స్టేషన్ ఘన్పూర్, ఏప్రిల్ 14 : కాళేళ్వరం వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన ఘటన స్టేషన్ ఘన్పూర్ మండలం రాఘవాపూర్ శివారు జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమలాపురానికి చెందిన సత్తి రాజేశ్వర్ రావు, అనంతలక్ష్మి కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని గాజులరామారంలో ఉంటున్నారు. వీరి కుమారుడు సత్తి శ్రీను సివిల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు.
కాగా రాజేశ్వర్‌రావు, అనంతలక్ష్మి, కుమారుడు శ్రీను (45), కోడలు రమణకుమారి (42), మనుమడు అరవింద్, మనుమరాలు అనూష(22) కారులో కాళేశ్వరానికి వెళ్లి వస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టేషన్ ఘన్పూర్ మండలం రాఘవాపూర్ శివారు జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టారు. దీంతో శ్రీను, రమణకుమారి, అనూష అక్కడికక్కడే మృతి చెందారు.
రాజేశ్వర్‌రావు, అనంతలక్ష్మి, అరవింద్‌లకు తీవ్ర గాయాలు కాగా, వారిని జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. విషయం తెలుసుకున్న స్టేషన్ ఘన్పూర్, రఘునాథపల్లి సీఐలు జీ వేణు, శ్రీనివాస్ రెడ్డి, ఎస్సైలు వినయ్ కుమార్, బండి శ్రవణ్ కుమార్, నరేశ్, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సుమారు గంటన్నర పాటు శ్రమించి మృతదేహాలను అంబులెన్స్‌లో జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు.ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా చూశారు. కాగా, లారీ డ్రైవర్ పారిపోయాడు. జనగామ డీసీపి రాజమహేంద్రనాయక్, ఏసీపి భీంశర్మ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు.