హనుమకొండ, మార్చి 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పేరిట వింతైన పనులు చేస్తున్నది. ఒకే ప్రభుత్వం, ఒకే పనికి రెండుసార్లు టెండర్లు పిలవడం, రెండుసార్లు ప్రారంభోత్సవాలు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్ నగరంలోని భద్రకాళీ చెరువు పనుల్లోనూ వింతలు జరుగుతున్నాయి. ఏడాదిన్నర క్రితం ఓసారి, ఇప్పుడు మరోసారి భద్రకాళీ చెరువు పూడికతీత పనులను అధికారికంగా ప్రారంభించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా ప్రకటించిన ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో చేసే పనులు ఏమీ లేకపోవడంతో మరోసారి చెరువు పూడికతతీత పనులను కొత్తగా ప్రారంభించారు. గతంలో మొదలుపెట్టిన పనికే మళ్లీ టెండర్లు పిలవడం, కొత్తగా చేసినట్లు చూపించడం ఎందుకనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సుందరీకరణ, అభివృద్ధి పేరిట చారిత్రక భద్రకాళీ చెరువును ఆగం చేస్తున్నారనే చర్చ జరుగుతున్నది. సుందరీకరణ, అభివృద్ధి పేరిట చారిత్రక భద్రకాళీ చెరువును ఆగం చేస్తున్నారనే చర్చ జరుగుతున్నది.
భద్రకాళీ చెరువు పూడికతీత పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం 2024 నవంబరు లో నిర్ణయించింది. 382 ఏకరాల విస్తీర్ణం కలిగిన భద్రకాళీ చెరువులో 18 లక్షల క్యూబి క్ మీటర్ల పూడికతీత ఉన్నట్లుగా సాగునీటి శాఖ నిర్ధారించింది. చెరువు పూడిక మట్టిని విక్రయించి అదాయం సమకూర్చుకుంటామని సాగునీటి శాఖ ప్రకటించింది. హడావుడిగా చెరువులోని నీటిని ఖాళీ చేయించింది. పూడికతీత కోసం భద్రకాళీ చెరువును 5 జో న్లుగా విభజించింది. తొలుత మూడు జోన్ల కు టెండర్లు పిలిచి మట్టిని తరలించాలని నిర్ణయించింది.
2025 మార్చి 11న పూడికతీత పని మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణా లోపం, అధికారుల నిర్లక్ష్యంతో భద్రకాళీ చె రువు పూడికతీత పనులు జరుగలేదు. సాగునీటి శాఖ 3.40 లక్షల క్యూబిక్ మీటర్లు, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) 3 లక్షల క్యూబిక్ మీటర్లు.. మొత్తం గా 6.40 లక్షల క్యూబిక్ మీటర్ల పూ డిక తీత పూర్తిచేశాయి. క్యూబిక్ మీటరుకు రూ. 167 చొప్పున కేటాయించగా ఇటుకల తయారు చేసే వారు మట్టిని తీసుకువెళ్లారు. ప్రణాళికా లోపంతో ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేయడంతో భద్రకాళీ చెరువులో పెద్ద పెద్ద గుంత లు తయారయ్యాయి.
వానకాలం రావడంతో చెరువులోకి నీళ్లు వచ్చి పనులు ఆగిపోయాయి. ఏడాది క్రితం అధికారికంగా పూడికతీత మొదలుపెట్టిన పనిని ఇప్పుడు కొత్తగా చేపట్టినట్లు సాగునీటి శాఖ వ్యవహా రం సాగుతున్నది. ‘ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక’లో భాగంగా భద్రకాళీ చెరువు పూడికతీత చేపడుతున్నట్లు ప్రకటించింది. అధికార పార్టీ కీలక ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు కలిసి మరోసారి పనులను ప్రారంభించారు. పూడక మట్టిని విక్రయించి సర్కారుకు ఆదాయం సమకూర్చుతామని చెప్పిన సాగునీటి శాఖ అధికారులు ఇప్పుడు అదే పని పూర్తి చేసేందుకు రూ. 16.10 కోట్లు ఖర్చు పెట్టడం ఏమిటనే చర్చ జరుగుతున్నాయి. ఏడాది క్రితం సాగునీటి శాఖకు డబ్బులిచ్చి, పూడిక తీసేలా టెండర్లు నిర్వహించి.. ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టేలా చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కుంచించుకుపోయిన చెరువు
ప్రభుత్వ ప్రణాళికా లోపం, పర్యవేక్షణ లేకపోవడంతో చారిత్రక భద్రకాళీ చెరువు ఆగమయ్యే పరిస్థితి నెలకొన్నది. ఏడాది పొడవునా నిండుగా జలాలతో కనిపించే చెరువు ఇప్పుడు పెద్ద గుంతలతో బోసి పోయి కనిపిస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం భద్రకాళీ ఆలయ మాడవీధుల డిజైన్‌ను మార్చడంతో చెరువు అధికారికంగానే కుంచించుకుపోతున్నది. మొదట్లో చెరువులో పిల్లర్లతో మాఢవీధులు నిర్మించేలా డిజైన్లు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వీటిని మార్చింది. పూడిక మట్టిని ఆలయం పక్కన చెరువులో నింపి నిర్మాణాలు చేపడుతున్నది. మాఢ వీధుల కోసం 18 మీటర్ల వెడల్పుతో కట్టను పోశారు. భద్రకాళీ చెరువు సుందరీకరణ పేరుతో చెరువులో తొమ్మిది చోట్ల అర ఎకరం విస్తీర్ణంలో పూడిక మట్టిని గుట్టలుగా పోసి ఐల్యాండ్లు నిర్మించారు. ప్రైవేటు వ్యక్తుల కబ్జాలు, ప్రభుత్వ తీరుతో ప్రస్తుతం 382 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భద్రకాళీ చెరువు మరింత కుంచించుకుపోతున్నది.