మహదేవపూర్(కాళేశ్వరం)/కాటారం, ఫిబ్రవరి 16 : మహదేవపూర్ మండలంలోని బీరసాగర్, అన్నారం అడవుల్లో, కాటారం మండలం గుండ్రాత్‌పల్లి గ్రామ శివారులో పులి సంచరిస్తున్నదనే సమాచారంతో అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టినా దాని జాడ తెలియడం లేదు. దీంతో పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఆదివారం పులి ఆచూకీ కోసం అన్నారం, బీరసారగ్ అటవీ క్షేత్రాల్లో అటవీ శాఖ అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.
ప్రత్యేకంగా ట్రాప్ కెమెరాలను సైతం అక్కడక్కడా ఏర్పాటు చేశారు. అదిలాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక యానిమల్ ట్రాకింగ్ టీం సభ్యులు పులి ఫగ్ మార్క్‌లను పరిశోధిస్తున్నారని అధికారులు తెలిపారు. సమీప గ్రామాల పశువుల కాపరులు, ప్రజలు అడవుల్లోకి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. పులి ఆనవాళ్లను గుర్తిస్తే వెంటనే సమాచారం అందించాలని సూచించారు. అదేవిధంగా గుండ్రాత్‌పల్లి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలోకి వెళ్లిన పలువురు పెద్దపులి జాడలను చూసి భయంతో వెనక్కి తిరిగి వచ్చి చెప్పడంతో అటవీ శాఖ అధికారులు దాని అడుగులను పరిశీలించారు.