చిన్న, సన్నకారు రైతులకు ఆసరాగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చింది. ప్రతి సంవత్సరం రెండు విడుతలు ఎకరానికి రూ.5వేల చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నది. పదో విడుత ఈ నెల 28 నుంచి ప్రారంభం కాగా, ఇప్పటికే జిల్లాలో 1,02,617 మంది రైతులకు రూ.54,74,35,825 అందజేసింది. మూడో రోజు 6,638 మందికి రూ.8.25 కోట్ల పెట్టుబడి సాయం పంపిణీ చేసింది. శనివారం నాలుగు ఎకరాల్లోపు రైతులకు ఆర్థికసాయం అందించనున్నది. అదునుకు యాసంగి పంట పెట్టుబడి సాయం అందుతుండడంతో రైతులు సంబుర పడుతున్నారు. సాగు కోసం అప్పులు చేసే దుస్థితి నుంచి రాష్ట్ర సర్కారు గట్టెక్కించిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– వరంగల్, డిసెంబర్ 30(నమస్తేతెలంగాణ)
వరంగల్, డిసెంబర్ 30(నమస్తేతెలంగాణ) : ముందుగా ప్రకటించినట్లు తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా రైతులకు యాసంగి పంట పెట్టుబడి సాయాన్ని పంపిణీ చేస్తున్నది. రెండోవిడుత ఎకరానికి రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నది. ఇప్పటికే జిల్లాలో 1,02,617 మంది రైతులకు రూ.54,74,35,825 అందజేసింది. పంట పెట్టుబడి కోసం ప్రస్తుత యాసంగి జిల్లాలో 1,44,221 మంది రైతులకు ఎకరానికి రూ.5 వేల చొప్పున రైతుబంధు పథకం ద్వారా రూ.132,54,85,928 ఆర్థికసాయం పంపిణీ చేసేందుకు నిర్ణయించింది.
ఈ మేరకు బుధవారం నుంచి పెట్టుబడి సాయాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖతాలో జమ చేస్తున్నది. తొలిరోజు ఎకరంలోపు వ్యవసాయ భూమి గల 56,244మంది రైతులకు రూ.16,65,25,165, రెండోరోజు గురువారం రెండు ఎకరాల్లోపు వ్యవసాయ భూమి ఉన్న 40,101 మంది రైతులకు రూ.29,99,06,718 ఆర్థికసాయం అందజేసింది. మూడోరోజు శుక్రవారం మూడు ఎకరాల్లోపు వ్యవసాయ భూమి గల 6,638 మంది రైతులకు రూ.8,25,01,419 పంట పెట్టుబడి సాయాన్ని పంపిణీ చేసింది. శనివారం నాలుగు ఎకరాల్లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో ఎకరానికి రూ.5 వేల ఆర్థికసాయం రైతుబంధు పథకం ద్వారా జమ కానుంది.
ఆదివారం సెలవు దినం కావడంతో సోమవారం ఐదు ఎకరాల్లోపు వ్యవసాయ భూమి గల రైతులకు పంట పెట్టుబడి సాయం అందనుంది. ఇలా జిల్లాలోని 1,44,221 మంది రైతులు కొద్దిరోజుల్లో రైతుబంధు పథకం ద్వారా ఆర్థికసాయం పొందనున్నారు. ఇటీవల వానకాలం వరి పంట కోసి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతులు యాసంగి వరి పంట సాగుకు నడుం కట్టారు. దుక్కి, దమ్ము చేసి నాట్లు వేసేందుకు సమాయత్తం అవుతున్నారు.
ఈ క్రమంలో రైతుబంధు పథకం ద్వారా రెండోవిడుత ఎకరానికి రూ.5 వేల చొప్పున అందుతున్న ఆర్థికసాయంతో ఎరువులు, మందులను కొనుగోలు చేస్తున్నారు. పెట్టుబడి సమయానికి ప్రభుత్వ సాయం అందిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వరి, మక్కజొన్న, పత్తి, వేరుశనగతో పాటు ఇతర పంటలను సాగు చేయడానికి సిద్ధమైన రైతులు రైతుబంధు సాయంతో విత్తనాలు, ఎరువులను సమకూర్చుకుంటున్నారు. దుక్కి చదును చేసిన యంత్రాలకు అద్దె డబ్బు చెల్లిస్తున్నారు. రా్రష్ట్రంలో రైతుబంధు పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి యాసంగి పంట పెట్టుబడి కోసం అప్పు చేయాల్సిన అవసరం లేకుండా పోయిందని రైతులు మురిసిపోతున్నారు.
రైతుబంధుతో కష్టాలు తీరినయ్..
– ఉండీల రాజు, రైతు, నర్సానగర్, సంగెం మండలం
సంగెం : పంట పెట్టుబడి కోసం సీఎం కేసీఆర్ సారు ఇస్తున్న రైతుబంధుతో కష్టాలు తీరినయ్. ఏడాదిలో రెండు సార్లు పంట వేసే సమయంలో పెట్టుబడి కోసం ఎవరి దగ్గరికి పోకుండా చేసి ఎకరానికి రూ.10 వేలు ఇస్తున్న రైతు బాంధవుడు సీం కేసీఆర్. ముఖ్యమంత్రి స్వయంగా రైతు కాబట్టే అన్నదాతల కష్టాలు తెలుసుకుని పెట్టుబడి సాయం చేస్తున్నరు. ఇరవై ఏండ్ల కింద ఆరు బావులను తవ్వించినం. 8 బోర్లు వేయించినం.. అయినా నీళ్లు మాత్రం పడలే. కనీసం రోజుకు 2 గంటలు కూడా నీళ్లు ఎల్లకపోయేది. ఉన్న నీళ్లను చేనుకు పారిచ్చికోవడానికి కరంటు కూడా ఉండకపోయేది.
వచ్చే ఆ రెండు గంటల కరంటుకు రైతులందరూ ఒకేసారి మోటర్లు వేయటం వల్ల మోటర్లతో పాటు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేవి. కేసీఆర్ సీఎం అయిన తర్వాత ప్రాజెక్టులు కట్టించడంతో భూగర్భ జలాలు పెరిగి బావులు, బోర్లల్లో పుష్కలంగా నీళ్లు ఉన్నయి. 24 గంటల పాటు త్రీఫేజ్ కరంటు ఉంటున్నది. నాకున్న 6 ఎకరాల భూమిలో మిర్చి, మక్కజొన్న, వరి పంటలు వేశాను. రైతులు ఆర్థికంగా బలపడి పిల్లలను మంచి స్కూళ్లల్లో చదివిత్తానం. రైతుల చేతుల్లో డబ్బులుండాలంటే కేసీఆర్ ప్రభుత్వమే ఉండాలి.