హనుమకొండ చౌరస్తా, మే 20 : కేయూ వైస్ చాన్స్‌లర్ తాటికొండ రమేశ్‌పై వస్తున్న అవినీతి, అక్రమాలపై విచారణ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ కమిటీ మంగళవారం యూనివర్సిటీకి రానున్నట్లు సమాచారం. ఈ నెల 21న వీసీ పదవీ కాలం ముగియనుండటంతో ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టనున్నారు. రమేశ్ 2021 జూన్ 24న వీసీగా బాధ్యతలు స్వీకరించారు. వీసీగా నియామకం జరిగినప్పటి నుంచే వివాదాలు మొదలయ్యాయి. కేయూలోని కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతంతో పాటు అధ్యాపకుల నియామకాల్లో అక్రమాలు, పీహెచ్డీ అడ్మిషన్లలో అవకతవకలు, అధిక మెస్ బిల్లులతో పాటు ఆర్ట్స్‌కాలేజీ ఫీజుల నిధుల మాయంపై విచారణ చేపట్టనున్నారు. వీసీ పదవీ కాలం ముగియనుండటంతో వర్సిటీకి మంచిరోజులు రాబోతున్నాయని విద్యార్థులు, అధ్యాపకులు భావిస్తున్నారు.