హనుమకొండ, జూలై 15 : రాష్ట్రంలో బీసీల జనాభా దామాషా ప్రకారం వాటా దక్కాలని, అది తమ న్యాయమైన హక్కు అని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద వెనుకబడిన తరగతుల ప్రజా ప్రతినిధుల వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన హలో బీసీ.. చలో హైదరాబాద్ మహా ధర్నా కార్యక్రమానికి ఆయన పశ్చిమ నియోజకవర్గ బీసీ శ్రేణులతో కలిసి పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరి వెళ్లారు. మహాధర్నాలో పాల్గొన్న దాస్యం మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు రిజర్వేషన్లు అమలు చేయకుండా నాటకాలాడుతున్నదని విమర్శించారు.
‘మేమెంతో మాకు అంత వాటా రావాలి’ అని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఆర్డినెన్స్ పేరుతో కాంగ్రెస్ కాలయాపన చేస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని దాస్యం డిమాండ్ చేశారు. ఆయన వెంట చెన్నం మధు, బొంగు అశోక్‌యాదవ్, పులి రజినీకాంత్, శ్రీధర్, మహేందర్, బొద్దు వెంకన్న, పోలపల్లి రామ్మూర్తి, వెంకన్న తదితరులు ఉన్నారు.