గిర్మాజీపేట, జూలై 7: ఆర్డర్‌పై బంగారు ఆభరణాలు తయారుచేస్తానని వాటితో ఉడాయించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఇంతెజార్గంజ్ పోలీస్‌స్టేషన్‌లో సీఐ మచ్చ శివకుమార్ వివరాలు వెల్లడించారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని గాదిన్ గ్రామానికి చెందిన తారక్నాథ్బీర 2018లో వరంగల్‌కు వచ్చి గిర్మాజీ పేటలోని రాధిక టాకీస్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. అతడికి తెలిసిన బంగారు ఆభరణాలు తయారుచేసే అలోక్ వద్ద ఏడాదిపాటు పనిచేశాడు. తర్వాత సొంతంగా షాప్ పెట్టి ఆర్డర్లు తీసుకొనేవాడు. ఈ క్రమంలో తనకు తెలిసిన గోల్డ్‌స్మిత్ అబ్దుల్హ్రమాన్ వద్ద రూ. 10 లక్షల చీటీ వేయడంతోపాటు అతడికి 12 తులాల బంగారు ఆభరణాలను తయారు చేయించి ఇచ్చాడు. నగలు, చీటీ డబ్బులు ఇవ్వకుండా రహమాన్ పారిపోవడంతోపాటు తన దగ్గర పనిచేసే వర్కర్ సఫాన్ కూడా మూడున్నర తులాల బంగారంతో ఉడాయించాడు. అతడికి బంగారు ఆభరణాలు ఆర్డర్ ఇచ్చిన షాప్ యజమానుల నుంచి ఒత్తిడి పెరిగి ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. దీంతో తన దగ్గరకు ఆర్డర్‌పై ఆభరణా లు ఇచ్చే వారి బంగారాన్ని అమ్మి వర్కర్లకు జీతాలు ఇచ్చేవాడు.
చాలా మందికి సరైన సమయానికి ఇవ్వకుండా వాయిదా వేస్తూ కొత్తగా వచ్చిన ఆర్డర్ బంగారం నుంచి పాత వాళ్లకు అడ్జెస్ట్ చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో జ్యువెల్లరీ షాప్ యజమాని స్వపన్ 7.5 తులాలు, శ్రీనాథ్ 6.7 తులాలు, శ్రీనివాసులు 2 తులాలు మొత్తం ముగ్గురు కలిసి 16.2 తులాల బంగారు బిస్కెట్లు ఇచ్చి ఆభరణాలు తయారు చేయమని ఆర్డర్ ఇచ్చారు. దీంతో తారక్నాథ్బీర హుజూరాబాద్‌కు చెందిన పాత కస్టమర్ రాజుకు 5 తులాలు, 3.9 తులాల బంగారాన్ని అమ్మి వచ్చిన డబ్బులను వర్కర్లకు జీతాలు ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మని చెప్పాడు. మిగిలిన సుమారు 7.3 తులాల బంగారాన్ని దుకాణంలో పెట్టి దాన్ని వర్కర్‌తో తీసుకురమ్మని చెప్పి కుటుంబంతో సహా కలకత్తాకు ఫ్లైట్‌లో పారిపోయాడు. తర్వాత వర్కర్‌ను బంగారం విషయం అడిగితే భయపడి తాను తేలేదని చెప్పడంతో నిందితుడు శనివారం రాత్రి వరంగల్‌లోని తన షాపులో ఉంచిన 7.3 తులాల బంగారం, స్కూటీని తీసుకుపోవడానికి రావడంతో పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేసినట్లు సీఐ శివకుమార్ వివరించారు.