చిట్యాల, డిసెంబర్ 28 : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలం జడల్పేట రెవెన్యూ గ్రామ శివారులో పులి సంచారం కలకలం రేపింది. పత్తి చేనులో కట్టివేసి ఉన్న ఎద్దుపై దాడి చేసి సుమారు 100 మీటర్ల దూరం లాక్కెళ్లింది. వివరాలిలా ఉన్నాయి.. జడల్పేట గ్రామ శివారు గాంధీనగర్‌కు చెందిన బొట్ల రాజపోశయ్య వ్యవసాయ క్షేత్రం వద్ద ఆదివారం ఉదయం ఎద్దు రక్తపు మడుగులో మృతి చెంది ఉండడంతోపాటు ఆవు దేహంపై పులి గోర్లతో దాడి చేసిన ఆనవాళ్లు కనిపించాయి. వెంటనే పశువైద్యాధికారులు, పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో వారు తెల్లవారుజామున 2 నుంచి 3 గంటల సమయంలో పులి దాడి వల్ల ఎద్దు మృతి చెందినట్లు భావించారు. ఫారెస్ట్ అధికారులు అడుగులతో మొగ పులిగా గుర్తించి గ్రామ శివారులోని చెరువు వైపు వెళ్లినట్లు ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు.
అనంతరం డీఎఫ్‌వో నవీన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఫారెస్ట్ అధికారులతో కలిసి ఎద్దు మృతదేహాన్ని పంచనామా చేశారు. పులి సంచారంతో చుట్టుపక్కల గ్రామాలైన జడల్పేట, గాంధీనగర్, భీష్మనగర్, రామచంద్రాపూర్, కైలాపూర్, శాంతినగర్ గ్రామవాసులు భయాందనోళకు గురవుతున్నారు. పంట చేన్లలోకి వెళ్లాంటే రైతులు జంకుతున్నారు. గ్రామాల్లో డప్పు చప్పుళ్లతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు జీపీ సిబ్బందిలతో టాంటాం చేయించారు. రాత్రిళ్లుగా ఒంటరిగా వెళ్లొద్దని, అత్యవసరమైతే గుంపులు గుంపులుగా వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శ్రావణ్ కుమార్, ఎస్సై-3 ఈశ్వరయ్య, ఎఫ్ఆర్వో చంద్రమౌళి, డీఆర్వో రత్నజ్యోతి, ఎఫ్ఎస్వో ప్రవీ ణ్‌కుమార్, ఫారెస్ట్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కాగా, చుట్టుపక్కల గ్రామాల రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సిరిశెటి సంకీర్త్ సూచించారు. పులి కదలికలు గమనించిన వెంటనే పోలీస్‌స్టేషన్, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.