్కులు
మండలంలో సహజవనరులైన ఇసుక, మొరం దందా విచ్చలవిడిగా సాగుతున్నది. ప్రజలు, కుల సంఘాలు, నాయకులు అడ్డుకుంటున్నా ఫలితం లేదు. అధికారులకు సమాచారం ఇస్తే వారు తమ విధులు నిర్వర్తించకుండా అక్రమార్కులు శాసిస్తున్నారు. పట్ట్టుబడిన ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే పేరు చెప్పి బయటకు వస్తున్నారు. ప్రజా ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతున్నది. ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందించి అక్రమ దందాలకు, అక్రమార్కులకు చెక్ పెట్టి, అధికారులు తమ పని చేసుకునేలా స్వేచ్ఛనివ్వాలి.
– పొన్నం భిక్షపతి గౌడ్, కుందనపల్లి, టేకుమట్ల
ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు
మండలంలోని వాగుల నుంచి ఇసుక తరలించేందుకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. మండల పరిధిలోని నిరుపేదలు కట్టుకునే ఇళ్లకు సంబంధించిన పత్రాలు చూపించి ఫ్రీగా ఇసుకను తీసుకోవచ్చు. దీనిని ఆసరాగా చేసుకున్న కొందరు ఎలాంటి పత్రాలు చూపించకుండానే ట్రాక్టర్లలో అధిక లోడ్‌తో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. మా సిబ్బంది అడ్డుకుంటే మాకు ప్రభుత్వం చెప్పింది.. మీరెవరు ఆపడానికి అంటూ డ్రైవర్లు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. పట్టుకున్న వెంటనే మాపై ఒత్తిడి తీసుకురావడంతో వదిలేయాల్సి వస్తున్నది. చేసేదేమీ లేక సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.
– విజయలక్ష్మి, తహసీల్దార్, టేకుమట్ల