ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీం
(ఎల్ఆర్ఎస్) ఫీజులు తప్పులతడకగా రావడంతో దరఖాస్తుదారుల్లో ఆందోళన నెలకొంది. ఇంటిమేషన్ లెటర్లో వేలల్లో రావాల్సిన ఫీజు రూ. లక్షలు, కోట్లలో రావడంతో బెంబేలెత్తుతున్నారు. మరో నాలుగు రోజుల్లో 25 శాతం రాయితీ ముగుస్తున్న తరు ణంలో గురువారం బల్దియా కార్యాలయానికి పెద్ద ఎత్తున వచ్చి మున్సిపల్ సిబ్బందితో వాగ్వాదా నికి దిగడంతో కౌన్సిల్‌హాల్ దద్దరిల్లింది. 15 రోజులుగా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సర్వర్ డౌన్‌తో గంటల తరబడి సైట్ ఓపెన్ కాకపోవడంతో అర్జీదారులు అసహనం వ్యక్తం చేశారు.
బల్దియా ప్రధాన కార్యాలయంలోని పౌర సేవా కేంద్రంలోని ప్రత్యేక కౌంటర్‌తో పాటు కౌన్సిల్ హాల్లో ఎల్ఆర్ఎస్కు సంబంధించి తప్పులను సరిదిద్దే ఏర్పాట్లు చేశారు. సిబ్బంది కొరత, సాంకేతిక కారణాలతో సర్వర్ డౌన్‌తో దరఖాస్తుదారులు, సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. ఫీజుల మదింపు తప్పులతడకగా రావడంతో మున్సిపల్ సిబ్బందితో అర్జీదారులు వాగ్వాదానికి దిగారు.
హనుమకొండకు చెందిన దరఖాస్తుదారుడికి ఏకంగా రూ. 7 లక్షలకుపైగా ఫీజు చెల్లించాలని రావడంతో సిబ్బందితో గొడవ పడ్డాడు. సర్వర్ డౌన్ ఉందని సముదాయించినా వినకుండా వాదనకు దిగాడు. శివనగర్‌లో చెందిన ఒకరికి ఏకంగా రూ. 14.50 కోట్లు ఫీజు చెల్లించాలని రావడంతో డాక్యుమెంట్లు పట్టుకొచ్చి అధికారులను నిలదీశాడు. ఇలా దరఖాస్తుదారులకు ఫీజుల మదింపు రూ. లక్షల్లో రావడంతో బల్దియాకు రోజూ వందల సంఖ్యలో వస్తున్నారు.
దరఖాస్తుదారుల పడిగాపులు
మూడు రోజుల కిత్రం రోజంతా సర్వర్ డౌన్ కావడంతో దరఖాస్తుదారులు బల్దియా కార్యాలయంలో పడిగాపులు పడ్డారు. గురువారం సైతం సర్వర్ డౌన్ కావడంతో ఇబ్బందులు పడ్డారు. మార్చి 31తో ప్రభుత్వం ప్రకటించిన 25 శాతం రాయితీ గడువు ముగుస్తున్న నేపథ్యంలో అర్జీదారులు అందివచ్చిన రాయితీ అవకాశం చేజారి పోతుందేమోననే ఆందోళనలో ఉన్నారు. గడువు నాలుగు రోజులే మిగిలి ఉండడంతో తప్పులను సరిచేసుకోవాలని తొందర పడుతున్నారు.