హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 22 : కాంగ్రెస్‌లో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న కార్యకర్తలకు గుర్తింపు లేదని, అసలైన నాయకులకు ఇవ్వాల్సిన వరంగల్ పార్లమెంట్ టికెట్‌ను కాంగ్రెస్ అమ్ముకుందని ఆ పార్టీ కార్యకర్త, ఇండిపెండెంట్ అభ్యర్థి శ్రీపెరంబుదూరి కృష్ణసాగర్ మండిపడ్డారు. సోమవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడారు. వరంగల్ సీటును దొమ్మాటి సాంబయ్య, అద్దంకి దయాకర్ లేదా ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన మోత్కుపల్లి నరసింహులుకు కేటాయించాల్సి ఉండగా,
కాంగ్రెస్ డబ్బులకు అమ్ముడుపోయి కడియం కావ్యకు కేటాయించిందని, ఆమెకు కార్యకర్తలు సపోర్టు చేయరన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ఇంకా అధికార వ్యామోహం పోలేదని, కేవలం కూతురు రాజకీయ భవిష్యత్ కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరారన్నారు. కడియం శ్రీహరికి తన కూతురిపై ఉన్న ప్రేమ స్టేషన్‌ఘన్‌పూర్ ప్రజలు, కార్యకర్తలపైన లేదన్నారు. కావ్యను ఓడించి ఇంటికి పంపే బాధ్యతను తాను తీసుకుంటానన్నారు. మేధావులు, కవులు, కళాకారులు, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు.