Warangal | వరంగల్ చౌరస్తా : అకస్మాత్తుగా మంటలు చెలరేగిన ఘటనలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిల్లుపూరు హేమ్ కుమార్, ఆనంద్ కుమార్ ఇద్దరు సోదరులు. వ్యాపార అవసరాల నిమిత్తం కాజీపేట యూనియన్ బ్యాంక్లో కోటి రూపాయలకు పైగా లోన్ తీసుకోవడం జరిగింది. బ్యాంకు లావాదేవీలు అంతరాయం రావడం, నిబంధనల ప్రకారం గడువు ముగియడంతో బ్యాంక్ అధికారులు బ్యాంకు ఆధీనంలో ఉన్న ఇంటిని వేలంపాటలో సంపత్ కుమార్ అనే వ్యక్తికి అమ్మకం జరిపారు. ఆస్తిని సంపత్ కుమార్కు అప్పగించడం కోసం బ్యాంకు అధికారులు శనివారం జేపిఎన్ రోడ్లోని తనఖా ఉంచిన భవనం వద్దకు చేరుకున్నారు. తమ ఆస్తి కేసు కోర్టులో ఉండగా బ్యాంకు అధికారులు అమ్మకం జరపడాన్ని వ్యతిరేకిస్తూ హేమ్ కుమార్, ఆనంద్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి అధికారులను అడ్డుకున్నారు. తమ ఆస్తిని స్వాధీనం చేసుకున్నట్లయితే తాము ఆత్మహత్య చేసుకుంటామని పెట్రోల్ జల్లుకొని అధికారులపై బెదిరింపులకు పాల్పడ్డారు. ఇంతలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పెట్రోల్ జల్లుకున్న ఆనంద్ కుమార్ (60), తేజస్వి(35) (హేమ్ కుమార్ కోడలు), ప్రశాంత్(32) (ఆనంద్ కుమార్ అల్లుడు)లకు మంటలు అంటుకున్నాయి. వెంటనే స్థానికులు స్పందించి మంటలను ఆర్పి వేశారు. వైద్య చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
విచారణ చేపట్టిన పోలీసులు
విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక ఇంతేజార్గంజ్ పోలీసులు విచారణ చేపట్టారు. మంటలు చెలరేగడానికి గల కారణాలపై సమీక్షించారు. బాధితులు అంటించుకున్నారా లేక మరెవరైనా అగ్ని రాజేశారా, బ్యాంక్ అధికారులు ఆస్తిని స్వాధీనం చేసుకోవడానికి తాళాలను తొలగించే క్రమంలో వినియోగించిన కట్టర్ మూలంగా మంటలు చేలరేగాయా అనే అంశాలను పరిశీలిస్తున్నారు.