వరంగల్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుపై సొంతపార్టీలోనే తిరుగుబాటు ముసలం పుట్టింది. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి తగ్గుతున్న ఆదరణకు ఇది సంకేతమని స్పష్టమవుతున్నది. పార్టీలు మారింది తాము కాదని, మంత్రి, ఎమ్మెల్యేలు పచ్చి అవకాశవాదులని కాంగ్రెస్ పార్టీ ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు బాహాటంగా వి మర్శిస్తున్నారు. మంత్రి, ఎమ్మెల్యే అని చూడకుండా ఆ పార్టీ శ్రేణులు మీడియా సమావేశాలు పెట్టి సవాళ్లు విసురుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇంతటి దుర్మార్గ సంస్కృ తి మునుపెన్నడూ చూడలేదని నిప్పులు చెరుగుతున్నారు. ‘అసలు కాంగ్రెస్ ఎవరో సమయం వచ్చినప్పు డు తేలుస్తాం’ అని హెచ్చరించారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ వార్ ముదిరింది.
ఇటీవల మంత్రి కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన కీలక నేతలు ఆమెపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. మంత్రి కొండా సురేఖ ‘చిల్లరగాళ్లు’ అని చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ఆ వివాదం సద్దుమణగక ముందే మళ్లీ గురువారం న ర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిపై ఆయన సొంత మండల కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం పెట్టి తూ ర్పారబట్టారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే ‘తస్మాత్ జాగ్రత్త’ అని హెచ్చరించారు. సర్పంచ్ ఎన్నికల్లో మేజర్ గ్రామ పంచాయతీల్లో ఓటమిపాలైనందుకు నైతిక బాధ్య త వహిస్తూ ఎమ్మెల్యే రాజీనామా చేయాలని, లేకపోతే అధిష్టానం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అసలు కాంగ్రెస్ కాదని, తమదే అసలైన కాంగ్రెస్ అని నర్సంపేట నియోజకవర్గ నేతలు తేల్చిచెప్పారు. ఎమ్మెల్యే సొంత మండలం చెన్నారావుపేటకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు మాధవరెడ్డి తీరును నిరసించారు. ‘నువ్వు (ఎమ్మెల్యే మాధవరెడ్డి) టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీకి మారినట్లు మేమూ, మా కుటుంబాలు మారలే. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా.. లేకున్నా, పదవులున్నా.. లేకున్నా పార్టీని నమ్ముకున్న కుటుంబాలు మావి’ అని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యే సొంత గ్రామం అమీనాబాద్లోని ఆయన ఇల్లున్న వార్డు సభ్యుడిని గెలిపించుకోవానికి రూ. 50 లక్షలు ఖర్చుచేశారని ధ్వజమెత్తారు.
పార్టీ కోసం తాము కష్టపడి పనిచేస్తుంటే, చెప్పుడు మాటలు వింటూ తమను సస్పెండ్ చేసే అధికారం ఎవరిచ్చారు? అని ప్రశ్నించారు. తమను సస్పెండ్ చేసే అధికారం దొంతి మాధవరెడ్డికి ఎకడిదని, నియోజకవర్గంలోని అన్ని మేజర్ పంచాయతీల్లో, మండల కేంద్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని, అందుకు ఎమ్మెల్యే నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అసలు కాంగ్రెస్ పార్టీలో ఇవాళ ద్రోహులకే స్థానం ఉందన్నారు.
ఎమ్మెల్యే అహంకార ధోరణి ఇప్పటికైనా మార్చుకోవాలని హితవు చెప్పారు. మొత్తానికి వరంగల్ జిల్లాలో వరంగల్ తూర్పులో మంత్రి సురేఖ, నర్సంపేటలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ శ్రేణులు వేర్వేరు శిబిరాలుగా విడిపోయి సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకుంటున్నారు. అయితే, వరంగల్ తూర్పులో ఒక శిబిరానికి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తోడ్పాటునందిస్తున్నారనే ఆరోపణలున్నా, తాజాగా నర్సంపేటలో మాత్రం కాంగ్రెస్ శ్రేణులే ఎమ్మెల్యేపై తిరుగుబావుటా ఎగురవేయడం గమనార్హం.