మహదేవపూర్, మే 12 : సరస్వతి అంత్య పుష్కరాల పనులు నత్తనడకన సాగుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు అంత్య పుష్కరాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా చేపట్టిన పనులు గడువులోగా పూర్తవుతాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 18ని డెడ్‌లైన్‌గా ప్రభు త్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. గడువు సమీపిస్తుండడంతో అధికారులు హడావిడిగా పనులు కానిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.1.20 లక్షల నిధులతో మ్యూజి యం, రూ.30లక్షలతో నాగదేవత ఆలయం, రూ. 2 కోట్ల తో ఆదిముక్తీశ్వర ఆలయం నుంచి సరస్వతి (వీఐపీ) ఘా ట్ వరకు సీసీ రోడ్డు, రూ.కోటితో విద్యుత్ లైన్లు, రూ. 1.20లక్షలతో ప్రాకార మరమ్మతు పనులు జరుగుతున్నాయి. రూ. 46 లక్షలతో అక్షరాభ్యాస మండప నిర్మాణ పనులు పిల్లర్ల స్థాయిలోనే నిలిచిపోయాయి.
అలాగే సరస్వతి (వీఐపీ) ఘాట్ వద్ద సరస్వతి మాత విగ్రహానికి నలు దిక్కులా స్వాగత తోరణాలు, భారీ సెట్టింగ్‌లు ఏర్పాటు చేసే పనులు ప్రారంభించారు. త్రివేణి సంగమ తీరంలో ఇసుకపై సుమారు 900 మీటర్ల పొడవునా చలువ పంది ల్లు, కాశీ వేద పండితులతో నిర్వహించనున్న నదీ హారతి కార్యక్రమాన్ని వీక్షించేందుకు వీలుగా ప్రత్యేక గ్యాలరీ, 40 టెంట్ సిటీల నిర్మాణం చేపట్టనున్నారు. అయితే అంత్య పుష్కరాలకు తొమ్మిది రోజులే మిగిలి ఉండగా, ఆలోగా పనులు పూర్తవుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది.