హనుమకొండ సబర్బన్/హనుమకొండ, మే 7 : మూడు రోజులుగా హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళా చివరి రోజైన గురువారం రైతులు అధికారులపై తిరగబడ్డారు. సుదూర ప్రాంతాల నుంచి రైతులను వ్యవసాయశాఖ అధికారులు ఆర్టీసీ బస్సుల్లో తీసుకొచ్చారు. అయితే సభకు రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, కొండా సురేఖ, వరంగల్ ఎంపీతో పాటు ఎమ్మెల్యేలు హా జరయ్యారు. ఒకరి తర్వాత ఒకరు ప్రసంగించారు.
ఆ తర్వాత భోజన విరామం ప్రకటించడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు వెళ్లిపోయారు. రై తులు సైతం భోజనం చేశాక తమ గ్రామాలకు వెళ్లిపోయేందుకు యత్నించగా సాయంత్రం నాలుగు గంటల తర్వాతనే బస్సులు కదులుతాయని అధికారులు చెప్పడంతో కంగుతిన్నారు. కొద్దిసేపు సాంస్కృతిక కార్యక్రమా లు వీక్షించిన తర్వాత తాము వెళ్తామని ఎంత చెప్పినా అధికారులు ససేమిరా అన్నారు. రెండు రోజులుగా ఈ కార్యక్రమంపై అనాసక్తితో రైతులు వెళ్లిపోతున్నారని ‘నమస్తే తెలంగాణ’లో వస్తున్న వరుస కథనాల నేపథ్యంలో అధికారులు రైతులను నిర్బంధించే చర్యలకు పూనుకున్నారు.
ఆర్టీసీ ఉన్నతాధికారులతో మాట్లాడి డ్రైవర్లకు సా యంత్రం నాలుగు తర్వాత మాత్రమే బస్సులు కదిలేలా ఆదేశాలిప్పించడంతో అసహనానికి లోనైన రైతులు సద స్సు ప్రాంగణం ముందు ఆందోళనకు దిగారు. తమను మక్కల బస్తాలు (గన్నీ సంచులు) ఇప్పిస్తామని మభ్యపెట్టి తీసుకొచ్చిన అధికారులు తీరా ఇక్కడికి వచ్చాక చేతులెత్తేశారని మండిపడ్డారు. తమ గొడ్డు, గోదాను ఎవరు చూస్తారంటూ నిలదీశారు. నెలల తరబడి మక్కలు కళ్లాల్లోనే మగ్గిపోతున్నాయని ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొందరు మహిళలు ముందుకొచ్చి కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని సక్రమంగా జరిగేవని, వడ్ల కొనుగోలు అప్పగించినట్లుగానే మక్కల కొనుగోళ్లను మహిళా సంఘాలకిస్తే పూర్తవుతాయన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లుతెరిచి మక్క లు, వడ్లు కొనుగోలు పూర్తి చేయాలని, ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.
రాజకీయ ప్రసంగాలతో సరిపుచ్చారు..
వరంగల్ కాంగ్రెస్ డిక్లరేషన్‌ను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో హనుమకొండలో రైతు సంగ్రామ సభ ఏర్పాటు చేసిన నేపథ్యంలో కేవలం సభాస్థలి దొరకకుండా పన్నిన పన్నాగంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మూడు రోజుల మెగా రైతు మేళా కేవలం రాజకీయ ప్రసంగాలకే పరిమితమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేళాను తొలిరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో పాటు మంత్రులు ధనసరి అనసూయ, కొండా సురేఖ, ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యేలు ప్రారంభించారు.
వారి ప్రసంగాలతోనే తొలి రోజు ముగిసింది. రెండో రోజు సైతం రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డితో పాటు మరికొందరు ప్రజా ప్రతినిథులు హాజరై ప్రసంగించారు. మూడో రోజు ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, మంత్రి సురేఖ, ఎంపీ కావ్య, ఎమ్మెల్యేలు హాజరై మాట్లాడారు. ఇక రెండో సెషన్లో సాంస్కృతిక కార్యక్రమాలతోనే సరిపుచ్చారు. అసలు ఈ రైతు మేళా ఏ లక్ష్యంతో నిర్వహించారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇదిలా ఉండగా సర్కారు సొమ్ముతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంతో రైతులకు ఒనకూరిందేమీ లేదని పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి తమను తీసుకొచ్చి పనులు చెడగొట్టారంటూ మండిపడ్డారు.
