అయోమయం, గందరగోళం, అనుమానం, సందేహం.. రుణమాఫీ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి మెజార్టీ రైతులది ఇదే పరిస్థితి. అర్హులైన రైతులందరికీ పంట రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ సర్కారు ఎంతో ఆర్భాటంగా గొప్పలు చెబుతున్నా అమలు తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఇప్పటికే మొదటి విడుత రూ.లక్ష లోపు మాఫీకే నోచుకోక ఎంతోమంది అన్నదాతలు ఆగమవుతుంటే తాజాగా మంగళవారం ప్రారంభమైన రెండో విడుతపైనా అదే అస్పష్టత నెలకొంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండగా మాఫీ మొత్తాన్ని తగ్గించేలా రేవంత్ సర్కారు నిబంధనలు విధించడం, వివరాల సేకరణలో క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యంతో లబ్ధిదారుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మాఫీ అయినట్లు ప్రభుత్వం నుంచి కచ్చితమైన సమాచారం లేక బ్యాంకులు, అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్న రైతులు.. ఇక చివరి జాబితాలోనైనా పేరుండక పోతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు.
– వరంగల్, జూలై 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
వరంగల్, జూలై 30(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రుణమాఫీ ప్రక్రియపై రైతుల్లో అదే అయోమయం కొనసాగుతున్నది. తొలి దశలో లక్ష రూపాయల లోపు పంట రుణాలను మాఫీ చేశామని, రెండో దశ మాఫీ ప్రక్రియను మొదలు పెడుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. రెండో దశలో లక్షన్నర రూపాయల్లోపు ఉన్న రుణాలను మాఫీ చేస్తున్నట్లు పేర్కొన్నది. మాఫీపై రైతుల్లో మాత్రం ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి దశలో 25,391మంది రైతులకు చెందిన రూ.141.95 కోట్ల పంట రుణాలను మాఫీ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నది.
రెండో దశలో 14,700 మంది రైతులకు చెందిన రూ.143.83 కోట్ల పంట రుణాలను మాఫీ చేస్తున్నట్లు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన నిబంధనలతో చాలామంది ఈ పథకానికి దూరమయ్యారు. పంట రుణాల మాఫీ మొత్తాన్ని తగ్గించేలా రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు విధించడం, క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం వివరాలు సేకరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్య బాగా తగ్గింది. పంట రుణాల మాఫీపై రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు, వాస్తవ పరిస్థితులకు బాగా అంతరం కనిపిస్తున్నది. రూ.లక్ష లోపు రుణాలున్నా మాఫీ కాని రైతులు జిల్లాలో వేల సంఖ్యలో ఉన్నారు.
రెండో దశ రుణమాఫీ ప్రక్రియ మొదలైనా తమ విషయంలో ఎలాంటి స్పష్టత రావడం లేదని వీరు వాపోతున్నారు. బ్యాంకుల్లో, అధికారులను అడిగినా ఫలితం ఉండడం లేదని చెబుతున్నారు. సహకార సంఘాల్లో రుణమాఫీపై మరింత గందరగోళం నెలకొన్నది. పీఏసీఎస్‌ల వారీగా లబ్ధిదారుల జాబితాలు వచ్చినా వీరిలో చాలామంది అర్హుల పేర్లు లేవని రైతులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన నిబంధన కారణంగానే తమకు రుణమాఫీ కావడం లేదని అంటున్నారు.
జయశంకర్ భూపాలపల్లి, జూలై 30 (నమస్తే తెలంగాణ) : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రెండో విడుత రుణమాఫీపై మళ్లీ అదే గందరగోళం నెలకొంది. లక్ష లోపు రుణం తీసుకున్న రైతులు రెండో జాబితా కోసం ఎదురుచూడగా అందులో చాలామంది పేర్లు గల్లంతు కావడంతో ఇక చివరి జాబితాపైనే ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలో రెండో విడుత మొత్తం 8,754మంది రైతులకు రూ.95,95,47,866 పంట రుణాలు మాఫీ కాగా, మొదటి విడుత రూ.లక్ష లోపు 16,502 మందికి రూ.85,00,12,230 మాఫీ అయ్యాయి. ఇంకా చాలామందికి రూ.లక్ష లోపు రుణాలు మాఫీ కావాల్సి ఉంది. అయితే లక్ష లోపు తీసుకున్నది ఎంతమంది? లక్షన్నర లోపు రుణం తీసుకున్నది ఎంతమంది అనే విషయమై బ్యాంకు అధికారులు, అటు వ్యవసాయ అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు బ్యాంకులు, అధికారులు చుట్టూ చక్కర్లు కొట్టాల్సి వస్తున్నది.
బయ్యారం, జూలై 30 : మహబూబాబాద్ జిల్లా కొత్తపేటలో రైతుల్లేక ‘రైతుసంబురం’ కార్యక్రమం వెలవెలబోయింది. మంగళవారం లక్షా యాభై వేల లోపు రుణమాఫీ విడుదల సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ను వీక్షించేందుకు మండలం నుంచి పెద్ద సంఖ్యలో రైతులు హాజరుకావాల్సి ఉండగా ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో రైతువేదిక ఖాళీ కుర్చీలతో కనిపించింది. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పురుగుమందుల వ్యాపారులతో మొక్కుబడిగా నిర్వహించి మమ అనిపించారు వ్యవసాయ శాఖ అధికారులు.
