నర్సంపేట రూరల్, మే 21: కాలం చెల్లిన, నకిలీ విత్తనాలను విక్రయిస్తే ఫర్టిలైజర్ షాపుల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ కమిషనర్ కా ర్యాలయ ఏడీఏ, స్టేట్ టాస్క్‌ఫోర్స్ మెంబర్ శ్రీదేవి హెచ్చరించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఆదివారం మండలంలోని ముగ్ధుంపురంలోని శ్రీరామ విత్తనోత్పత్తి సంఘంలోని ప్రాసెసింగ్ ప్లాంట్‌ను రాష్ట్రస్థాయి సీడ్ టాస్క్‌ఫోర్స్ బృందం సభ్యులు తనిఖీలు నిర్వహించారు. నర్సంపేట పట్టణంలోని పలు విత్తన షాపులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విత్తన దుకాణాల్లోని పత్తి, మిరప, మక్కజొన్న విత్తన నిల్వలను, స్టాక్ రిజిస్టర్లను, గోదాములను బృంద సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీదేవి, సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ వినయ్‌కుమార్ మాట్లాడుతూ రైతులు ఫర్టిలైజర్ షాపుల్లో విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో రసీదులు తీసుకోవాలన్నారు. బిల్లు లో విత్తనానికి సంబంధించిన పూర్తి సమాచారం పొందుపర్చారో లేదో పరిశీలించాలని వారు కోరారు. పంట కాలం పూర్తయ్యే వరకు బిల్లులు జాగ్రత్త పర్చుకోవాలని సూచించారు. రైతులు నాణ్యమైన విత్తనాలనే కొనుగోలు చేయాలని, అధికృత డీలర్ల నుంచి మాత్రమే తీసుకోవాలని కో రారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఏడీఏ అవినాష్ వర్మ, ఏవో టీ కృష్ణకుమార్, ఏఈవోలు మెండు అశోక్, భరత్, నవీన్, శ్యాం పాల్గొన్నారు.
నెక్కొండ : నెక్కొండలోని ఫర్టిలైజర్స్ షాపుల్లో ఆదివారం రాష్ట్ర విత్తన టాస్క్‌ఫోర్స్ బృందం తనిఖీలు నిర్వహించింది. వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయ ఏడీఏ, స్టేట్ టాస్క్‌ఫోర్స్ మెంబర్ శ్రీదేవి, సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ కే వినయ్‌కుమార్, నర్సంపేట ఏడీఏ అవినాష్‌వర్మ, మండల వ్యవసాయాధికారి నాగరాజు స్థానిక విజయలక్ష్మి ఫర్టిలైజర్స్, సాయిశ్రీనివాస సీడ్స్, భాగ్య ఫర్టిలైజర్స్, విజయ్ ఏజన్సీస్ షాపులను తనిఖీ చేశారు. షాపుల్లో నిల్వ ఉంచిన విత్తన ప్యాకెట్లు, విత్తన ధ్రువీకరణ ఆధార పత్రాలు, స్టాక్ రిజిస్టర్స్, బిల్లు బుక్స్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ లైసెన్స్ లేకుండా విత్తనాలు అమ్మొద్దన్నారు. గ్రామాల్లో అనుమతులు లేకుండా విత్తనాలు అమ్మేవారి వివరాలను వ్యవసాయశాఖాధికారికి తెలియజేయాలన్నారు. బీటీ-3 విత్తనాలను విక్రయించొద్దని, విత్తన డీలర్లు అనుమతిలేని గోదాముల్లో సీడ్‌ను నిల్వచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఫర్టిలైజర్ షాపుల యజమానులు విధిగా స్టాక్ రిజిస్టర్లు, బిల్ బుక్స్‌ను నిర్వహించాలన్నారు.