కాళేశ్వరం/పాలకుర్తి/హనుమకొండ చౌరస్తా, నవంబర్ 14 : శివ కేశవులకు ప్రీతిపాత్రమైన కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉమ్మడి వరంగ ల్ జిల్లాలోని శైవ, వైష్ణవ ఆలయాలు ముస్తాబయ్యాయి. శివాలయాల్లో ఉదయం 4.30 గంటల నుంచే మహా న్యాస, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకాలతో పూజలు ప్రారంభం కానున్నాయి. పూజలు, దానాలు, జపాలు, ఉపవాస దీక్షలు చేసే వారికి పుణ్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. ప్రత్యేకించి దీపారాధన సర్వశ్రేష్టమైనదిగా, దీపదానం చేస్తే సకల పాపాలు తొలగి మోక్షం కలుగుతుందని భావిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున హరుడు త్రిపురాసురుడిని సంహరించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. దీనిని స్మరిస్తూ మహిళలు శుక్రవారం తులసి చెట్టు వద్ద 365 వత్తులను నేతితో తడిపి దీపం వెలిగిస్తారు. ప్రతి ఇంటిలో చిన్నాపెద్దా తేడా లేకుండా తలంటు స్నానం ఆచరించి పూజలు చేయడంతో పాటు ఆలయాలను దర్శించుకుంటారు.
శివారాధన చేసే భక్తులు రోజం తా ఉపవాస దీక్షలు చేస్తూ ప్రదోషకాలంలో స్వామిని అభిషేకించి మారేడు దళాలతో పూజిస్తారు. హనుమకొండలోని వేయిస్తంభాల ఆలయం, వరంగల్ కాశీబుగ్గలోని కాశీవిశ్వేశ్వరాలయం, జయశంకర్ భూపాలపల్లిలోని కాళేశ్వర, ముక్తీశ్వర ఆలయం, జనగామ జిల్లాలోని పాలకుర్తి శ్రీ సోమేశ్వరస్వామి, కొడవటూరు సిద్దులగుట్ట, ములుగు జిల్లా వెంకటాపురంలోని రామప్ప తదితర ఆలయాలకు భక్తులు వేలాదిగా తరలిరానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. కాగా, కార్తీక పౌర్ణమి సందర్భంగా గురువారం వరంగల్ నగరంతో పాటు ఆయా పట్టణాల్లోని మార్కెట్లు కిటకిటలాడాయి. ఉసిరి కొమ్మలు, వత్తులు, పూలు, పండ్లు, ప్రమిదలు, ఇతర పూజా సామగ్రి కొనుగోలుతో సందడిగా మారాయి.
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం, హరి హరులకు నిలయమైన జనగామ జిల్లా పాలకుర్తిలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని శుక్రవారం ఆఖండ జ్యోతిని నిర్వహించనున్నారు. అరుణాచలం, తిరువణ్ణమలై స్ఫూర్తితో ఈ ఆలయంలో అఖండ జ్యోతి వెలుగుతున్నది. పాలకుర్తి ఆలయ గుట్టపై 8 అడుగుల వెడల్పు, 4 అడుగుల ఎత్తులో ప్రత్యేకంగా రూపొందించిన భారీ ప్రమిదలో ఒక టన్ను నువ్వుల నూనె, ఆవు నెయ్యి, 2 క్వింటాళ్ల ముద్ద కర్పూరంతో అఖండ జ్యోతిని ఏటా వెలిగిస్తున్నారు. వేలాదిగా తరలివచ్చే భక్తుల సమక్షంలో సాయంత్రం 5 గంటలకు గిరి ప్రదక్షిణ అనంతరం అఖండ జ్యోతిని వెలిగిస్తారు.