హనుమకొండ, నవంబర్ 12: చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరాలయంలో కార్తీక మాసోత్సవాల్లో భాగంగా బుధవారం రుద్రేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి 51 కిలోల పెరుగన్నంతో మిర్యాలపొడి, పెరుగును మిలితంచేసి స్వామివారికి వేదోక్తంగా మహాన్నపూజ నిర్వహించి కాలభైరవునిగా అలంకరించారు. సాయంత్రం పరమశివభక్తులైన శ్రీనివాస్-లలిత దంపతుల ఆధ్వర్యంలో ఆలయ నాట్యమండపంలో సహస్ర లింగార్చన వేదపండితుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాదవితరణ చేశారు.
భక్తులు, మహిళలు ఆలయ ప్రాంగణంలోగల దేవతా వృక్షాల వద్ద రావి, వేపచెట్టు కలిసిన వృక్షం దగ్గర ఉసిరిక, మారేడు, జమ్మి వృక్షాల కింద దీపాలు వెలిగించుకున్నారు. ఈనెల 15న సామూహిక సత్యనారాయణ వత్రాలు నిర్వహించనున్నారు. వైదిక కార్యక్రమాలను ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, వేదపండితులు గంగు మణికంఠశర్మ, ప్రణవ్, శ్రవణ్ శాస్త్రోక్తంగా నిర్వహించారు. పూజా కర్యాక్రమాలను ఈవో అనిల్‌కుమార్ పర్యవేక్షించారు. ఆలయ సిబ్బంది ఎన్.మధుకర్, రామకృష్ణ, రజిత భక్తులకు సేవలందించారు. 108 పుట్టమట్టితో తయారు చేసిన శివలింగాలకు మహాలింగార్చన నవరసములతో, పంచామృతాలతో, సుగంధ ద్రవ్యములతో ఏకావరణ, రుద్రాభిషేకం నిర్వర్తించి, పుష్పార్చన నిర్వర్తించారు.