బయ్యారం అక్టోబర్ 2 : ఏటీఎంలే లక్ష్యంగా దొంగతనాలకు తెగబడుతూ సినీఫక్కీలో రూ.28లక్షలు ఎత్తుకెళ్లిన అంతర్రాష్ట ముఠా ఎట్టకేలకు చిక్కింది. సీసీఫుటేజీలు, వేలిముద్రల సాయంతో రాజస్థాన్‌కు చెందిన ప్రధాన నిందితుడిని పట్టుకోవడమే గాక అతడితోనే సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయించి రిమాండ్‌కు పంపారు. వివరాలిలా ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 17న అర్ధరాత్రి మహబూబాబాద్ జిల్లా బయ్యారం బస్టాండ్ సెంటర్లోని ఏస్బీఐ ఏటీఎంను దొంగలు పగుల గొట్టి రూ. 28.70 లక్షలు చోరీ చేశారు.
మరుసటి రోజు ఉదయం ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకునేందుకు వచ్చిన వారు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు వేలిముద్రలు, సీసీ ఫుటేజీలు, ఇతర ఆనవాళ్ల ఆధారంగా రాజస్థాన్‌కు చెందిన అంతర్రాష్ట్ర దొంగలపనేనని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అప్పటినుంచి వారిని పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్నారు.
బుధవారం మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు, సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో నిందితుడిని ఏటీఎం వద్దకు తీసుకొచ్చి సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయించి చోరీ చేసిన తీరును తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా పలోడి ప్రాంతానికి చెందిన అబ్దుల్ గని మరికొందరితో కలిసి ఫిబ్రవరిలో బయ్యారంలోని ఎస్బీఐ ఏటీఎంలో దొంగతనానికి పాల్పడినట్లు తెలిపారు.
కారులో వచ్చిన నిందితులు గ్యాస్ కట్టర్ సాయంతో ఏటీఎంను బద్దలు కొట్టి కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే చోరీ పూర్తి చేశారన్నారు. ప్రధాన సూత్రధారి అబ్దుల్ గనిపై పలు రాష్ర్టాల్లో ఏటీఎంలలో చోరీ చేసిన కేసులతో పాటు రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో ఛీటింగ్ కేసులున్నట్లు తెలిపారు. ఏటీఎంలను టార్గెట్ చేసి చాకచక్యంగా చోరీకి పాల్పడుతున్న అబ్దుల్ గనిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. అంతర్రాష్ట్ర ఏటీఎం దొంగను పట్టుకున్న ఎస్సై తిరుపతి, సీఐ రవికుమార్, డీఎస్పీ తిరుపతిరావును మానుకోట ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అభినందించారు.