ఓ సామాన్య గిరిజన కుటుంబం నుంచి ముగ్గురు విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. ఒక్కరిని డాక్టర్ చదివించడమే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. అలాంటిది ఈ ఇంట్లో ముగ్గురు వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల వల్లే తమ కల నెరవేరిందంటూ ఆ కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
– మహబూబాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ)
మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రానికి చెందిన గుగులోత్ భద్రూనాయక్, బుజ్జి దంపతులకు నలుగురు పిల్లలు. ఇద్దరు కూతుర్లు, ఇద్దరు కొడుకులు. పెద్దవాడు విజయ్‌కుమార్ మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసి, పీజీ చేస్తున్నాడు. పెద్దకూతురు సంధ్యాబాయి బ్యాంకు క్లర్క్‌గా ఉద్యోగం చేస్తున్నది. రెండో కొడుకు రవీంద్రనాయక్ గాంధీ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. చిన్న కూతురు స్వాతి మహబూబాబాద్‌లోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నది. భద్రు గార్ల మండలం బాలాజీ తండాలోని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా చేస్తూ పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారు.
అన్నయ్య స్ఫూర్తితోనే..
మా ఇంట్లో అమ్మ, నాన్న, అన్న, అక్క, నేను, చెల్లెలు మొత్తం ఆరుగురం ఉంటాం. ఎప్పుడైన ఇంట్లో ఒకేసారి అందరికీ జ్వరాలు వస్తే పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు. డాక్టర్ ఫీజు, మందులకు ఎంతో డబ్బు వెచ్చించాల్సి వచ్చేది. ఇవన్నీ గమనించిన నాన్న మా ఇంట్లో అన్నయ్యను డాక్టర్ చేయాలని అనుకున్నాడు. అన్నయ్యకు మొదటి సారి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు రాకపోవడంతో నాన్న లాంగ్ టర్మ్ కోచింగ్ ఇప్పించాడు. తర్వాత అన్నయ్యకు మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. అలా అన్నయ్యను స్ఫూర్తిగా తీసుకొని, నేను, మా చెల్లి ప్రభుత్వ మెడికల్ కళాశాల్లో సీట్లు సాధించాం.
-రవీంద్రనాయక్, ఎంబీబీఎస్ ఫైనలియర్, గాంధీ మెడికల్ కళాశాల
రూపాయి ఖర్చు లేకుండా సీటు
నేను ఒకటో తరగతి నుంచి పదోతరగతి వరకు గార్లలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నా. ఇంటర్ విజయవాడలోని ప్రైవేట్ కళాశాలలో పూర్తి చేశా. ఎలాంటి కోచింగ్‌కు పోకుండా రూపాయి ఖర్చు లేకుండా మెడికల్ సీటు సాధించా. చిన్నప్పటి నుంచి నాకు డాక్టర్ కావాలనే కల బలంగా ఉండేది. రోజూ ఉదయం 6గంటల నుంచి రాత్రి పది గంటల దాకా చదివేది. మహబూబాబాద్ జిల్లాకు మెడికల్ కళాశాల రావడంతో సొంత జిల్లాలోనే చదవాలని నిర్ణయించుకున్నా. కౌన్సిలింగ్లో మూడు కళాశాలల్లో నాకు అవకాశం వచ్చినా మహబూబాబాద్‌లోనే సీటు తీసుకున్నా. సీఎం కేసీఆర్ జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం వల్ల ఎంతోమంది పేద విద్యార్థులకు వైద్య విద్య చదివే అవకాశం కలిగింది. ఈ విషయంలో సీఎం కేసీఆర్ సార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నా.
– స్వాతి, ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం, మహబూబాబాద్ కాలేజీ
ప్రభుత్వానికి కృతజ్ఞతలు
ఏ ఇంట్లో అయిన పిల్లలను చదివించేందుకు తల్లిదండ్రులు ఎంత కష్టపడుతారో నాకు తెలుసు. పేద, మధ్యతరగతి కుటుంబాల కష్టాలు అన్నీఇన్నీకావు. నలుగురు పిల్లల పోషణ, వారి చదువు సగటు మనిషికి ఎంతో కష్టం. మా ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటే వారిలో ముగ్గురు వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. ఏ తల్లికైనా ఇంతకంటే ఏంకావాలి?. మహబూబాబాద్ జిల్లాకు గతేడాది కొత్తగా మెడికల్ కళాశాల రావడంతో నా చిన్న కుమార్తె స్వాతికి ఇక్కడే సీటు వచ్చింది. ప్రభుత్వానికి కృతజ్ఞతలు. చాల సంతోషంగా ఉంది.
– బుజ్జి, స్వాతి తల్లి, గార్ల
ముగ్గురు పిల్లలకు ప్రభుత్వ కాలేజీల్లోనే సీటు
2002లో నా చిన్న కొడుక్కు ఆరోగ్యం బాగాలేక దవాఖానకు తీసుకుపోదామంటే డబ్బుల్లేవు. నా భార్య పుస్తెలతాడు అమ్మి వైద్యం చేయించిన. ప్రైవేట్ హాస్పిటల్‌కు పోతే డబ్బులు ఖర్చు అయిన బాధ ఇంకా గుర్తుంది. దీంతో నా పెద్ద కొడుకును డాక్టర్ చేయాలనుకున్నా. పెద్ద కొడుకు తర్వాత చిన్న కొడుకు, చిన్న కూతురు ఇలా ముగ్గురూ వైద్య విద్యను చదువుతున్నారు. ముగ్గురికీ ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లోనే సీట్లు వచ్చాయి. ఎంతో సంతోషంగా ఉంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి మెడికల్ కళాశాల రావడం, నా చిన్న కూతురు స్వాతికి అందులో సీటు రావడం సంతోషంగా ఉంది. మా జిల్లాకు మెడికల్ కళాశాల ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు.
– గుగులోతు భద్రూనాయక్, ఉపాధ్యాయుడు, గార్ల