కేటీఆర్ మీటింగ్ పెడతాండని..
ఈ మీటింగ్‌లో ఎన్నో చెప్తరని వచ్చిన కానీ ఏం చెప్పడం లేదు. కేవలం కేటీఆర్ మీటింగ్ పెడతడనే ఇక్కడ రైతు మేళా పెట్టిండ్రు. సర్కారు పైసలు ఉట్టిగ ఖర్చు పెట్టుడే తప్ప రైతులకు ఒరిగిందేమిలేదు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నపుడు యూరియా బత్తాల కోసం దుకాణానికి పోయే పనిలేకుండె. ఇపుడు రోజుల తరబడి బస్తాల కోసం తిరుగుడైతాంది. లైనులో చెప్పులు పెట్టుడు కొన్ని ఏండ్ల తర్వాత ఇప్పుడే మొదలైంది. ఎకరానికి రూ. 15 వేలు ఇత్తమంటే ఆశతో ఓటేసినం. ఇపుడు రూ. 12 వేలిత్తమని అవి కూడా సక్రమంగా ఏస్తలేరు. మా మండలంలో మూడు నుంచి నాలుగు వేల ఎకరాల మక్కజొన్న సాగు చేసిండ్రు. కనీసం కొనుగోలు కేంద్రం కూడా లేదు. పండించిన పంటను కొనే దిక్కులేదు.
-వడ్నాల రమేశ్,లక్ష్మీపురం, ఇనుగుర్తి మండలం
రైతులకు ఒరిగిందేమీలేదు
మూడు రోజులుగా నిర్వహించిన రైతు మేళాతో కొత్త విషయాలు నేర్చుకుందామని వచ్చినం. ఇక్కడ పాత సర్కారును తిట్టడానికే సరిపోయింది. రైతు బంధు సక్కగ ఇయ్యకపోతివి.. రుణమాఫీ చేయకపోతివి.. వడ్లు కొనకపోతివి.. మక్కలు కల్లాల్లోనే ఉండిపాయే.. ఆడోళ్ల కోసం ఉచిత బస్సు అంటివి.. మగోళ్లకు రేట్లు పెంచితివి.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినకాడి నుంచి సక్కగా అమలైన పథకం ఏందో చెప్పుండ్రి. ఉట్టి మాటలతోటి టైం పాస్ చేస్తున్నరు తప్ప పనులు చేస్తలేరు. యూరియా బత్తాల కోసం పొద్దంతా లైన్లో నిల్చున్నా దొరకక పోతే మళ్లీ తెల్లారి నిలబడాల్సి వత్తాంది. అయినా బస్తాలు దొరకలేదు.
-సోమ రాములు, రామవరం, కొడకండ్ల మండలం
టోకెన్ ఇచ్చిండ్రు.. బస్తాలు ఇస్తలేరు..
నేను మక్కలు కోసి నెల రోజులైంది. మార్కెట్లో పోసి అధికారుల చుట్టూ తిరుగుతున్న. రేపు, మాపు అంటున్నారే తప్ప కొంటలేరు. బార్దాన్ కూడా ఇత్తలేరు. రెండు వందల బస్తాలకు పోయిన నెల 19న రైతులందరం లొల్లి పెడితే సొసైటీ దగ్గర టోకెన్లిచ్చిండ్రు.. ఇప్పటి వరకు బస్తాలియ్యలేదు. ఇపుడు ఈ మీటింగ్‌కు వస్తే బస్తాలు ఇస్తామని చెప్పిండ్రు. తీరా ఇక్కడి వచ్చినంక మీకు కొనుక్కోవాలని చెపుతుండ్రు. మీటింగ్‌లో వాళ్ల గప్పాలు కొట్టుకున్నారే తప్ప కొత్త విషయాలేమీ లేవు.
-గుగులోత్ సాయి ప్రసాద్, తీగలవేణి, గూడూరు మండలం