నెల్లికుదురు, మే 9 : కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభు త్వం ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమాన్ని అమలు పర్చింది. పట్టణాల్లో సైతం ‘మన బస్తీ- మన బడి’ పేరిట సర్కార్ పాఠశాలల్లో అత్యాధునిక సౌకర్యాలు కల్పించింది. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 18 మండలా ల్లో మొదటి విడతలో 315 పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేసింది. ఆయా పాఠశాలల్లో నీటి సరఫరాతో పాటు మరుగుదొడ్లు, విద్యుదీకరణ, తాగు నీరు, ఫర్నీచర్, పెయింటింగ్, మేజర్, మైనర్ రిపేర్లు, ఆకుపచ్చ రాత బోర్డులు, ప్రహరీలు, వంటగదులు, శిథిల భవనాల స్థానంలో నూతన గదు లు, భోజన శాలలు (ఉన్నత పాఠశాలలో), డిజిట ల్ సౌకర్యాలు తదితర 12 రకాల నిర్మాణాలు చేపట్టింది.
నిబంధనల ప్రకారం పూర్తయినపనులకు రూ. 17,97,98,000 అప్పటి ప్రభుత్వం చెల్లించింది. తదనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్న రూ.4,65,79,000 చెల్లించలేదు. దీంతో పనులు చేసిన వారు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే పెండింగ్‌లో బిల్లులను చెల్లించాలని కోరుతున్నారు.
మండలాల వారీగా పెండింగ్ బిల్లులు
బయ్యారం మండలంలో రూ.2.36 లక్ష లు, చిన్నగూడురులో రూ.7.94 లక్షలు, దంతాలపల్లిలో రూ.1.07లక్షలు, గంగారంలో రూ.4.01లక్షలు, గార్లలో రూ. 46.02 లక్షలు, గూడూరులో రూ.10.09 లక్షలు, ఇనుగుర్తిలో రూ.6.88 లక్షలు, కేసముద్రంలో రూ. 42.54 లక్షలు, కొత్తగూడలో రూ.20.59 లక్షలు, కురవిలో రూ. 30.41 లక్షలు, మహబూబాబాద్‌లో రూ. 1.60 కోట్లు, మరిపెడలో రూ. 14.85 లక్ష లు, నర్సింహులపేటలో రూ.28.62 లక్షలు, నెల్లికుదురులో రూ. 9.59 లక్షలు, పెద్దవంగరలో రూ. 23.14 లక్షలు, సీరోలులో రూ. 5.29 లక్షలు, తొర్రూరు మండలంలో రూ. 24.86 లక్షలు, మొత్తం రూ.4.65 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.
రెండున్నరేళ్లుగా బిల్లులిస్తలేరు..
బ్రాహ్మణకొత్తపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యుదీకరణ, మైనర్ రిపేర్, తాగునీటి సౌకర్యం పనులు చే శాను. మొత్తం రూ. 1.50 లక్షలు అ ప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే చెల్లించారు. ఆ తర్వాత తాగునీటి సౌకర్యం, నిర్వహణకు చెందిన రూ. లక్ష పెండింగ్ బిల్లును ఇంతవరకు చెల్లించడంలేదు. ఈ విషయమై ఎంఈవో నుంచి ఇం జినీరింగ్ అధికారుల వరకు అందరినీ కలిశాను. గతంలో కలెక్టర్‌కు సైతం వినితి పత్రం ఇచ్చాను. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించాలి.
– బొల్లు మురళి, బ్రాహ్మణ కొత్తపల్లి, నెల్లికుదురు మండలం