తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ కుల వృత్తులకు జీవం పోస్తున్నారు. ఆర్థికంగా ఎదిగేందుకు అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారుల కుటుంబాలకు చేయూతనిస్తున్నారు. ప్రతి ఏటా జిల్లాలోని చెరువులు, రిజర్వాయర్లలో ఉచితంగా చేప పిల్లలను పోస్తున్నారు. ఈ ఏడాది రూ.కోటీ 30 లక్షల విలువైన 1.91 కోట్ల చేప పిల్లలను రాష్ట్ర సర్కారు పోసింది. తటాకాలు, రిజర్వాయర్లలో నీరు పుష్కలంగా ఉండడంతో అవి భారీగా పెరిగాయి. మునుపెన్నడూ లేనివిధంగా 2 కిలోల నుంచి 5 కిలోల బరువైన చేపలు లభిస్తున్నాయి. మత్స్య సంపద అధికంగా ఉండడంతో పాండీల(పెద్ద వల)తో పడుతూ వ్యాపారులతో పాటు సొంతంగా పట్టణాలకూ తరలిస్తూ లాభాలు గడిస్తున్నారు.
– వర్ధన్నపేట, మార్చి 2
ర్ధన్నపేట, మార్చి 2 : చెరువులు, రిజర్వాయర్లలో మత్స్య సంపద ఏపుగా పెరగడంతో మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ కులవృత్తిదారులకు చేయూతనిచ్చేలా కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. మత్స్యకారులు ఆర్థికంగా ప్రగతి సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉచితంగా చేపిపల్లలను చెరువులు, రిజర్వాయర్లలో పోస్తున్నది. గతంలో ప్రతి ఏటా ఏప్రిల్, మే నెలల్లో చెరువుల్లో నీటిమట్టం పూర్తిగా తగ్గిన తర్వాతే చేపలు పట్టేవారు. మూడేళ్లుగా చెరువుల్లో ఏడాదంతా నీరు నిలువ ఉండడం వల్ల ఫిబ్రవరి నుంచే చేపలు పట్టడం ప్రారంభించారు. గతంలో కేవలం వలల ద్వారానే చేపలు పట్టేవారు. ప్రస్తుతం చేపలు ఎక్కువగా ఉండడంతో పాండీల(పెద్దవల)తో పడుతున్నారు.
1.91 కోట్ల చేప పిల్లలు..
గత సెప్టెంబర్ 9 నుంచి నవంబర్ 25వ తేదీ వరకు జిల్లాలోని 681 చెరువులు, 5 మినీ రిజర్వాయర్లలో ప్రభుత్వం 1,91,84,520 చేప పిల్లలను పోసింది. సుమారు రూ.కోటీ 30 లక్షల విలువైన రవు, బొచ్చె, బంగారుతీగ రకాల చేపలు 2 నుంచి 5 కిలోల వరకు పెరిగాయి. 2021-22వ సంవత్సరంలో 402 చెరువులు, 2 మినీ రిజర్వాయర్లలో రూ.89.17లక్షల వ్యయంతో 1,16,26,635 చేప పిల్లలను ఉచితంగా కలిపింది. ఈ రెండేళ్లకు సంబంధించిన చేపలు 5 కిలోల బరువుకు పైగా పెరిగి మత్స్యకారులకు దొరుకుతున్నాయి. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో వీరు ఆర్థికంగా ప్రగతి సాధిస్తున్నారు.
జిల్లాలో 178 సొసైటీలు..
జిల్లాలో ప్రస్తుతం 178 మత్స్యకారుల సొసైటీలు ఉన్నాయి. 132 పురుషులవి ఉండగా 46 మహిళా సొసైటీలు ఉన్నాయి. ఇందులో మొత్తం 14,078 మంది సభ్యులు ఉన్నారు. ఉచితంగా చేప పిల్లలను చెరువుల్లో కలపడంతో పాటు సబ్సిడీపై వాహనాలు, వలలు ప్రభుత్వం అందజేస్తున్నది. దీంతో సొసైటీలు ఆర్థికంగా బలోపేతం అవుతున్నాయి. మత్స్య సంపద గణనీయంగా పెరగడంతో ఇతర ప్రాంతాలకూ చేపలను ప్రత్యేక వాహనాల్లో తరలిస్తూ ఆదాయం గడిస్తున్నారు. గతంతో అంధ్రప్రదేశ్ నుంచి చేపలను దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం ఇక్కడే మత్స్యసంపద గణనీయంగా ఉండడంతో వ్యాపారులు నేరుగా సొసైటీల నుంచి కొనుగోలు చేసి పట్టణాల్లోని మార్కెట్లకు తరలిస్తున్నారు. దీంతో సొసైటీలకూ లాభాలు వస్తుండడంతో మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మత్స్య సంపద గణనీయంగా పెరిగింది : నరేశ్నాయుడు, జిల్లా మత్స్యశాఖ అధికారి ప్రభుత్వం నాణ్యమైన చేప విత్తనాలను 100శాతం సబ్సిడీపై చెరువులు, రిజర్వాయర్లలో కలుపుతుండడంతో మత్స్య సంపద గణనీయంగా పెరిగింది. గత ఏడాది, ప్రస్తుతం చెరువుల్లో నీరు ఏమాత్రం తగ్గలేదు. చిన్న వలలతో చేపలు పట్టడం ఇబ్బందిగా మారింది. దీతో మత్స్యకారులు పాండీలతో చేపలు పడుతున్నారు. గతంలో చెరువులో నీటిమట్టం పూర్తిగా తగ్గిన తర్వాతే చేపలు పట్టేది. ఇప్పుడు అవసరం మేర పాండీలతో చేపలు పడుతూ విక్రయించుకుంటున్నారు. మత్స్యకారులు, సొసైటీలు ఆర్థికంగా ప్రగతి సాధిస్తున్నాయి. జిల్లాలో మరిన్ని సొసైటీలనూ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తున్నది.