ఏటూరునాగారం, డిసెంబర్ 12 : ఆ ఇంటి నుంచి ముగ్గురు సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. ఒకే కుటుంబంలో తండ్రీ కొడుకులు సర్పంచ్‌లుగా పనిచేయగా, గురువారం జరిగిన ఎన్నికల్లో మూడో తరం కోడలు పోటీలోకి దిగి విజయం సాధించారు. ఏటూరునాగారం గ్రామ పంచాయతీగా ఏర్పాటైన తర్వాత తొలి సర్పంచ్‌గా కాకులమర్రి గోపాల్‌రావు 1953 నుంచి ఐదేండ్ల పాటు పనిచేశారు. ఆయనకు ఇద్దరు కుమారులు విజయరామారావు, చక్రధర్‌రావు. విజయరామారావు ఐపీఎస్ అధికారిగా పనిచేయడమే కాకుండా రాజకీయంగా రోడ్లు భవనాల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు.
ఆయన ఏటూరునాగారంలో ఆర్టీసీ బస్టాండు కోసం ప్రత్యేకంగా స్థలం కేటాయించారు. 1981లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గోపాల్‌రావు రెండో కుమారుడు చక్రధర్‌రావు పోటీ చేసి సర్పంచ్‌గా ఎన్నికై 1988 వరకు కొనసాగారు. ఈ సమయంలో తరచూ వాగు, గోదా వరి వరద ముంపునకు గురవుతున్న మానసపల్లిని ఆకులవారి ఘనపూర్‌కు తరలించారు. ల్యాండ్ అసైన్డ్‌మెంట్ చైర్మన్‌గా పనిచేసి పలువురికి ఇంటి స్థలాలు ఇప్పించారు. వాగులో అడ్డుగా రాతితో కట్టలు కట్టించి వాగును మళ్లించి గ్రామాన్ని ముంపు నుంచి కాపాడారు.
ఈసారి ఏటూరు నాగారం సర్పంచ్‌కు రిజర్వేషన్ అన్ రిజర్వుడ్ మహిళ కావడంతో చక్రధర్‌రావు కుమారుడు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారావు సతీమణి శ్రీలతకు అవకాశం దక్కింది. గతంలో ఆయన కుటుంబం, లక్ష్మీ నర్సింహారావు చేసిన సేవలు ఈ ఎన్నికల్లో కలిసొచ్చింది. గత ప్రభుత్వ హయాంలో అంబులెన్స్ అందించారు. ఏటూరునాగారంలో క్రాస్‌రోడ్డులో భారీ ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. అనేక సేవా కార్యక్రమాలకు ఆప్తుడుగా ఉంటూ ఆర్థికంగా సహాయాన్ని అందించారు.
తమ కుటుంబం అనాది నుంచి గ్రామ సర్పంచ్‌గా సేవలందిస్తున్నదని, అందులోభాగంగానే ప్రజలు ఈసారి కూడా ఓటు వేసి తమను గెలిపించారని, వారి ఆదరాభిమానానికి బానిసై పనిచేస్తానంటున్నారు. తమ మామ, తాతయ్యలే కాకుండా బంధువులు కూడా సర్పంచ్‌గా పనిచేశారని, పెద్ద గ్రామ పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా తాము అభివృద్ధికి పాటు పడుతామని ఈ సందర్భంగా శ్రీలత పేర్కొంటున్నారు. తమను గెలిపించిన అందరి రుణం తీర్చుకుంటామని చెబుతున్నారు.