జయశంకర్ భూపాలపల్లి, జూన్ 25 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి తీర్చిదిద్ది, సకల సౌకర్యాలు కల్పించడంతోపాటు ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థుల్లో రాయడం, చదవడం, లెక్కలు చేయడం వంటి సామర్థ్యాల పెంపుకోసం ప్రభుత్వం ఇప్పటికే వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తున్నది. ఇప్పుడు సరికొత్తగా పఠనోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రధానంగా పాఠ్య పుస్తకాల్లోని పాఠాలు, పాఠ్యేతర పుస్తకాలు, కథల పుస్తకాలు, వార్తా పత్రికలు వంటివి ధారాళంగా చదివే సామర్థ్యం పెంపు కోసం ఈ పఠనోత్సవ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నది. పూర్వ ప్రాథమిక విద్యార్థులు వర్ణమాల అక్షరాలను గుర్తించడం, 1వ తరగతి విద్యార్థులు సరళ పదాలు, గుణింత పదాలు, 2వ తరగతి విద్యార్థులు ద్విత్వ, సంయుక్తాక్షర పదాలను, వాక్యాలను ధారాళంగా చదవగలగడం, 3 నుంచి ఆపై తరగతుల విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు చెందిన పాఠ్యాంశాలతో పాటు వారి స్థాయికి తగిన బాల సాహిత్యాన్ని, వార్తా పత్రికలను ధారాళంగా చదివే సామర్థ్యం పెంపు కోసం ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది.
ఎలా నిర్వహిస్తారంటే..
రోజు పుస్తక పఠనం కోసం ప్రతి తరగతికి ఒక పీరియడ్‌ను కేటాయించాల్సి ఉంటుంది. పిల్లలు పఠన కార్యక్రమంలో పాల్గొనేలా, ధారాళంగా చదివేలా ఉపాధ్యాయులు చొరవ చూపాల్సి ఉంటుం ది. మొదటి వ్యూహంలో ప్రతి సబ్జెక్టు ఉపాధ్యాయుడు దీనిని బోధనలో అంతర్భాగం చేసి నిర్వహించాల్సి ఉంటుంది. ప్రతి రోజూ తప్పనిసరిగా తాము బోధించే పాఠ్యాంశాన్ని 10 నిమిషాల పాటు చదివించాలి. ఆ అంశంలో కీలక పదాలను గుర్తించి బోర్డు, చార్టుపై రాయించాలి. పదాల తోరణాలను రూపొందించి ప్రదర్శించాలి. తద్వారా పిల్లలకు చదవడం అలవాటుగా మారే విధంగా చూడాలి. 2వ వ్యూహంలో గ్రంథాలయ పుస్తకాలను పిల్లలతో చదివించాల్సి ఉంటుంది. ఇందుకోసం పాఠశాలలో ప్రతి రోజు ప్రతి తరగతికి గ్రంథాలయ పుస్తకాలను చదవడానికి ఒక పీరియడ్‌ను కేటాయించాలి. గ్రంథాలయ పీరియడ్‌లో మూడు రోజులు తెలుగు, హిందీ, ఉర్దులోని కథల పుస్తకాలు, రెండు రోజులు ఆంగ్లభాషలోని కథల పుస్తకాలను, ఒక రోజు ద్వితీయ భాష కథల పుస్తకాలను విద్యార్థులతో చదివించాల్సి ఉంటుంది. ప్రాథమిక పాఠశాలల్లో ఐదుగురు విద్యార్థులతో గ్రంథాలయ కమిటీని ఏర్పాటు చేయాలి.
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6 నుంచి 9వ తరగతి వరకు ఒక్కొక్క తరగతికి ఒక గ్రంథాలయ కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ కమిటీలు పిల్లలకు పుస్తకాలు ఇవ్వడం, సేకరించడం వంటి బాధ్యతలు నిర్వర్తిస్తాయి. చదవడం రాని విద్యార్థులను చదవడం వచ్చిన వారితో జత చేయాలి. లేకపోతే ఉపాధ్యాయుడు వారితో కూర్చొని బాహ్య పఠనం చేసి చదివి వినిపించాలి, పలికించాలి. అలా చదివేలా ఉపాధ్యాయుడు ప్రోత్సహించాల్సి ఉంటుంది. ప్రతి నెలలో 3వ శనివారం నిర్వహించే పేరెంట్స్ సమావేశానికి తల్లిదండ్రులు, ఎస్ఎంసీ సభ్యులను ఆహ్వానించాలి. బాగా చదివిన పిల్లలను ఆ సమావేశంలో పరిచయం చేసి అభినందించాలి. ఇంటి వద్ద కూడా తమ పిల్లలతో కథల పుస్తకాలు, వార్తా పత్రికల వంటివి చదివించేలా తల్లిదండ్రులను ఉపాధ్యాయులు ప్రోత్సహించాల్సి ఉంటుంది. పిల్లల పుట్టిన రోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు వేరే బహుమతులకు బదులు పుస్తకాలను బహుమతులుగా ఇచ్చేలా ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలి. ప్రతి ఉపాధ్యాయుడు తన సబ్జెక్టుకు సంబంధించి విద్యార్థులు ధారాళంగా ఏ మేరకు చదవగలుగుతున్నారనే విషయమై పరిశీలన చేయాలి. ఇలా విద్యార్థుల్లో ధారాళంగా చదవడం, రాయడంతో పాటు కథలు, గేయాల పుస్తకాలు చదవడం వల్ల విద్యార్థుల్లో విజ్ఞానం పెంపొందనుంది. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం జూన్, జూలై రెండు నెలల పాటు పఠనోత్సవాన్ని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించాలని ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు పఠనోత్సవ కార్యక్రమాన్ని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సోమవారం నుంచి అన్ని పాఠశాలల్లో ప్రారంభించనున్నారు.
పఠనోత్సవాన్ని విజయవంతం చేయాలి
ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పఠనోత్సవ కార్యక్రమాన్ని పాఠశాలల్లో విజయవంతం చేయాలి. పాఠ్య పుస్తకాలతో పాటు అందుబాటులో ఉన్న లైబ్రరీ పుస్తకాలు, కథల పుస్తకాలు, దినపత్రికలను విద్యార్థులతో చదివించాలి. అలాగే విద్యార్థులకు పఠన పోటీలు ఏర్పాటు చేసి పఠనంలో పోటీతత్వాన్ని పెంపొందించాలి. తద్వారా విద్యార్థులు అన్ని సబ్జెక్టుల్లో ధారాళంగా చదివే విధంగా కృషి చేయాలి. ఈ పఠనోత్సవ కార్యక్రమం నేటి నుంచి జిల్లాలో అమలవుతుంది.
– కే లక్ష్మణ్, జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి