తాడ్వాయి, ఫిబ్రవరి14: మేడారంలో బుధవారం మండెమెలిగే పండుగను సమ్మక్క-సారలమ్మ పూజారులు ఘనంగా నిర్వహించారు. మొదటగా సమ్మక్క పూజా మందిరంలో తల్లి గద్దెను, పూజా సామగ్రిని పూజారులు సిద్ధబోయిన మునీందర్, కృష్ణయ్య శుద్ధి చేశారు. అనంతరం పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో పూజారుల కుటుంబాలకు చెందిన ఆడపడుచులు తల్లి గద్దెకు అలుకుపూతలు నిర్వహించి, ముగ్గులతో అలంకరించారు. అనంతరం ధూప, దీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం డోలివాయిద్యాల నడుమ గ్రామంలోని బొడ్రాయి, పోచమ్మ గుళ్లకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి ప్రధాన పూజారి సిద్ధబోయిన మునీందర్ ఇంటి నుంచి మామిడి తోరణాలు, పసుపు, కుంకుమలు తీసుకుని గ్రామ శివారుకు చేరుకున్నారు. బూరుగు కర్రలతో రెండు ప్రధాన రహదారులకు ఇరువైపులా మామిడి తోరణాలు, ఆనపకాయ బుర్రతో పాటు కోడిపిల్లను కట్టి ఎలాంటి దుష్టశక్తులు గ్రామంలోకి రాకుండా కట్టు వేశారు. ధ్వజ స్తంభాల వద్ద కల్లు సాకను ఆరబోశారు. అక్కడి నుంచి సమ్మక్క పూజా మందిరానికి చేరుకుని నైవేద్యం సమర్పించారు. మండెమెలిగే పండుగతో మహాజాతర ప్రారంభమైనట్లు పూజారులు సంకేతాలు ఇస్తారు. అదేవిధంగా కన్నెపల్లిలోని సారలమ్మ దేవాలయం లో పూజారి కాక సారయ్య అమ్మవారి పూజా సామగ్రిని, పూజామందిరాన్ని నీటితో కడిగి శుభ్రం చేశారు. తల్లి అడెరాలను శుద్ధి చేసి అలంకరించారు. బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు చేసి, అడేరాలకు చీరె, సారె, పసుపు, కుంకుమ సమర్పించారు. పూజామందిరాన్ని పూలతో అలంకరించారు.
కన్నెపల్లి నుంచి సారలమ్మ పూజారులు, మేడారం నుంచి సమ్మక్క పూజారులు తల్లుల గద్దెల వద్దకు చేరుకుని ఒకరికి ఒకరు సాకను ఇచ్చిపుచ్చుకుని రహస్య పూజలు నిర్వహించారు. అనంతరం రాత్రంతా గద్దెల ఆవరణలో జాగారాలు చేశారు. గురువారం తెల్లవారుజామున ఆయా పూజా మందిరాల్లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఇళ్లకు చేరుకుంటారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి 8 నుంచి గురువారం ఉదయం ఆరు గంటల వరకు భక్తులను అమ్మవార్లను దర్శించుకునేందుకు అనుమతించరు.
ములుగు, ఫిబ్రవరి14(నమస్తేతెలంగాణ): మండమెలిగే పండుగ సందర్భంగా సమ్మక్క పూజారి సిద్ధబోయిన మునీందర్ ఇంటి వద్ద రాత్రి నిర్వహించిన ప్రత్యేక పూజలకు మంత్రి సీతక్కకు నో ఎంట్రీ చెప్పారు. తాను ఆదివాసీ బిడ్డనేనంటూ పూజల్లో పాల్గొనేందుకు అడిషనల్ కలెక్టర్, ఎస్పీ, సీఐ, రోప్ పార్టీలతో మునీందర్ ఇంటికి చేరుకున్న సీతక్కకు చుక్కెదురైంది. తాత ముత్తాతల నుంచి వస్తున్న వంశ ఆచారం ప్రకారం ఇతరులకు ప్రవేశం లేదని పూజారులు తెగేసి చెప్పారు. దీంతో చేసేదేమీ లేక సీతక్క, పూజారి ఇంటి గడప బయట నుంచి దండం పెట్టుకొని వెనుదిరిగారు. జాతర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మండ మెలిగే పండుగ నాడు పూజారుల ఇంటికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి హోదాలో సీతక్క వెళ్లడం, పూజారులు ప్రవేశం లేదని వెనుదిరిగి వెళ్లిపోవాలని చెప్పడం ఇదే మొదటిసారి. ఎంతటి హోదాలో ఉన్న వ్యక్తులైనా ఆదివాసీల కట్టుబాట్ల ముందు తలవంచాల్సిందేన ని మరోసారి రుజువైంది.