ఆశించిన వానల్లేక ఎవుసం ముందుకుసాగడం లేదు. అదును దాటుతున్నా వరుణుడు కరుణించక జల్లులకే పరిమితమైన మోస్తరు వర్షం అన్నదాతకు ఊరటనివ్వడం లేదు. గతేడాది ఇదే సమయానికి చెరువులు మత్తళ్లు దుంకి, ప్రాజెక్టులకు వరద చేరి రైతాంగం వర్షానందంతో వ్యవసాయ పనుల్లో నిమగ్నం కాగా ఈ ఏడాది మాత్రం అటు వాతావరణ శాఖ, రైతుల అంచనాలను తలకిందులు కావడంతో చాలాచోట్ల అడుగంటిన చెరువులు, పారకం లేని చెక్‌డ్యాములు బోసిపోయి దర్శనమిస్తున్నాయి. ఫలితంగా లక్షా 12వేల ఎకరాల్లో వరి సాగయ్యే ములుగు లాంటి జిల్లాలో సీజన్ మొదలై 45 రోజులైనా ఇప్పటివరకు కేవలం 1100 ఎకరాల్లో మాత్రమే వరి నాట్లు వేయడం వర్షపాతం లోటును తెలియజేస్తున్నది. అదును దాటుతుండడంతో వరి నార్లు నారుమడి దశలోనే ముదిరిపోతుండడంతో నాట్లేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కూలీలకు చేతినిండా పనిలేక నిరాశే మిగులుతోంది. ఒకవేళ ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వరికి ఉరేనని రైతన్న దిగాలు చెందుతున్నాడు.
వరి పంటకు ప్రాణాధారమైన వరుణుడు ఈసారి ముఖం చాటేయడంతో పాటు ముందస్తు ప్రణాళికలు లేని పాలకుల పుణ్యమా అని పంట కాలువలు కూడా నిస్తేజంగా వెక్కిరిస్తున్నాయి. దీంతో వరి నార్లు నారుమడి దశలోనే ముదిరిపోయి అన్నదాతల వైపు బేలగా చూస్తూ దుఃఖిస్తున్నాయి. వానకాలం సగం పూర్తి కావస్తున్నా వర్షాలు మాత్రం అంతంత మాత్రంగానే కరుణించాయి. హనుమకొండ జిల్లాలో లక్షా 50వేల ఎకరాల్లో సాధారణ వరి సాగు ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనాలు వేసింది. ఈ మేరకు అధికారులు ప్రభుత్వానికి నివేదికలు కూడా ఇచ్చారు. ఈసారి ముందస్తుగానే నైరుతి రుతుపవనాలు రాష్ర్టానికి వచ్చేస్తాయని వాతావరణ శాఖ సైతం అంచనా వేయడంతో రైతులు సంతోషించారు. వెనుకాముందు ఆలోచించకుండా ఉత్సాహంగా రోహిణి కార్తెలోనె వరి నార్లు పోసుకున్నారు. అయితే ప్రతి ఏడాది దీర్ఘకాలపు సన్నరకం పంటలే వేసే రైతులు మాత్రమే రోహిణి కార్తెలో నార్లు పోసుకునే వారు. అయితే ఇందుకు విరుద్ధంగా సన్నరకం వడ్లకు మాత్రమే సబ్సిడీ ఇస్తామని ప్రభుత్వం చెప్పడంతో మెజార్టీ రైతులు ఆశకు దీర్ఘకాలిక సన్నరకం వడ్లను పండించేందుకు సిద్ధమయ్యారు. జిల్లాలో 27 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం కాగా ఇప్పటివరకు 30 సెం.మీ వర్షపాతం నమోదైనప్పటికీ చెరువుల్లోకి చుక్క నీరు వచ్చింది లేదు. మొత్తం 740 చిన్న, పెద్ద చెరువులు ఉంటే అందులో 10 శాతం కూడా నీరు రాలేదు. దీంతో మే చివరి వారంలో నార్లు పోశారు. అయితే వర్షాలు మాత్రం వాతావరణ శాఖ అంచనాలను తలకిందులు చేస్తూ చిరుజల్లులకే పరిమితం అవుతున్నాయి. దీంతో నార్లు మడి దశలోనే ముదిరిపోతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో బావుల సౌకర్యం ఉన్న రైతులు తమకున్న పూర్తి విస్తీర్ణం కాకుండా నీళ్లు అందిన మేరకు ఎకర, అర ఎకర విస్తీర్ణంలో నాట్లు వేస్తున్నారు. నాట్లు ముమ్మరంగా ఉంటాయని అన్ని గ్రామాలకు ఏజెంట్ల ద్వారా వందలాది మంది వలస కూలీలు ఇతర రాష్ర్టాల నుంచి వచ్చి చేరారు. వారికి చేతి నిండా పనిలేకపోవడంతో నిరాశలో ఉన్నారు. స్థానిక మహిళా కూలీలకు సైతం పనిలేకుండా పోయింది. పంట పొలాల్లో బలం కోసం విరివిగా వేసుకున్న పచ్చిరొట్ట ఎరువులను సైతం దున్నే సమయం మించిపోవడంతో ముదిరి చెట్లను తలపిస్తున్నాయి.
