వరంగల్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : చారిత్రక నగరం వరంగల్ ఆధునికంగా రూపుదిద్దుకోనున్నది. హైదరాబాద్ తరహా ప్రాజెక్టులు వస్తున్నాయి. గ్రేటర్ వరంగల్ నగరంలో అత్యాధునిక రీతిలో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం కాబోతున్నది. హైదరాబాద్‌లోని హైటెక్స్ తరహాలోనే వరంగల్ నగరంలో వీటెక్స్ పేరుతో దీన్ని నిర్మించనున్నారు. వీటెక్స్ నిర్మాణ పనులు త్వరలోనే మొదలుకానున్నాయి. ఈ మేరకు టీఎస్ఐఐసీ ఏర్పాట్లు చేస్తున్నది. పరిశ్రమల మంత్రి కే తారకరామారావు వీటెక్స్ నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభించనున్నారు.
మడికొండ ఐటీ పార్కులో 10 ఎకరాల విస్తీర్ణంలో వీటెక్స్ను చేపట్టనున్నారు. రెండున్నర లక్షల చదరపు అడుగుల నిర్మాణ ప్రదేశం ఉండేలా దీన్ని నిర్మించనున్నారు. రూ.175 కోట్లతో నిర్మించేలా ప్రణాళిక సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మౌలికసదుపాయాల సంస్థ(టీఎస్ఐఐసీ) ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ప్రాజ్టెక్టును చేపట్టింది. ఇటీవలే ఈ ప్రాజెక్టు డిజైన్‌ను ఆమోదించింది. వీటెక్స్లో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, త్రీ స్టార్ హోటల్ ఉంటుంది. వీటెక్స్ నిర్మాణం పూర్తయితే వరంగల్ నగరంలో అంతర్జాతీయ స్థాయి సదస్సులు, కార్యక్రమాలకు వేదిక కానుంది. సభలు, సమావేశాలు, సదస్సులు, ప్రదర్శనలు, పెద్ద కార్యక్రమాలను నిర్వహించుకునేలా అన్ని సదుపాయాలు ఉంటాయి. వీటెక్స్ నిర్మాణం, నిర్వహణ అంతా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్(పీపీపీ) విధానంలో ఉంటుంది.
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరంగా ఉన్న వరంగల్ హైటెక్స్ తరహాలో వీటెక్స్ను నిర్మించాలని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పరిశ్రమలు, ఐటీ మంత్రి కేటీఆర్‌కు ఈ మేరకు గతంలో లేఖ ఇచ్చారు. ఐటీ సంస్థలు ఎక్కువగా ఉన్న మడికొండలోని ఔటర్ రింగు రోడ్డుకు ఆనుకుని వీటెక్స్ను నిర్మించాలని ప్రతిపాదించారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ప్రతిపాదనకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వరంగల్‌లో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. పరిశ్రమల శాఖ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు పరిశ్రమల శాఖ ఈ ఏడాది జూన్ 18న ఉత్తర్వులు జారీ చేసింది.
ఔటర్ రింగు రోడ్డు మార్గంలో మడికొండ ఐటీ పార్కులో వీటెక్స్ నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని టీఎస్ఐఐసీని ఆదేశించింది. వరంగల్ నగరంలో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, త్రీస్టార్ హోటల్ నిర్మాణ ప్రక్రియ మొదలుకావడంపై పరిశ్రమల మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.