రెండో విడుత కంటి వెలుగుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి విజయవంతం చేసేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నది. ఇప్పటికే ఇందులో భాగంగా జిల్లాలో 393 శిబిరాల నిర్వహణకు ప్రణాళిక రూపొందించిన అధికారులు, గ్రామీణ ప్రాంతాల్లో 323, పట్టణ ప్రాంతాల్లో 70 శిబిరాలను వంద రోజులపాటు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రతి రోజూ గ్రామాల్లో 300మందికి, పట్టణాల్లో 400మందికి పరీక్షలు చేసి అవసరమైన వారికి కళ్లద్దాలతోపాటు మందులు ఇవ్వనున్నారు. ఇప్పటికే 20,103 రీడింగ్ అద్దాలు జిల్లాకే చేరగా, ప్రిస్కిప్షన్ అద్దాలు అవసరమైన వారికి శిబిరం నుంచే కంపెనీకి ఆర్డర్ పెట్టి ఏఎన్ఎంల ద్వారా అందజేయనున్నారు. కాగా, ఈ కార్యక్రమ నిర్వహణకు మండలానికో ప్రత్యేక అధికారిని నియమిస్తున్నారు.
వరంగల్, జనవరి 8(నమస్తేతెలంగాణ) : రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం ద్వారా జిల్లాలో 393 శిబిరాలను నిర్వహించేందుకు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు. 44 బృందాలతో ప్రతిరోజూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 700 మందికి పరీక్షలు చేయాలని నిర్ణయించారు. వంద రోజులు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు శిబిరాల నిర్వహణ కోసం వైద్యాధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్ర సర్కారు జిల్లాకు 20,103 రీడింగ్ గ్లాస్‌లను సరఫరా చేసింది. ఈ నెల 18 నుంచి రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే. వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు పకడ్బందీగా యాక్షన్ ప్లాన్ తయారు చేశారు.
ఈ కార్యక్రమ నిర్వహణ కోసం ప్రభుత్వం ఇటీవల 44 ప్రత్యేక బృందాల ఏర్పాటుకు నిర్ణయించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ప్రతి టీంలో తొమ్మిది మంది ఉండేలా నియామకాలు జరిపారు. ఇందులో ఒక మెడికల్ ఆఫీసర్, పారా మెడికల్ ఆప్తాలమిక్ అధికారి, సూపర్వైజర్, డాటా ఎంట్రీ ఆపరేటర్, ఇద్దరు ఏఎన్ఎంలు, ముగ్గురు ఆశ కార్యకర్తలు ఉంటారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 9,97,529 మంది జనాభా ఉంది. గ్రామీణ జనాభా 5,15,764, పట్టణ జనాభా 4,81,765 ఉండగా జిల్లాలో 323 గ్రామ పంచాయతీలు, 70 వార్డులు, డివిజన్లు ఉన్నా యి. 18ఏళ్లు వయసు పైబడిన ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ, పట్టణ ప్రాంతాల్లో వార్డు, డివిజన్ వారీగా శిబిరాలు అధికారులు ప్లాన్ చేశారు. శని, ఆదివారంతో పాటు ఇతర ప్రభుత్వ సెలవులను మినహాయించి శిబిరాలు నిర్వహించేందుకు షెడ్యూల్ రూపొందిస్తున్నారు. జిల్లాలో జరిగే 393 శిబిరాల్లో గ్రామీణ శిబిరాలు 323, పట్టణ శిబిరాలు 70 అని డీఎంహెచ్‌వో వెంకటరమణ వెల్లడించారు. 44 బృందాల్లో 25 గ్రామీణ, 19 పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తాయని, పనిదినాల్లో ప్రతిరోజూ గ్రామీణ ప్రాంతంలో 300, పట్టణ ప్రాంతంలో 400 మందికి కంటి పరీక్షలు జరుపనున్నట్లు ప్రకటించారు.
44 మంది వైద్య అధికారులను ఆర్బీఆఎస్కే, ఎంఎల్‌హెచ్‌పీ కార్యక్రమాల నుంచి, 44 మంది పారా మెడికల్ ఆప్తాలమిక్ అధికారులను, 44 మంది డాటా ఎంట్రీ ఆపరేటర్లను ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా గుర్తించి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. నెలనెలా ఒక్కో ఆప్తాలమిక్ అధికారికి రూ.30 వేలు, డాటా ఎంట్రీ ఆపరేటర్‌కు రూ.19,500 వేతనం చెల్లించనున్నట్లు చెప్పారు. మెడికల్ ఆఫీసర్, ఏఎన్ఎంలు, ఆశ కార్యక ర్తలు, సూపర్వైజర్లను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేం ద్రం నుంచి గుర్తించి శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించారు. ఇప్పటికే జిల్లాకు 20,103 రీడింగ్ గ్లాస్‌లను సరఫరా చేసినట్లు తెలిపారు. ప్రిస్కిప్షన్ అద్దాలు అవసరమైన వారికి శిబిరం నుంచే కంపెనీకి ఆర్డర్ పెట్టి స్థానిక ఏఎన్ఎంల ద్వారా అందజేస్తామని చెప్పారు.
కంటి వెలుగు కార్యక్రమం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిర్వహించే శిబిరాల వద్ద వసతులు కల్పించాలని ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. టెంట్లు, కుర్చీలు, తాగనీరు, కరంటు వసతి, కంటి పరీక్షల నిర్వహణ కోసం గ్రామ పంచాయతీ కార్యాలయం, పాఠశాల, కమ్యూనిటీ భవనం, ఆరోగ్య ఉపకేంద్రం కేటాయించడం, శిబిరంలో విధులు నిర్వర్తించే వైద్య అధికారులు, సిబ్బందికి ఆహారం, రవాణా వంటి ఏర్పాట్లను అధికారులు చేపట్టారు. ప్రతి శిబిరం వద్ద ట్యూబులు, టార్చ్లైట్లు, మందులు, రీడింగ్ గ్లాసులు, ఐఈసీ మెటీరియల్ వంటివి సమకూర్చే పనుల్లో నిమగ్నమయ్యారు.
కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణ కోసం బఫర్ టీంలను కూడా ఏర్పాటు చేయడానికి యుద్ధప్రాతిపదికన సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో వైద్యాధికారులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, పారా మెడికల్ ఆప్తాలమిక్ అధికారులు ఉంటా రు. వీరికి ప్రభుత్వం ట్యాబులు, ఆటో రిఫ్రాక్టో మీట ర్లు, బఫర్ వాహనాలను సమకూర్చనుంది.
అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ శాఖల అధికారులు, సిబ్బంది కంటి వెలుగు నిర్వహణకు క్షేత్రస్థాయిలో తమవంతు బాధ్యతలు నిర్వర్తిస్తారు. వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా స్థాయి అధికారుల్లో మండలానికి ఒకరు ప్రత్యేక అధికారిగా నియమితులయ్యారు. వీరు కంటి వెలుగు కార్యక్రమాన్ని మానిటరింగ్ చేస్తారని కలెక్టర్ గోపి ప్రకటించారు. శిబిరాల ప్రారంభ కార్యక్రమంలో మంత్రి, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నందున ఆ దిశగా అధికారులు సన్నద్ధమవుతున్నారు.