జయశంకర్ భూపాలపల్లి, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన శిలాఫలకాలు సిగ్గుపడుతున్నాయి.. రెండేళ్ల ప్రజాపాలనను వెక్కిరిస్తున్నాయి.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అభివృద్ధి పనులు శంకుస్థాపనలకే పరిమితమయ్యాయి.. కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేశామంటున్న అధికార పార్టీ నేతల మాటలు నీటి మూటలయ్యాయి.. పాలన ఫలకాలకే పరిమితం కావడం.. పనుల్లో పురోగతి లేకపోవడం.. కనీసం ఒక్క గ్రామానికి కూడా రోడ్డు వేసి ఆర్టీసీ బస్సును పునరుద్ధరించకపోవడం ప్రజల ఆగ్రహానికి కారణమవుతున్నాయి.. గత ప్రభుత్వం మంజూరు చేసిన నిధులే ఖర్చు చేస్తున్నారని.. నాడు మొదలు పెట్టిన పనులనే కొనసాగిస్తున్నారని.. బీఆర్ఎస్ హయాంలోని అభివృద్ధే ప్రస్తుతం కళ్లముందు కనిపిస్తున్నదనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
పాలకుల పనితీరుకు వారు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వేసిన శిలాఫలకాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న తరువాత చేసిన శంకుస్థాపనల పనులు ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదు. చిట్యాల మండలం బావుసింగ్‌పల్లి నుంచి ముచినిపర్తికి రూ.1.50 కోట్లతో, ఆర్అండ్బీ రోడ్డు నుంచి జూకల్ వరకు రూ 1.25 కోట్లతో బీటీ రోడ్డు పనులకు 2024 అక్టోబర్ 20న శిలాఫలకం వేశారు. ఏడాది దాటినా ఇప్పటికీ ప్రారంభం కాలేదు. అలాగే రేగొండ నుంచి గర్మిళ్లపల్లి వరకు కల్వర్టుల నిర్మాణానికి రూ. 2 కోట్లతో 2024 డిసెంబర్ 1న శిలాఫలకం వెక్కిరిస్తున్నది. ఎమ్మెల్యే సొంత మండలమైన గణపురంలో రేణుక ఎల్లమ్మ గుడి ప్రహరీ నిర్మాణానికి రూ.10 లక్షలతో 2024 నవంబర్ 26న, నాలుగు లేన్ల రోడ్డు, డ్రైనేజీ నిర్మాణానికి రూ.18 కోట్లతో 2024 డిసెంబర్ 6న శిలాఫలకాలు వేశారు. మొగుళ్లపల్లి మండలం మొట్లపల్లి నుంచి పర్లపల్లి వరకు రూ. కోటితో బీటీ రోడ్డు నిర్మాణానికి 2025 మార్చి 8న శంకుస్థాపన చేసి పనులు మరిచారు.
ఇదే మండలంలోని చాలా గ్రామాల్లో అభివృద్ధి పనులకు చేసిన శంకుస్థాపనలు ఎక్కడివి అక్కడే ఉన్నాయి. గొర్లవీడు నుంచి కాశీంపల్లి వరకు రోడ్డు వరదల్లో కొట్టుకుపోయి ప్రమాదకరంగా మారగా మరమ్మతు చేసేందుకు శిలాఫలకం వేసి పనులు మరిచారు. భూపాలపల్లి పట్టణంలో డబుల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వాటిని పక్క మండలానికి మళ్లించారు. దీంతో భూపాలపల్లిలోని అంబేద్కర్ సెంటర్ నుంచి జంగేడు వరకు రోడ్డు , సెంట్రల్ లైటింగ్ పనులు నిలిచిపోయాయి.
బీఆర్ఎస్ చేపట్టిన జంక్షన్ల అభివృద్ధి అటకెక్కింది. కాటారంలో న్యూ మోడల్ వెజిటబుల్ మార్కెట్ నిర్మాణానికి రూ.10 లక్షల డీఎంఎఫ్టీ నిధులతో 2025 జనవరి 6న మంత్రి శ్రీధర్‌బాబు శంకుస్థాపన చేసినప్పటికీ పనులు ప్రారంభించలేదు. అయితే గతం లో ఈ స్థలంలో కూరగాయలు అమ్మిన వారికి మార్కెట్ నిర్మించి ఇస్తామని ఖాళీ చేయించారు. వారు ప్రస్తుతం దారుల వెం ట, అద్దె గదుల్లో వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. శిలాఫలకాలు వేసి పనులు ప్రారంభించని పరిస్థితి ప్రతి గ్రామంలోనూ దర్శనమిస్తున్నది.

ఎంపేడుకు బస్సేది?
టేకుమట్ల మండలం ఎంపేడు గ్రామానికి సుమారు రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో కనీసం బస్సు సౌకర్యాన్ని పునరుద్ధరించలేకపోయారని ఆ గ్రామస్తులు మండిపడుతున్నారు. టేకుమట్ల నుంచి వెల్లంపల్లి మీదుగా ఎంపేడు వరకు సుమారు 3.5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ దారి పూర్తిగా ఆధ్వానంగా మారడంతో గతంలోనే బస్సు సౌకర్యం నిలిచిపోయింది. ఇటు ప్రైవేటు వాహనాలు సైతం వెళ్లకపోవడంతో ప్రజలు తమ అవసరాల రీత్యా టేకుమట్లకు రావడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రోడ్డు నిర్మించి బస్సు సౌకర్యం కల్పించగా ఇసుక వాహానాలతో రోడ్డు పాడైపోయింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ. 3.4 కోట్లతో 2025 జనవరి 5న రోడ్డు నిర్మాణానికి శిలాపలకం వేసి 10 నెలలవుతున్నా ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదు.