నల్లబెల్లి, మే 18 : పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి వేడుకలను జయప్రదం చేయాలని సీపీఎం పార్టీ మండల కార్యదర్శి కడియాల మనోహర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 40 వ వర్ధంతిని సీపీఎం పార్టీ నల్లబెల్లి మండల కమిటీ నిర్వహిస్తుందని తెలిపారు. భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో ప్రధాన భూమిక పోషించిన సుందరయ్య తన జీవితాన్ని ప్రజలకు అంకితమిచ్చిన గొప్ప నాయకుడన్నారు.
భూస్వామ్య, దోపిడీ వ్యవస్థను, దున్నేవాడికి భూమి నినాదంతో వెట్టిచాకిరి నిర్మూలన కోసం తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రముఖ పాత్ర నిర్వహించి రజాకార్లకు ఎదురొడ్డి పోరాడిన గొప్ప నాయకుడు అని ప్రశంసించారు. బడుగు, బలహీన వర్గాలతో పాటు కార్మిక, కర్షకుల కోసం అనునిత్యం పోరాడిన విప్లవ కమ్యూనిస్టు యోధుడు అన్నారు.
అలాగే ఉత్తమ పార్లమెంటేరియన్ సభ్యుడిగా నిత్యం ప్రజల కోసం పాటుపడుతూ ప్రజలే నా కుటుంబ సభ్యులు అని సంతానానికి కూడా దూరమై తన వంతు వ్యవసాయ భూమిని పేద ప్రజలకు పంచి ప్రజా పోరాటంలో ముందున్న నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య అని కొనియాడారు. ఇంతటి మహనీయుడి వర్ధంతి వేడుకలను మండల కేంద్రంలో ఘనంగా నిర్వహిస్తున్నందున అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. సమావేశంలో సీపీఎం మండల నాయకుడు బొడిగె సమ్మయ్య , తదితరులు పాల్గొన్నారు.