నర్సంపేట, డిసెంబర్ 22: అపర మేధావి మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు. బహుభాషాకోవిదుడు. దేశ ఆర్థిక సంస్క రణల పితామహుడు. తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన మహా మేధావి. రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. గత కాంగ్రెస్ పాలకులు ఆయనను విస్మరించినా బీఆర్ఎస్ సర్కారు పీవీకి సముచిత గౌరవం ఇచ్చింది. జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించింది. నేడు నర్సింహారావు వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాల దొంతరే ఈ కథనం.. పీవీ నర్సింహారావు స్వస్థలం వంగర. పుట్టింది మాత్రం నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామం.
గ్రామానికి చెందిన ప్రముఖ భూస్వామి వద్దిరాజు మాణిక్యరావు-శ్యామాబాయి దంపతులకు నలుగురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉ న్నారు. వీరిలో చివరి కూతురు రుక్మిణీదేవి-సీతారామరావు దంపతులకు 1921జూన్ 28న పీవీకి జన్మనిచ్చారు. 1976 లో పీవీ నర్సింహారావు లక్నేపల్లి గ్రామంలోని మేనమామ కొ డుకు వద్దిరాజు శ్యాంరావు ఉపనయనానికి వచ్చారు. అప్పు డు ఆయనను కలిసి పలకరించిన పలువురు స్థానికులు అప్ప టి జ్ఞాపకాలను ఈసందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.
దక్షిణ భారతదేశంలో తొలి ప్రధానిగా పీవీ నర్సింహారావుకు తెలంగాణకే వన్నెతెచ్చారు. రాజ నీతిజ్ఞుడిగా, బహుభాషాకోవిదుడిగా, నవభారత నిర్మాతగా ప్రఖ్యాతి గాంచారు. కవి, రచయిత, కథకుడు, అనువాదకుడు, పాత్రికేయుడుగా ఆయన తెలుగు సాహిత్యానికి చేసిన సేవలు వెలకట్ట లేనివి. పార్లమెంట్ సభ్యుడిగా, విదేశాంగ మంత్రిగా, ప్రధాన మంత్రిగా దేశానికి ఎన్నో సేవలం దించిన పీవీని గత ప్రభుత్వాలు, ప్రస్తుత కాంగ్రె స్ ప్రభుత్వం విస్మరించింది. ఆర్థిక సంస్కరణకు ఆరాధ్యుడైన పీవీ నర్సింహారావుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో అరుదైన గౌరవం లభించింది. ఏటా అధికారికంగా జ యంతి, వర్ధంతిని నిర్వహించారు. నేడు ఆయన 21వ వర్ధంతిని అంతటా ఘనంగా జరుపుకోనున్నారు.
పీవీ నర్సింహారావు 1951లో రాజకీయాల్లో చేరి 1957-72 మధ్య కాలంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1967లో మంత్రిగా, 1971లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో ఆయన భూ సంస్కరణలు అమలు చేసి పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. 1973-75 మధ్య కాలంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా, 1977లో హోం, విదేశాంగ శాఖల మంత్రిగా పనిచేశారు. ఆ తరువాత హోంశాఖ, మానవవనరుల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 1991లో దేశ అత్యున్నత ప్రధాని పీఠాన్ని అధిష్టించారు. 2004 డిసెంబర్ 23న పీవీ నర్సింహారావు కన్నుమూశారు.
పీవీ జ్ఞాపకాలను గుర్తు చేసేలా ఆయన కూతురు, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి ఏటా జయంతి, వర్ధంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు. నర్సంపేట మండలం లక్నేపల్లిలో 2018లో ఆరు గుంటల స్థలంలో పీవీ స్మారక మందిరాన్ని (పీవీ మెమోరియల్ ట్రస్టు) నిర్మించారు. అందులో పీవీ కాంస్య విగ్రహాన్ని, పీవీ ఫొటో గ్యాలరీ ఏర్పాటు చేశారు.