కొత్తరేషన్ కార్డుల ప్రక్రియలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ప్రజలను అయోమయంలో పడేంది. అర్హుల కన్నా అనర్హుల పేర్లే ఎక్కువగా ఉండడం వారిలో ఆందోళన కలిగిస్తున్నది. గ్రామాలు, పట్టణాల్లో వందల సంఖ్యలో ప్రజలు రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటే, కులగణన సర్వే ఆధారంగా పదుల సంఖ్యలోనే లబ్ధిదారులను గుర్తించి, వారి ఇండ్లనే అధికారులు సర్వే చేయడంతో మిగతా వారు నిరాశ చెందుతున్నారు. సర్వే కోసం గ్రామాలకు వచ్చిన అధికారులను నిలదీస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ప్రభుత్వ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ధనవంతుల పేర్లు అర్హుల జాబితాలో ఉండడం విస్మయాన్ని కలిగిస్తున్నది.
– మహబూబాబాద్ (నమస్తే తెలంగాణ)/ హనుమకొండ/జనగామ చౌరస్తా, జనవరి 18
కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ గందరగోళంగా మారింది. అర్హత ఉన్నా కొందరి పేర్లు సివిల్ సప్లయ్ శాఖ పంపిన జాబితాలో లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన ద్వారా స్వీకరించిన దరఖాస్తులను పక్కన పెట్టి, ఇటీవల చేపట్టిన కులగణన సర్వేనే ప్రామాణికంగా తీసుకోవడంతో ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా చాలాచోట్ల అర్హులకు అన్యాయం జరుగుతున్నది. కులగణన సర్వేలో రేషన్‌కార్డు ఉందా.. లేదా అనే వివరాలను అధికారులు సేకరించగా, వాటి ఆధారంగా సివిల్ సప్లయ్ శాఖ కమిషనరేట్ అధికారులు జాబితాను రూపొందించి జిల్లా సివిల్ సప్లయ్ అధికారులకు పంపించారు.
ఈ జాబితా ఆధారంగానే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీలు గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి పరిశీలించి గ్రామసభలు పెట్టి, అర్హులను ఎంపిక చేస్తున్నది. అయితే, ఇప్పటికే తాము రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకొన్నామని, వచ్చిన జాబితాలో తమ పేర్లు రాలేదని అర్హత ఉన్న కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు కార్డులు ఎవరికి వస్తాయో.. ఎవరికి రావో తెలియని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. ఎన్నికల ముందు అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందిస్తామంటూ మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చి, ఇప్పుడు నిబంధనల పేరుతో కొర్రీలు పెట్టి కోతలు విధిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు, కొర్రీలతో లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని పలువురు విమర్శిస్తున్నారు. గతంలో ఉన్న నిబంధనల ఆధారంగానే ఇప్పుడు కూడా వినియోగిస్తున్నారు.
సివిల్ సప్లయ్ అధికారుల వివరాల
ప్రకారం.. పట్టణ పరిధిలో రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షల ఆదాయం, మూడున్నర ఎకరాల తరి, ఏడున్నర ఎకరాల ఖుష్కి మించని వారు అర్హు లు. ప్రభుత్వం పెట్టిన నిబంధనలతో అర్హులైన వారికి రేషన్‌కార్డులు దక్కేలా లేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు గ్రామ, వార్డు సభలు నిర్వహించి అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఆ తర్వాత తుది జాబితాను ఖరారు చేసి కలెక్టర్ల ద్వారా పౌరసరఫరాల శాఖ రేషన్ కార్డులు మంజూరు చేసే అవకాశం ఉంది. హనుమకొండ జిల్లా సివిల్ సప్లయ్ అధికారులకు 14431 మందితో కూడిన జాబితాను పంపగా, దాని ఆధారంగానే సర్వే చేస్తున్నారు. ఇదే విషయమై సివిల్ సప్లయ్ డీసీఎస్‌వోను అడుగగా సివిల్ సప్లయి కమిషనర్ కార్యాలయం నుంచి వచ్చిన జాబితా ఆధారంగా ఇంటింటా సర్వే చేస్తున్నట్లు తెలిపారు.
మానుకోటలో అంతా అయోమయం..
