వెంకటాపూర్, సెప్టెంబర్ 10 : ములుగు జిల్లాలో పెద్దపులి కదలికలు బుధవారం మళ్లీ కనిపించాయి. ఈ నెల 4న వెంకటాపూర్ మండలంలోకి ప్రవేశించిన పెద్దపులి మరుసటి రోజు పాలంపేట వానగుట్టకు చేరుకొని అదృశ్యమైంది. అప్పటి నుంచి పులి జాడ కోసం ములుగు ఎఫ్ఆర్వో డోలి శంకర్ తన సిబ్బందితో కలిసి రామాంజాపూర్ వైపు గాలించారు. అయినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో పులికి ప్రమాదమేదైనా సంభవించిందా? అనే అనుమానాలు రేకెత్తాయి.
కాగా, బుధవారం సాయంత్రం వానగుట్ట అటవీ మార్గం నుంచి ఎల్లారెడ్డిపల్లి గ్రామ పొలాలు, ఉప్పరిపల్లి చెరువు కట్టమీదుగా మేడారం అడవుల వైపు వెళ్తున్న పులిని చూసిన పశువుల కాపర్లు గ్రామస్తులు, అటవీశాఖ అధికారులకు విషయాన్ని తెలిపారు. దీంతో పంటపొలాలను పరిశీలించిన అధికారులు పులి పాదముద్రలు గుర్తించారు. ఈ మేరకు రాత్రి సమయంలో గ్రామస్తులు బయటకు రావొద్దని, రైతులు, కూలీలు, పశువుల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కాగా, పొలాల్లో పనిచేస్తున్న కూలీలు, పశువుల కాపర్లు పులి సంచారం విషయం తెలుసుకొని రోజుకంటే ముందే ఇళ్లకు చేరుకున్నారు.