సెర్ప్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. వారికి కొత్త పే స్కేల్ వర్తింపజేస్తూ శనివారం జీవో 11 జారీ చేసింది. జిల్లాలో 80 మందికి లబ్ధి చేకూరనుండగా, ఇకపై వీరికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలతో పాటు డీఏ, పదోన్నతులు వర్తించనున్నాయి. గ్రామాల్లో మహిళా సంఘాల బలోపేతానికి, గ్రామీణ పేదరిక నిర్మూలనకు నిరంతరం కృషిచేస్తున్న తమను గుర్తించిన సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని సెర్ప్ ఉద్యోగులు చెబుతున్నారు. 23 ఏళ్ల కలను నిజం చేసి తమ కుటుంబాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
వర్ధన్నపేట, మార్చి 18 : మహిళా సంఘాల ప్రగ తి కోసం నిరంతరం కృషి చేస్తున్న సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ) ఉద్యోగులకు రాష్ట్ర ప్రభు త్వం తీపి కబురు అందించింది. 23 సంవత్సరాలుగా సెర్ప్‌లో డ్రైవర్ల నుంచి మొదలుకొని ప్రాజెక్టు మేనేజర్లుగా విధులు నిర్వర్తిస్తున్న వారికి పే స్కేల్ వర్తింపజేస్తూ జీవో జారీ చేసింది. దీంతో ఉద్యోగుల్లో సంతోషం వ్యక్తమవుతున్నది. మహిళా సంఘాలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రతినెలా సంఘాల పొదుపులు, రుణాల మంజూరుకు ఉద్యోగులు నిరంతరం శ్రమిస్తున్నారు. అంతేకాకుండా సంఘాలకు బ్యాంకు రుణాలు ఇప్పించడం, మహిళలతో కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేయించడంలో వీరు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆసక్తి, అనుభవం ఉన్న మహిళ సంఘాల సభ్యులను గుర్తించి వారు ఎంచుకున్న వ్యాపారానికి సైతం బ్యాంకు ద్వారా అతి తక్కువ వడ్డీకే రుణాలు ఇప్పిస్తున్నారు. స్త్రీనిధి ద్వారా ప్రభు త్వం ఇచ్చే గ్రాంట్లను మహిళా సంఘాలకు అందిస్తున్నారు. ఉద్యోగుల పనితీరును గుర్తించిన సీఎం కేసీఆర్ పే స్కేల్ వర్తింపజేయడంపై జిల్లా ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాకు చెందిన 80 మంది సెర్ప్ ఉద్యోగులకు లబ్ధి చేకూరనున్నది. భారీగా వేతనాలు పెరుగుతుండడంతో ఉద్యోగుల కుటుంబాలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. రూ.18వేల సాధారణ వేతనం ఉన్న ఉద్యోగికి ఇకనుంచి ప్రతి నెలా రూ.58,850 వరకు రానున్నది. అలాగే ప్రాజెక్టు మేనేజర్ వేతనం రూ.51వేల నుంచి 1.27లక్షలకు పెరుగనుంది. జిల్లాలో సెర్ప్ ప్రాజెక్టు మేనేజర్‌తో పాటు ఆరుగురు జిల్లా ప్రోగ్రాం మేనేజర్లు, 16 మంది అసిస్టెంట్ ప్రోగ్రాం మేనేజర్లు, 43 మంది కమ్యునిటీ కో-ఆర్డినేటర్లు, ఏడుగురు మండల బుక్ కీపర్లు, మండల సమాఖ్య కో-ఆర్డినేటర్, ఐదుగురు అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్లు, ఆఫీస్ అసిస్టెంట్‌కు పేస్కేల్ వర్తించనున్నది.
23 ఏళ్లుగా చాలీచాలని వేతనంతో పనిచేస్తున్న సెర్ప్ ఉద్యోగులకు సీంఎ కేసీఆర్ పే స్కేల్ వర్తింపజేయడంపై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహిళల ప్రగతి కోసం పనిచేస్తున్న సెర్ప్ ఉద్యోగులకు పే స్కేల్ అమలు చేయడంతో జిల్లాకు చెందిన ఉద్యోగులు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, దయాకర్‌రావుకు ధన్యవాదాలు తెలిపారు.
– వేణు, సెర్ప్ ఏపీఎం
సెర్ప్‌లో 21 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నాను. వేతనం తక్కువ కావడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. మహిళా సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేయడం, బ్యాంకులు, స్త్రీనిధి ద్వారా మహిళలకు రుణాలు మంజూరు చేయిస్తున్నాం. గత ప్రభుత్వాల హయాంలో మాకు ఎలాంటి గుర్తింపు లభించలేదు. సీఎం కేసీఆర్ మా కష్టాన్ని గుర్తించి పే స్కేల్ వర్తింపజేయడం సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రికి జీవితాంతం రుణపడి ఉంటాం.
– ఏ సురేశ్, సెర్ప్ ఉద్యోగుల జేఏసీ జిల్లా అధ్యక్షుడు
సెర్ప్ ఉద్యోగులకు పే స్కేల్ వర్తింపజేయడం అభినందనీయం. గత పాలకులు ఎన్నడూ మా సమస్యలను గుర్తించలేదు. సీఎం కేసీఆర్ మా ఇబ్బందులను గుర్తించి పే స్కేల్ ఇవ్వడం సంతోషంగా ఉంది. మహిళలు ఆర్థిక ప్రగతి కోసం సెర్ప్ ఉద్యోగులు నిరంతరం శ్రమిస్తున్నారు. పే స్కేల్‌ను వర్తింపజేసిన సీఎం కేసీఆర్‌కు జేఏసీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు.