అన్ని రంగాల్లో ముందువరుసలో ఉంటూ దేశానికే ఆదర్శంగా ఉంటున్న తెలంగాణ.. మహిళా సాధికారతలోనూ స్ఫూర్తిగా నిలుస్తున్నది. మన మహిళల ఆర్థిక శక్తి ఇప్పుడు దేశానికి ‘పొదుపు పాఠాలు’ చెప్పే స్థాయికి ఎదిగింది. రాష్ట్ర ప్రభుత్వ చేయూతను అందిపుచ్చుకొని ఆర్థికాభివృద్ధి సాధిస్తూ స్వయం సహాయక సంఘాలను విజయవంతంగా నిర్వహిస్తున్న తీరును తెలియజేస్తున్నారు.
ఇప్పటికే దేశంలోని 17 రాష్ట్రాల్లో మహిళా సంఘాల బలోపేతం కోసం మనోళ్లు శిక్షణ ఇవ్వగా ప్రస్తుతం లడాక్ సహా కార్గిల్, లేహ్ ప్రాంతాలకు వెళ్లనున్నారు. రెండు నెలల పాటు సాగే ఈ ట్రైనింగ్ కోసం హనుమకొండ జిల్లాలోని 20మంది సీఆర్పీలు, 10మంది సీసీలతో కూడిన బృందం సిద్ధంకాగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అన్ని ఏర్పాట్లుచేయడంతో పాటు అక్కడి వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ప్రత్యేక వసతులు కల్పించనున్నది.
– వరంగల్, మే 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
వరంగల్, మే 12(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహిళా సంఘాలు ఎలా పని చేయాలి, అందరు కలిసి పేదరికాన్ని ఎలా దూరం చేసుకొని ఆర్థిక అభివృద్ధి ఎలా సాధించాలనే అంశాలపై తెలంగాణ మహిళలు దేశానికి పాఠాలు చెప్పేస్థాయికి ఎదిగారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న చేయూతతో మహిళలు తాము ఆర్థికంగా ఎదుగుతున్న తీరును అన్ని రాష్ర్టాల వారికి వివరించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటివరకు 17 రాష్ట్రాల్లోని మహిళా సంఘాల బలోపేతంలో కీలకంగా వ్యవహరించిన మన మహిళలు ఇప్పుడు లడక్ బయల్దేరనున్నారు. జమ్మూకశ్మీర్ పేరుతో ప్రత్యేక అధికారాలతో ఉన్న ఈ రాష్ట్రాన్ని మూడున్నరేండ్ల క్రితం రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చింది. కొత్తగా ఏర్పడిన లడక్‌లో అన్ని రాష్ర్టాల్లో మాదిరిగానే మహిళా స్వయం సహాయ సంఘాల ఏర్పాటు ప్రక్రియ మొదలైంది.
మహిళా సంఘాలను విజయవంతంగా నడిపించడంలో తెలంగాణ దేశంలోనే ముందున్నది. ఆర్థిక అంశాల నిర్వహణలో మహిళలు ముందున్నారు. హనుమకొండ జిల్లాలోని మహిళా సంఘాల్లోని సభ్యులు ఇప్పుడు లడక్ వెళ్లి అక్కడి మహిళలకు శిక్షణ ఇవ్వనున్నారు. లడక్‌లోని మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు అనుగుణంగా లడక్ పరిపాలన యంత్రాంగం, ఇక్కడి మహిళా సంఘం మధ్య ఇప్పటికే ఒప్పందం జరిగింది. లడక్‌లోని మహిళలకు ఇచ్చే శిక్షణపై ఇక్కడి మహిళలు సిద్ధమయ్యారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వీరికి శిక్షణ పూర్తయ్యింది. 20మంది కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్(సీఆర్పీ), 10మంది కమ్యూనిటీ కోఆర్డినేటర్ల(సీసీ)తో కూడిన బృందం ఈ నెలలోనే లడక్ వెళ్లేందుకు సిద్ధమైంది.
లడక్‌తో పాటు కార్గిల్, లేహ్ ప్రాంతాల్లోనూ మహిళా సంఘాల సభ్యులు శిక్షణ ఇవ్వనున్నారు. అక్కడి ప్రాంతాల్లోని వారి సమన్వయంతో హిందీలో వివరించేందుకు సిద్ధమయ్యారు. మహిళా సంఘాల నిర్వహణ, ముఖ్యంగా ఆర్థిక నిర్వహణ, ఉమ్మడిగా ఆర్థిక సాధికారత సాధన అంశాలను ఈ బృందంలోని సభ్యులు వారికి వివరించనున్నారు. సీఆర్పీలు రెండు నెలల పాటు వీరు అక్కడే ఉండి శిక్షణ ఇస్తారు. సీసీలు మరికొంత కాలం అక్కడే ఉండి సంఘాలను బలోపేతం చేసేందుకు శిక్షణ ఇస్తారు. లడక్‌లోని వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వసతులు కల్పించి అందరికీ ఇన్సురెన్స్ చేయించింది. అక్కడి వాతావరణంలో గాలి తక్కువగా ఉండే పరిస్థితులు ఉండడం వల్ల అవసరమైన జాగ్రత్తలు చేపట్టింది.