నర్సింహులపేట : నా పేరున డీసీసీ బ్యాంకులో రూ. 50 వేలు రుణం తీసుకున్న. అప్పుడు బ్యాంకు వాళ్లు నాకు రూ. 44 వేలు ఇచ్చి ఆరు వేలు షేర్ అమౌంట్ అని ఉంచుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం రెండు సార్లు మాఫీ చేసినా నా పేరైతే రాలేదు. పీఏసీఎస్ ఆఫీస్‌కు ఎన్నిసార్లు పోయినా ఏమీ చెప్పడం లేదు. మా ఊళ్లో చాలామందికి మాఫీ అయింది కానీ నాకు మాత్రమే కాలేదు. వ్యవసాధికారులు మాత్రం నా పేరు పైకి పంపలేదని చెబుతున్నారు. బ్యాంకుకు పోతే అగ వస్తది. ఇగ వస్తది అంటున్నారు. ఇప్పటికైనా పెద్ద సార్లు జర నాకు రుణమాఫీ వచ్చేలా చేయండి.
– జేరిపోతుల రమేశ్, కొమ్ములవంచ
నర్సింహులపేట, జూలై 30 : నేను డీసీసీ బ్యాంకులో రూ.70వేలు పంట రుణం తీసుకున్నా. కానీ నా పేరున మూడు అకౌంట్లు ఉన్నట్లు ఆధార్ నంబర్ నమోదు చేయడంతో నా పేరున మొత్తం రూ.2,11,912 అప్పు ఉన్నట్లు చూపిస్తున్నది. నాలుగు రోజుల నుంచి తిరుగుతున్నా ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. నేను తీసుకున్న రూ.70 వేలు మాఫీ కాలేదు. రేపు మాపు అని తిప్పుతున్నరు. రైతు సమాచార పత్రంలో మూడు అకౌంట్లు ఉన్నట్లు రూ.2.11 లక్షల అప్పు ఉన్నట్లు చూపిస్తాంది. బ్యాంకు వాళ్లు మాత్రం రూ.71,779 ఉందని అవి మాఫీ కాలేదని చెబుతున్నారు. గీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు విడుతలు మాఫీ చేసినా నా రుణం మాత్రం మాఫీ కాలేదు.
– కొండ వెంకన్న, దాట్ల
ప్రతి రైతుకు పంట రుణమాఫీ అని అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పథకం అమలులో అడ్డగోలు నిబంధనలు విధించింది. ఫలితంగా ఎక్కువ మంది ఈ పథకానికి దూరమయ్యారు. మొదటి దశ రుణమాఫీ ప్రక్రియ మొదలైన ఈ నెల 18నుంచి వీరంతా బ్యాం కుల చుట్టూ తిరుగుతున్నారు. అధికారులను కలిసి తమ పరిస్థితి ని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు, అప్పుడు అవుతుందని అధికా రులు వీరికి మాటలు చెప్పి వాయిదాలు వేస్తూ వచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం రెండో దశ రుణమాఫీని మొదలుపెట్టినట్లు ప్రకటించ డంతో మొదటి దశ ప్రక్రియలో తమ పేర్లు ఇక ఉండే అవకాశం లేదని వీరు వాపోతున్నారు. రూ.లక్ష లోపు రుణాలను పూర్తిగా మాఫీ చేయని ప్రభుత్వం ఇప్పుడు రెండో దశ పేరుతో మరింత మంది రైతులకు అన్యాయం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతి రైతుకు పంట రుణాలు మాఫీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొందరికే మాఫీ చేస్తున్నది. రేషన్‌కార్డు ప్రాతిపదికగా కుటుంబంలో ఒక్కరికే లోను మాఫీ చేస్తామనే నిబంధనతో అర్హులు చాలామంది లబ్ధిదారుల జాబితాలో లేకుండా పోయారు.
ప్రభుత్వం నిబంధనలు పెట్టినా అర్హులకు రుణాలు మాఫీ కావడం లేదని, ఈ విషయం చెప్పుకుందామంటే ఎవరిని కలువాలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మాఫీ కోసం వ్యవసాయ అధికారులు తయారు చేసిన జాబితాల్లో తమ పేరు ఉన్నా, రుణాలు మాఫీపై బ్యాంకుల నుంచి, ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం రావడం లేదని చాలా మంది రైతులు వాపోతున్నారు. పంట రుణాల మాఫీ లబ్ధిదారుల వివరాలు చెప్పేలా కచ్చితమైన జాబితాలు గ్రామాల్లో ఎక్కడా అందుబాటులో ఉండడం లేదని, దీంతో బ్యాంకులు, అధికా రుల చుట్టూ తిరగాల్సి వస్తున్నదని చెబుతున్నారు.