హనుమకొండ జిల్లా వ్యవసాయరంగానికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు అనుబంధంగా ఉండే కాకతీయ కాలువ ఆయువుపట్టుగా నిలుస్తుంది. దీనికి కరీంనగర్‌లోని లోయర్ మానే రు డ్యాం(ఎల్ఎండీ) నుంచి నీళ్లు విడుదల చేస్తారు. 24 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్‌లో ప్రస్తుతం 6 టీఎంసీల నీరే నిల్వ ఉంది. ఇవి కరీంనగర్ నగర ప్రజలకు తాగునీటికి కూడా సరిపోవని తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని కొన్ని పంపులను నడిపి నీటిని పంపింగ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆచరణలో పెట్టలేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఇప్పటికైనా వర్షాలు పడని పక్షంలో ఎన్నడూ లేని స్థాయిలో కాకతీయ ఆయకట్టు ఎడారిని తలపించే ప్రమాదముందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లా దక్షిణ, ఎగువ భాగం వ్యవసాయరంగానికి ఇతోధికంగా సహాయం అందించే జే చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం నీరు కూడా ఈసారి ఆలస్యమే అయిం ది. మేడిగడ్డలో సాంకేతిక కారణాల వల్ల అందులో ఉన్న నీటిని దిగువకు వదిలారు. దీంతో తుపాకులగూడెం (సమ్మక్క) బరాజ్ నుంచి నీరు వృథాగా సముద్రం పాలైంది. దీంతో వేసవిలో చుక్క నీరు కూడా లేకుండా పోయింది. ఇప్పుడు కూడా గోదావరికి వరద మొదలై నెల కావస్తున్నా పంపింగ్ మాత్రం ఆలస్యంగా ప్రారంభించారు. మంగళవారం నాటికి రెండో దశ మోటార్ నుంచి ధర్మసాగర్ రిజర్వాయర్‌కు నీరు చేరింది. బుధవారం మరో పంపు కూడా పోస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ రెండు మోటర్లు నడిస్తే ధర్మసాగర్ రిజర్వాయర్ నిండేందుకు 20 రోజులు పడుతుంది. అప్పటికీ అదును దాటి పోతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
ములుగు జిల్లాలో వానకాలం సీజన్లో 1,12,189 ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా. అయితే ఇప్పటివరకు కేవలం వెయ్యి నుంచి 1100 ఎకరాల్లో మాత్రమే నాట్లు వేశారని అధికారులు చెబుతున్నారు. దీంతో జిల్లాలో ఒక్క శాతం కూడా వరి నాట్లు పూర్తి కాలేదని చెప్పవచ్చు. జిల్లాలో 320 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం ఉండగా ఇప్పటివరకు 366.2 మి.మీ వర్షపాతం నమోదైంది. వెంకటాపూర్, ములుగు, వాజేడు మండలాల్లో స్వల్ప వర్షపాతం నమోదు కాగా గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, వెంకటాపురం(నూగూరు), మంగపేట మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. అప్పుడప్పుడు కురుస్తున్న వర్షాలను చూసి కొన్ని ప్రాంతాల్లో రైతులు ఇప్పటివరకు నార్లు కూడా పోయలేదు. వానలు కురుస్తాయని ఆశించి వరి నార్లు పోసిన వారు నాటు వేసేందుకు పొలాల్లో సమృద్ధిగా నీరు లేని కారణంగా నాట్లు వేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో కొన్ని గ్రామాల్లో అక్కడక్కడా నార్లు ముదిరిపోయి కనిపిస్తున్నాయి. మరో 15 రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిసి చెరువులు, కుంటల్లో నీరు చేరితేనే వ్యవసాయ పనులు ముమ్మరంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి.