మానుకోట రవాణా శాఖలో పైసలిస్తేనే ఫైల్ కదులుతది.. లేదంటే అది లేదు ఇదిలేదంటూ అనేక కొర్రీలు పెడుతూ చెప్పులరిగేలా తిప్పిస్తారు. అధికారులు, సిబ్బంది మామూళ్లకు అలవాటు పడి వాహనదారులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. డ్రైవింగ్ లైసెన్స్, రెన్యువల్, వాహనాల రిజిస్ట్రేషన్లు, తదితర పనుల కోసం వచ్చే వారి పత్రాలపై ఏజెంట్ల కోడ్ ఉంటేనే అవి పాస్ అవుతాయి. లేదంటే వాటిని పక్కకు పడేస్తారు. గతంలో ఇదే శాఖలో ఓ ఎంవీఐ ఏసీబీకి పట్టుబడినా అధికారుల తీరు మారడం లేదు. అవినీతి నిరోధక శాఖ అధికారులు ఈ శాఖ వైపు ఓ కన్నేసి ఉంచాలని వాహనదారులు కోరుతున్నారు.
– మహబూబాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ)
ఇటీవల గూడూరు మండలానికి చెందిన ఓ విద్యార్థి 2 వీలర్ రిజిస్ట్రేషన్ కోసం ఏజెంట్లను సంప్రదించకుండా నేరుగా వెళ్లాడు. ఆ ఫైల్ మీద ఏజెంట్ కోడ్ భాష లేకపోవడంతో మధ్యాహ్నం 3 గంటలు దాటినా రిజిస్ట్రేషన్ చేయలేదు. దీంతో అకడున్న సిబ్బందితో గొడవకు ది గాడు. అనంతరం సంబంధిత శాఖ అధికారి వద్దకు వెళ్లి ప్రశ్నించగా ‘నీకు హెల్మెట్ ఉంది కానీ ఫైల్లో దానికి సంబంధించిన బిల్లు లేదు’ అని చెప్పాడు. షో రూమ్ నిర్వాహకుడు ఇవ్వలేదని చెప్పినా వినిపించుకోలేదు. చేసేదేమీ లేక అడిగినంత ఇచ్చుకొని తన పని పూర్తి చేసుకున్నాడు.
మానుకోట రవాణా శాఖలో ప్రతి ఫైలుకు పైసలివ్వనిదే ముందుకు కదలడం లేదు. నిత్యం లెర్నింగ్, శాశ్వత లైసెన్స్, రెన్యువల్, వాహనాల రిజిస్ట్రేషన్లు, తదితర పనుల కోసం వందలాది మంది వస్తుంటారు. వాహనదారుల వీక్నెస్ను ఆసరాగా చేసుకొని కొంతమంది అధికారులు, సిబ్బంది వసూళ్ల పర్వానికి తెర లేపారు. ఏ శాఖలోనైనా కిందిస్థాయి సిబ్బంది తప్పు చేస్తే అధికా రులకు ఫిర్యాదు చేస్తారు. ఇక అధికారులే తప్పు చేస్తే వాహనదారులు ఎవరికి చెప్పాలో తెలియక దికుతోచని స్థితిలో ఉన్నారు. లెర్నింగ్ లైసెన్స్ కోసం స్లాట్‌లో బుక్ చేసుకుని ఆఫీస్‌కు వెళ్లిన దగ్గర నుంచి పూర్తయ్యే వరకు పెద్ద తతంగం నడుస్తుంది.
కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వారు, లేని వారిని సైతం ముకుపిండి వసూలు చేస్తున్నారు. శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ కోసం వచ్చేవారు కూ డా డబ్బులు ఇవ్వనిది టెస్ట్ పాస్ చేయడం లేదు. బైక్‌లతో పాటు ఆటోలు, కార్లు, లారీ లు, ట్రాక్టర్లు, ఇలా కొత్తగా కొనుగోలు చేసిన రకరకాల వాహనాల రిజిస్ట్రేషన్ కోసం రవాణా శాఖకు రాక తప్పదు. ఏజెంట్ల ద్వారా పోయిన వారికే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఏజెంట్లు ఫైల్ మీద తమ కోడ్ భాష వేస్తారు. అది ఉంటేనే పాస్ చేస్తారు. లేదంటే అనేక కొర్రీలు పెడుతూ రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపుతున్నారు.
నెల్లికుదురు మండలంలో..
నెల్లికుదురు మండలంలోని ఓ వ్యక్తి టూ వీలర్ అండ్ ఫోర్ వీలర్ శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అతడి వద్ద కారు లేకపోవడంతో అక్కడున్న వ్యక్తి వాహనం నడి పి చూపించాలని అధికారి చెప్పాడు. అనంతరం ఆ కారు వ్యక్తికి రూ. 500 చెల్లించాలని ఆదేశించాడు. ఎందుకివ్వాలని నిలదీసినా వినకపోవడంతో తన వద్ద ఉన్న రూ. 300 చెల్లించి వెళ్లిపోయాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు నిత్యం 200 నుంచి 300 మంది రవాణా శాఖకు వస్తుంటారు. వీరి వద్ద నుంచి అధికారులు, సిబ్బంది కుమ్మకై ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారు.