సుబేదారి, అక్టోబర్ 20 : శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో ఎంతో మంది పోలీసులు ప్రాణత్యాగం చేశారు. వారి త్యాగాలను స్మరిస్తూ పోలీసు శాఖ సోమవారం నుంచి 31వరకు పోలీసు ఫ్లాగ్‌డే కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. వరంగల్ పోలీసు కమిషనరేట్‌లో సోమవారం పోలీసు అమరవీరుల స్తూపం వద్ద వివిధ సంఘటనల్లో నక్సల్స్ చేతుల్లో అమరులైన పోలీసులకు శ్రద్దాంజలి ఘటించి, శోక్ శస్త్ర పరేడ్ నిర్వహిస్తారు. తర్వాత కమిషనరేట్ నుంచి అశోకా జంక్షన్ వరకు కవాతు చేస్తారు. భారత్-చైనా సరిహద్దుల్లోని అక్సాయ్ చిన్ వద్ద జరిగిన ఘటనలో అసువులు బాసిన భారత అమర జవానుల త్యాగాలకు ప్రతీకగా దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలను కోల్పోయిన పోలీసులను స్మరిస్తూ తొలిసారి అక్టోబర్ 21, 1959లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా జరుపుకున్నారు. ఈ నెల 31వ తేదీ వరకు డివిజన్ల వారీగా రక్తదాన శిబిరాలు, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లకు పోలీసు విధులపై ప్రతిభా పోటీలు, పోలీసులు వినియోగించే ఆయుధాలపై ఆన్లైన్ పద్ధతిలో ఓపెన్ హౌస్, నగరంలోని ప్రధాన జంక్షన్ల వద్ద పోలీసు అమరవీరులను స్మరిస్తూ ప్రదర్శనలు నిర్వహిస్తారు. ప్రజలు, విద్యార్థులు పాల్గొని పోలీసు అమరవీరుల కుటుంబాలకు బాసటగా నిలువాలని సీపీ అంబర్ కిశోర్ ఝా పిలునిచ్చారు. కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారు మూడు దశాబ్దాల పాటు నక్సల్స్‌కు, పోలీసులకు మధ్య భీకర పోరు జరిగింది. 1985లో కాజీపేట రైల్వేస్టేషన్లో ఎస్సై యాదగిరిరెడ్డిని నక్సల్స్ కాల్చిచంపారు. ఆ తర్వాత కరుణాపూరం, స్టేషన్‌ఘన్‌పూర్, ఊరుగొండ, జాకారం, పస్రా తదితర ప్రాంతాల్లో నక్సల్స్ జరిపిన బాంబు పేలుళ్లలో 61మంది పోలీసులు అమరులయ్యారు. వీరిలో డీఎస్సీ నుంచి సీఐలు, ఎస్సైలు, ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డు వరకు ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, స్వరాష్ట్రంలో వరంగల్ పోలీసులకు నక్సల్స్ అణిచివేత, శాంతిభద్రతల పరిరక్షణలో దేశంలోనే ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.