హైదరాబాద్, మార్చి 12(నమస్తే తెలంగాణ) : ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో తమ వివరాల నమోదులో సాంకేతిక లోపాలను సరిచేసి సకాలంలో వేతనాలు విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని మారెట్ కమిటీల సెక్యూరిటీగార్డులు ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు గురువారం వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ను కలిసిన మారెట్ కమిటీల సెక్యూరిటీగార్డుల యూనియన్ (సీఐటీయూ)రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల సాంబ య్య, ప్రధాన కార్యదర్శి యాటల సోమన్న వినతిపత్రం అందజేశారు. పోర్టల్ తప్పిదాలతో 1,200 మందికి 4 నెలలుగా వేతనాలు అందడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు.
హైదరాబాద్, మార్చి 12(నమస్తే తెలంగాణ) : యాసంగిలో అన్ని పంటలు కలిపి 79.33 లక్షల ఎకరాల్లో సాగైనట్టు వ్యవసాయశాఖ వెల్లడించింది. ఈ సీజన్లోనూ వరి సాగు హవా కొనసాగింది. 58.69 లక్షల ఎకరాల్లో వరి, 11.70 ఎకరాల్లో మక్కజొన్న సాగైంది. గతంతో పోల్చితే వరి, మక్కజొన్న, జొన్న సాగు పెరుగగా.. శనగ, వేరుశనగ, పెసర, మినుము సాగు తగ్గింది. నిరుడు శనగ 2.20 లక్షలు, ఈ సీజన్లో 1.91 లక్షల ఎకరాల్లో, వేరుశనగ నిరుడు 2.4 లక్షలు, ఈ సీజన్లో 1.97 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైంది.