లింగాలఘనపురం, జూన్ 18 : రోడ్డు ప్రమాదం ముగ్గురిని బలి తీసుకున్నది. బొలెరో వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. వారిలో ఒకరికి ఆరు నెలల క్రితమే వివాహం కాగా, మరొకరికి పెండ్లి నిశ్చయమై, వచ్చే నెలలో జరగాల్సి ఉంది. ఇంకొకరు సాయం చేసేందుకు వచ్చి మృత్యువాత పడ్డాడు. ఈ ప్రమాదం హైదరాబాద్-వరంగల్ హైవేపై జనగామ జిల్లా కేంద్రం సమీపంలోని నెల్లుట ్ల వద్ద గురువారం తెల్లవారుజామున జరిగింది. లింగాలఘనపురం ఎస్సై బండి శ్రావణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ రాష్ర్టానికి చెందిన జాట్ దిలీప్‌కుమార్ చౌదరి జనగామ జిల్లా దేవరుప్పులలో కిరాణం షాపు నిర్వహిస్తున్నాడు. అతడి తమ్ముడు జాట్ రోహిత్ కుమార్‌చౌదరి(22) ప్రైవేటు కారు డ్రైవర్‌గా చేస్తూ అన్న వద్ద ఉంటున్నాడు.
ఈ క్రమంలో దిలీప్‌కుమార్ చౌదరి యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం బండకొత్తపెల్లికి చెందిన ననుబాల మహేశ్(29) బొలేరో వాహనాన్ని కిరాయికి తీసుకున్నాడు. కిరాణా షాపునకు సామగ్రి తీసుకొచ్చేందుకు బుధవారం హైదరాబాద్‌కు వెళ్లాడు. అక్కడ సామాను తీసుకున్న అనంతరం రాత్రి తిరిగి వస్తుండగా హైదరాబాద్-వరంగల్ హైవేపై నెల్లుట్ల ఫ్లైవర్ బ్రిడ్జి సమీపంలో బొలేరో వాహనం టైర్ పంక్చర్ అయ్యింది. దిలీప్కుమార్చౌదరి దేవరుప్పులలోని తన తమ్ముడు రోహిత్ కుమార్చౌదరికి సమాచారం ఇచ్చి జాకీని తీసుకు రమ్మనగా మోపెడ్ వాహనంపై అతడు అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో చేరుకున్నాడు.
ఇదిలా ఉండగా హైదరాబాద్ నుంచి హనుమకొండకు వెళ్తున్న మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బీరిషెట్టిగూడేనికి చెందిన లారీ డ్రైవర్ దొనికెని రాజేందర్(29) బొలేరో వాహనం వద్ద టైర్‌ను అమర్చడానికి వారు పడుతున్న బాధను చూసి లారీని రోడ్డుపక్కన నిలిపి సాయం చేస్తున్నాడు. ననుబాల మహేశ్, జాట్ రోహిత్‌కుమార్‌చౌదరి, రాజేందర్ బొలేరో వాహనానికి టైర్ అమర్చుతుండగా దిలీప్కుమార్చౌదరికి ఫోన్ వచ్చింది. దీంతో అతడు పక్కకు వెళ్లాడు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి హనుమకొండకు వెళ్తున్న మరో లారీ అతివేగంగా వస్తూ బొలేరో వాహనాన్ని ఢీకొంది.
ఈ ఘటనలో ననుబాల మహేశ్, జాట్ రోహిత్‌కుమార్‌చౌదరి, రాజేందర్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఢీకొట్టిన లారీ డ్రైవర్ సుకేందర్కు స్వల్ప గాయాలయ్యాయి. మృతుడు మహేశ్‌కు ఆరు నెలల క్రితం వివాహమైంది. రోహిత్‌కుమార్‌కు వివాహం నిశ్చయమై మరో నెలలో జరగాల్సి ఉంది. రోడ్డు ప్రమాద సమాచారం తెలుసుకున్న స్థానిక ఎస్సై బండి శ్రావణ్‌కుమార్ మృతదేహాలను పోస్టుమార్టంకు జనగామకు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.