దేవరుప్పుల, జూన్ 23 : జనగామ జిల్లా దేవరుప్పులలో ఎస్ఎస్ -39 ట్రాన్స్ఫార్మర్ను ఆదివారం యుద్ధ ప్రాతిపదికన ట్రాన్స్కో అధికారులు బిగించారు. దేవరుప్పులలో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి 15 రోజులైనా అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు పోసుకున్న నార్లు, దున్నిన దుక్కులు ఎండిపోయాయి. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండాపోయింది. ఈ క్రమంలో ‘ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి 15 రోజులాయె’ శీర్షికతో ఆదివారం నమస్తే తెలంగాణలో కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన ట్రాన్స్కో సీఎండీ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. దీంతో కదిలిన యంత్రాంగం వెంటనే కొత్త ట్రాన్స్ఫార్మర్ను బిగించి రైతుల కష్టాలను తీర్చింది.