మహబూబాబాద్ జిల్లాలో రేషన్ కార్డుల సర్వే ప్రజాపాలన దరఖాస్తుల ప్రకారం చేస్తున్నారో.., కులగణన సర్వే ప్రకారం చేస్తున్నారో తెలియక ప్రజలు అయోమయంలో ఉన్నారు. ఒక గ్రామంలో సుమారుగా 400మంది రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటే, కేవలం 40మందికి పేర్లు మాత్రమే జాబితాలో వచ్చాయని ప్రజలు చెబుతున్నారు. ఇదే విషయంపై మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామంలో సర్వే చేస్తున్న అధికారులను ప్రజలు అడ్డుకున్నారు. తమ గ్రామంలో అర్హులు చాలామంది ఉన్నా కొంతమంది పేర్లు మాత్రమే జాబితాలో వచ్చాయని వాపోయారు.
అధికారులు మాత్రం మొదటి విడుతలో పేర్లు రానివారు రెండో విడుతలో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈనెల 26న అర్హుల జాబితాను పంచాయతీ కార్యాలయంలో ప్రదర్శిస్తామని, అందులో పేరు లేకుంటే తిరిగి దరఖాస్తు చేసుకోవాలంటున్నారు. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకోవడంతోపాటు కులగణనలో పేర్లు నమోదు చేసుకున్నా అర్హుల జాబితాలో పేర్లు లేకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అసలు ఈ ప్రభుత్వం పథకాలు ఇస్తుందా.. లేదా అని అనుమాన పడుతున్నారు. సర్వేలో భాగంగా అధికారులు గ్రామాల్లో కొంతమంది ఇళ్లకు మాత్రమే పోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. అర్హుల జాబితాలో చాలామందికి చోటుదకకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. అలాగే చిన్నగూడూరు మండలం మేఘ్యాతండాలో 60 దరఖాస్తు చేసుకుంటే, కేవలం 14మందికే మంజూరైనట్లు తండావాసులు తెలిపారు.
జనగామలో అనర్హులే ఎక్కువ..
జనగామ జిల్లాలో రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ అగమ్యగోచరంగా ఉన్నది. అర్హుల కంటే అనర్హులే ఇందులో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తున్నది. దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్న శ్రీమంతులు, ప్రభుత్వ, సాఫ్ట్వేర్ ఉద్యోగులను దినసరి కూలీలు, నిరుపేదలతో సమానంగా గుర్తిస్తూ జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రభుత్వం కుల గణన సర్వేను ప్రామాణికంగా తీసుకోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికే మీ సేవ కేంద్రాలు, ప్రజాపాలన ద్వారా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న ఆశావహు లు ప్రభుత్వ నిర్ణయంతో పరేషాన్ అవుతున్నారు. జిల్లాలో కొత్త రేషన్ కార్డుల సర్వే కోసం ఇటీవల 9,997 మందితో అధికారులు జాబితాను విడుదల చేశారు.
ఇందులో అర్హులకన్నా, అనర్హులే ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గా ల సమాచారం. రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామం లో లబ్ధిదారుల జాబితాలో అర్హులకన్నా, అనర్హులే ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు తేలింది. మొత్తం 95 మందిని గుర్తించగా, ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు ముగ్గురు, ప్రభుత్వ పింఛన్‌దారులు ఎనిమిది మంది , సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఐదుగురు, మాజీ సర్పంచ్‌లు ఇద్దరు, ధనవంతులు 10మంది, దినసరి కూలీలు 20మంది, ఏడాది క్రితం పెళ్లయిన వారు ముగ్గురితోపాటు ఇతరులు 54 మంది ఉన్నారు. జనగామ పట్టణంలోని 3వ వార్డు బాలాజీ నగర్, జ్యోతి నగర్, జీఎంఆర్ గార్డె న్ పరిధిలో అధికారులు 33 మందితో జాబితా విడుదల చేశా రు. ఇందులో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, ఒక విశ్రాంత ఉద్యోగి, మరో ఇద్దరు మరణించిన వ్యక్తులను అర్హులుగా గుర్తి స్తూ సర్వే జాబితా రూపొందించారు. మిగతా వార్డుల్లో కూడా ఇదే పరిస్థితి ఉందని స్థానికులు వాపోతున్నారు.