హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 17: విద్యార్థుల వ్యక్తిత్వ వికాసంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ల పాత్ర కీలకమని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్‌రెడ్డి అన్నారు. కేయూ సెనేట్హాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. భారతీయ జ్ఞానవ్యవస్థ ఏకీకరణలో ఎన్ఎస్ఎస్ అధికారుల పాత్ర ప్రాముఖ్యత సంతరించుకుందని, కొత్త విద్యా విధానం(ఎన్ఈపీ) అదే దిశగా ముందుకు సాగుతోందని తెలిపారు. విద్యార్థులు పాఠ్యేతర కార్యక్రమాలపై దృష్టి సారించి, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం, నైతిక విలువలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. నూతన ప్రోగ్రాం ఆఫీసర్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల డీన్ ఆచార్య మామిడాల ఇస్తారి మాట్లాడుతూ విద్యార్థులను దేశభవిష్యత్ నిర్మాణదిశగా తీసుకువెళ్లడంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ల పాత్ర కీలకమన్నారు. గ్రామీణ సమస్యలపై అధ్యయనం జరగాలని, త్యాగధనుల స్పూర్తిని కొనసాగించాలని, దేశసేవకు సిద్ధమైన యువతను తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. మై భారత్ పోర్టల్ డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేశ్, ప్రొఫెసర్ ఈసం నారాయణ, అధ్యాపకులు టి.రాధిక, రాంబాబు, జంబు, అనిల్, ప్రసన్నకుమార్, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు కళాశాలల ప్రోగ్రాం ఆఫీసర్లు పాల్గొన్నారు.