హనుమకొండ, జూలై 2: ఉమ్మడి జిల్లాలో మహిళా సంఘాల కార్యకలాపాలను ఒకే చోట నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి భవనాలకు గ్రహణం పట్టింది. నిర్మాణాలు ఆశించిన వేగంతో ముందుకు సాగడం లేదు. గ్రామీణ మహిళలకు సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు, స్వయం ఉపాధి కార్యకలాపాలకు శాశ్వత వేదికగా ఈ భవ నాలను నిర్మించాలని సర్కారు నిర్ణయించినప్పటికీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఒకో భవన నిర్మాణానికి రూ.10 లక్షలు కేటాయించగా, ఉమ్మడి వరంగల్ జిల్లాకు మొత్తం 1070 భవనాలు మంజూరయ్యాయి.
అయితే ఇప్పటి వరకు కేవలం 416కే పనులు ప్రారంభమయ్యాయి. మిగిలిన 654 భవనాల పనులు ఇంకా ప్రారంభ దశకే చేరుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మార్చి 15వ తేదీ వరకు పూర్తి చేయాలని మొదట, ఆ తర్వాత జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వరకు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ ఉమ్మడి జిల్లాలో ఏ ఒక్క గ్రామంలో కూడా నిర్మాణాలు పూర్తి కాకపోవడం విశేషం. కాగా, మహబూబాబాద్ జిల్లాలో మొత్తం 337 మంజూరు కాగా, 117 ఇంకా ప్రారంభం కాలేదు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు 85 సాంక్షన్ కాగా, 55 భవనాలు 20 శాతం పూర్తయ్యాయి. మిగతా 30 ప్రారంభ దశలో ఉన్నాయి. ములుగు జిల్లాలో ఒక భవనం మంజూరు కాగా, ఇంకా పూర్తి కాలేదు.
పురోగతి లేని భవన నిర్మాణాలు
ఇందిరా మహిళా శక్తి భవనాలు నిధులున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో పురోగతి కనిపించడం లేదు. సంఘాలు సమావేశాలు నిర్వహించడం, నైపుణ్య శిక్షణ ఇవ్వడం, వారు తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శించి విక్రయించడం, అలాగే మహిళల అభివృద్ధికి దోహదపడేలా కార్యాచరణ అమలు చేయడం ఈ ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణాల ముఖ్య ఉద్దేశం. అయితే ఉమ్మడి జిల్లాలోని ఆరు జిల్లాల్లో చాలా గ్రామపంచాయతీల్లో భవన నిర్మాణాలకు అనువైన స్థలం లేకపో వడంతో గుర్తింపు కష్టతరంగా మారిందని అధికారులు అంటున్నారు.
అయితే ప్రస్తుతం స్థలాలు ఉన్నచోట మాత్రమే ప్రారంభించారు. ఇటీవల జిల్లా అధికారులకు ప్రభుత్వం పనులను వేగ వంతం చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. నిర్మాణాలకు అవసరమైన స్థలాలను వెంటనే గుర్తించి, పెండింగ్లో ఉన్న పనులను ప్రారంభించాలని సంబంధిత శాఖలకు సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పనులు ప్రారంభమైన ప్రాంతాల్లో కూడా నిర్మాణాలను త్వరగా పూర్తి చేసి మహిళా సంఘాలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికార యంత్రాంగం చర్యలు చేపడుతోంది. మహిళా సంఘాల సభ్యులు మాత్రం భవనాల నిర్మాణంలో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా హనుమకొండ జిల్లాలోని గత నెలలోనే భవన నిర్మాణాల కోసం ప్రజాప్రతినిధుల సమక్షంలో ప్రారంభించినట్లు సమాచారం.
పనులు ప్రారంభించాం
హనుమకొండ జిల్లాకు సంబంధించి 95 ఇందిరా మహిళా శక్తి భవనాలు మంజూరు కాగా 74 ప్రాంతాల్లో గత నెలలో ప్రారంభించాం. ఒక్కో భవన నిర్మాణానికి రూ.10లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. పనుల్లో వేగం పెంచి త్వరలోనే పూర్తి చేస్తాం.
– మేన శ్రీను, డీఆర్డీవో హనుమకొండ జిల్లా