మన రాష్ట్రంలో విజయవంతంగా నడుస్తున్న మహిళా సంఘాలను చూసి ఇరుగు పొరుగు రాష్ర్టాలు ఆసక్తి కనబరిచాయి. మహిళా సంఘాల నిర్వహణలో శిక్షణ కోసం మన మహిళ సంఘాలతో ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందాలు కుదుర్చుకోవడం మొదలుపెట్టాయి. ఇలా ఓరుగల్లు మహిళా సమాఖ్యలోని మహిళలు దేశంలోని చాలా రాష్ర్టాల్లోని మహిళా సంఘాల నిర్వహణకు శిక్షణ ఇచ్చారు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నది. ఇద్దరు బుక్ కీపర్స్, ముగ్గురు సీఆర్పీలు కలిసి ఒక బృందంగా ఉంటారు. వీరు ఆయా రాష్ర్టాలకు వెళ్లి సంఘాలకు శిక్షణ ఇస్తారు. ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరాఖండ్ ఇలా దాదాపు 17 రాష్ట్రాల్లోపాటు అండమాన్ నికోబార్ దీవుల్లోని మహిళా సంఘాల నిర్వహణపై మన వాళ్లు అవగాహన కల్పించారు.
2014లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మన ప్రభుత్వంతో సంప్రదించి శిక్షణ కోసం ఓరుగల్లు మహిళా సమాఖ్యతో ఒప్పందం కుదుర్చుకున్నది. ఇప్పుడు ఓరుగల్లు మహిళా సమాఖ్యతో పాటు రాష్ట్రంలోని చాలా సంఘాల్లోని మహిళలు ఇతర రాష్ర్టాలకు వెళ్లి శిక్షణ ఇస్తున్నారు. ఇతర రాష్ర్టాల్లో శిక్షణ ఇచ్చేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మహిళలకు హిందీ, ఇతర భాషలు వారికి వచ్చేలా నిరంతరం శిక్షణ కార్యక్రమం కొనసాగుతున్నది. మన దేశంలోని ఇతర రాష్ర్టాలతో పాటు వెనిజులా, ఘనా దేశాల్లోనూ సహకార ఆర్థిక వ్యవస్థపై అవగాహన కల్పించడం కోసం ఓరుగల్లు మహిళా సమాఖ్య ప్రతినిధులు అక్కడికి వెళ్లారు.
మహిళల ఆర్థిక సాధికారత లక్ష్యంగా ఏర్పడిన మహిళా స్వయం సహాయ సంఘాల నిర్వహణ మన రాష్ట్రంలో అద్భుతంగా ఉంటున్నది. వేల కోట్ల రుణాలను పొంది తిరిగి చెల్లించడంలో మన మహిళలు ముందున్నారు. ప్రభుత్వ లక్ష్యం పూర్తిస్థాయిలో నెరవేరేలా కొన్ని మహిళా సంఘాలు వినూత్న ప్రణాళికతో ముందుకు వెళ్లాయి. స్కూలు ఫీజులు, పిల్లల పుస్తకాల ఖర్చులు, వ్యవసాయ పెట్టుబడులకు డబ్బులు లేక ఇబ్బందిపడే పరిస్థితులను అధిగమించే లక్ష్యంతో సంఘాలను సంఘటితం చేశారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రస్తుతం హనుమకొండ జిల్లాలోని ధర్మసాగర్ మండలంలో ఇది మొదలైంది. ఈ మండలంలోని ప్రతి మహిళా సంఘం ప్రతి వారం కచ్చితంగా సమావేశం అయ్యేలా ప్రణాళిక రూపొందించారు. మహిళలు, అధికారులు ఈ విషయంలో బాగా కృషి చేశారు. కొన్ని నెలల్లోనే సాధించారు. ప్రతి సంఘంలోని మహిళలు ప్రతి వారం తప్పనిసరిగా సమవేశం కావడం అలవాటుగా మార్చుకున్నారు. ఆ వారంలో వసూలైన డబ్బులను ఒకరికి ఇచ్చి ష్యూరిటీ, తిరిగి చెల్లింపులపై కచ్చితంగా వ్యవహరించారు.
కొన్ని నెలల్లోనే ధర్మసాగర్ మండలంలోని అన్ని సంఘాలు ప్రతి వారం సమావేశం కావడం, ఆర్థిక నిర్వహణ పక్కాగా జరగడం పరిపాటిగా మారింది. ఇదే స్ఫూర్తితో ప్రతి ఉమ్మడి జిల్లాల్లోని కొన్ని మండలాల్లో దీన్ని అమలు చేశారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఇదే ప్రణాళికతో ముందుకుసాగారు. ప్రతి వారం సమావేశం తప్పనిసరిగా నిర్వహించేలా ధర్మసాగర్‌లోని మహిళా సంఘాల్లోని మహిళలు రాష్ట్ర వ్యా ప్తంగా అన్ని మండలాలకు శిక్షణకు వెళ్లారు. ఆ తర్వాత విజయవంతంగా నడుస్తున్న సంఘాల్లోని వారు ఇలాగే చేయడం మొదలైంది. ఇప్పుడు రాష్ట్రంలోని చాలా సంఘాల్లోని వారు శిక్షణ ఇచ్చేలా అయ్యారు.
ఇదొక గొప్ప అనుభూతి
మహిళా సాధికారతలో కీలకమైనది ఆర్థిక సాధికారత. తెలంగాణ రాష్ట్రంలోని మహిళలు ఆర్థిక సాధికారతలో ముందంజలో ఉంటున్నారు. మన మహిళా సంఘాల విజయాలు స్ఫూర్తిదాయకంగా ఉంటున్నా యి. ఇతర రాష్ర్టాల్లోని మహిళా సంఘా ల బలోపేతంలో తెలంగాణ మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారు. మహిళా సంఘాల నిర్వహణలో ప్రతి వారం మీటింగ్ ప్రాధాన్యతను అందరికీ తెలియజెబుతున్నాం. మన మహిళలు ఇతర రాష్ర్టాల్లోని వారికి మోడల్‌గా ఉండడం ఎంతో గొప్ప అనుభూతి.
– పసునూరి నీలవేణి, డీఆర్డీఏ-డీపీఎం, హనుమకొండ జిల్లా