సరిహద్దు అడవుల్లో మళ్లీ పెద్దపులి సంచరించడం ప్రజలను కలవరపెడుతోంది. ఏటా ఇదే సీజన్లో మన అడవుల్లోకి వస్తోంది. 2021, 2022 కనిపించిన పులి.. రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ ఇప్పుడు ప్రత్యక్షం కావడంతో అలజడి నెలకొంది. కొద్దిరోజులుగా మహారాష్ట్ర నుంచి గోదావరి దాటిన పులి వాజేడు, వెంకటాపూర్, మల్లూరు మీదుగా భూపాలపల్లి జిల్లా సరిహద్దు అడవుల్లో(తాడ్వాయి సమీపం) జాడలు కనిపిస్తుండడంతో అటవీ శాఖ అప్రమత్తమైంది. ఇలా రోజుకో ప్రాంతం లో తిరుగాడుతున్న పులి.. ఏ మార్గంలో ఎటువైపు వెళ్తుందో తెలియాల్సి ఉంది. అయితే మహారాష్ట్రలో ఆధిపత్య పోరు కారణంగా గోదావరి నది దాటి మనుగడ కోసమే మన అడవుల వైపు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అటవీ అధికారులు పులి కోసం అన్వేషిస్తుండగా భూపాలపల్లి, చెల్పూరు, దూదేకులపల్లి రేంజ్ అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి సరిహద్దు అడవుల్లో పులిజాడలను కెమెరా ట్రాప్‌ల ద్వారా వెతుకుతున్నారు. సరిహద్దు అడవులు చాలా దట్టమైనవని, ఇందులో పులి వేట అంత సులువు కాదని, ఇటువైపు పులి రాకపోవచ్చనే అభిప్రాయపడుతున్నారు.
– జయశంకర్ భూపాలపల్లి, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ)
తాడ్వాయి అడవుల్లో పులి సంచారంతో అది భూపాలపల్లి జిల్లా అడవుల్లోకి వస్తుందా అనే కోణంలో అటవీ అధికారులు అన్వేషణ కొనసాగిస్తున్నారు. తాడ్వాయి మండలం పంబాపూర్ అడవుల్లో పులి సంచరించగా అది అక్కడినుంచి 360 డిగ్రీ కోణంలో రోజుకు 25 కిలోమీటర్లు వెళ్తుందని, పంబాపూర్ నుంచి దూదేకులపల్లి గుండా భూపాలపల్లి అడవుల్లోకి వస్తుందా? ఏటూరునాగారం, గుండాల వైపు వెళ్తుందా? అనే విషయమై కెమెరా ట్రాప్‌ల ద్వారా పరిశీలిస్తామని ఒక అటవీ అధికారి తెలిపారు. 2021లో జిల్లాలోని కొయ్యూరు అడవుల్లో పులి సుమారు 15 రోజులు సంచరించిందని, 2022లోనూ పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల సరిహద్దుల్లో తిరుగాడడంతో పాటు ముత్తారం శివారు గుట్టలో పశువులపై దాడి చేసిందని అధికారులు చెబుతున్నారు. కాటారం దొబ్బలపాడు అటవీ బీట్‌లో పులి కెమెరా ట్రాప్‌లకు చిక్కింది. 2021, 2022లో వచ్చిన పులులు రెండు ఒక్కటి కావని, వేర్వేరు పులులని గుర్తించారు. కాగా 2023లో మాత్రం సరిహద్దుల్లో పులి ఆచూకీ లేదు.
కవ్వాలతో పాటు ఇంద్రావతి, తడోబా టైగర్ జోన్ల లో పులుల్లో ఆధిపత్య పోరు కొనసాగుతుండడంతో సరిహద్దు దాటి ఇటువైపు వస్తున్నాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో తడోబా టైగర్ జోన్లో చాలా పులులు మృత్యువాత పడుతున్నాయని, అలా గే కాగజ్‌నగర్ అటవీ ప్రాంతంలో పులుల సంఖ్య పెరుగడంతో దాడులు పెరిగిపోతున్నాయని చెబుతున్నారు. మేటింగ్ సీజన్ అయిపోయినా సరిహద్దు దాటి రావడం ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నట్లు తెలుపుతున్నారు. 2022లో మహారాష్ట్రలోని చీమూరు జిల్లాలో రెండు పులుల మధ్య జరిగిన దాడిలో ఒక పులి చనిపోయిందని, తడోబా అభయారణ్యంలో మరో పులి, వరోరా అటవీ రేంజ్ పరిధిలో ఒక పులి, పలాస్‌గావ్ అటవీ ప్రాంతంలో మరో పులి, సిండేవాహి రేంజ్లో విద్యుత్ షాక్‌తో మరో పులి మృతిచెందిందని అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఈ పరిణామాల నేపథ్యంలో మహారాష్ట్ర నుంచి పులులు గోదావరి దాటుతున్నట్లు తెలుస్తోంది. గోదావరి నదిలో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ నీటిలో పులులు చాలా బాగా ఈదగలవని అటవీ అధికారులు తెలుపుతున్నారు.
మంగపేట, డిసెంబర్ 13 : మారుమూల అటవీ ప్రాంత గ్రామం కొత్తూరు మొట్లగూడెం పంచాయతీ పరిధి బొమ్మాయిగూడెం సమీప పులిగండి ఒర్రెలో శుక్రవారం పెద్దపులి కనిపించినట్లు స్థానిక గిరిజనుడు జబ్బ పొట్టయ్య తెలిపాడు. ఎప్పటిలాగే చీపురు పుల్లల కోసం అడవికి వెళ్లిన తనకు పులిగండి ఒర్రెలో పెద్దపులి కనిపించగా సేకరించిన చీపురు పుల్లలు అక్కడే వదిలేసి పరుగు తీసి ప్రాణాలు కాపాడుకున్నానని చెప్పాడు. పొట్టయ్యకు పులి కనిపించిన విషయం అటవీ అధికారులకు చీకటి పడ్డాక తెలిసింది.
శనివారం సిబ్బందితో కలిసి పులిగండి ప్రాంతాన్ని పరిశీలిస్తామని ఇన్చార్జి రేంజ్ అధికారి అశోక్‌కుమార్ తెలిపారు. చుంచుపల్లి వద్ద గోదావరి దాటి తిమ్మాపురం మీదుగా వచ్చిన పెద్ద పులి తాడ్వాయి మండల పరిధి అడవిలోకి వెళ్లిందని అటవీ అధికారులు ప్రకటించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే పులి కనిపించిందని చీపురు సేకరణకు వెళ్లిన వ్యక్తి ద్వారా తెలియడంతో కొత్తూరుమొట్లగూడెం, బొమ్మాయిగూడెం గ్రామాల ప్రజలు మళ్లీ ఆందోళనలో పడ్డారు. పులి సంచారంపై కచ్చితమైన సమాచారమిచ్చి ప్రజల్లో నెలకొన్న ఆందోళనను తొలగించాలని స్థానికులు అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు.