జయశంకర్ భూపాలపల్లి, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ప్రభు త్వ హయాంలో చేసిన పనులకే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ శంకుస్థాపనలు చేస్తున్నది. గత కేసీఆర్ సర్కారు భూపాలపల్లి జిల్లా ప్రత్యేక అభివృద్ధికి బాటలు వేసింది. ఈ క్రమంలో జిల్లా ప్రధాన ఆస్పత్రి, మెడికల్ కళాశాల, ఆయుష్ ఆస్పత్రి, జిల్లా కేంద్రంలో జంక్షన్ల అభివృద్ధి, సెంట్రల్ లైటింగ్ కోసం నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించింది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం చివరి దశలో మంజూరు చేసి పను లు ప్రారంభించగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వాటికి చెక్ పెడుతున్న ది. అప్పుడు బీఆర్ఎస్ ప్రారంభించిన పనులకే మళ్లీ శంకుస్థాపనలు చేయడం చర్చనీయాంశమైంది.
మెడికల్ కళాశాలను మంజూరు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం అదనపు కళాశాల భవనానికి సైతం రూ.130 కోట్లు మంజూరు చేసింది. మొదటి విడత చేపట్టిన పనులు చివరి దశకు చేరుకోగా రెండో విడత మంజూరు చేసిన రూ.130 కోట్లతో పనులు ప్రారంభించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమం లో శనివారం మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌బాబు అవే నిధులతో మళ్లీ మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారు. అలాగే గతంలో ఏ పాలకులూ చేయని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం 100 పడకలతో జిల్లా ప్రధాన ఆస్పత్రి నిర్మించి ములుగు, భూపాలపల్లి జిల్లాలతో పాటు సరిహద్దు రాష్ర్టాల ప్రజలకు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఈ ఆస్పత్రిలో శనివారం మంత్రులు అదనపు భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే అంబేద్కర్ చౌక్ నుంచి కేటీకే-2 ఇైంక్లెన్ వరకు రోడ్డు విస్తరణ, సెంట్రల్ టైటింగ్, డ్రైనేజీ నిర్మాణాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేయగా పనులు గతంలోనే ప్రారంభమయ్యాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పనులు నిలిపివేసింది. సుమారు పది నెలల తర్వాత గతంలో పనిచేస్తున్న కాంట్రాక్టర్‌ను తొలిగించి మళ్లీ మరో కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించి శనివారం మంత్రులతో శంకుస్థాపన చేయించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ప్రభుత్వం మారితే పనులు ఆపివేస్తారా? మరో కాంట్రాక్టర్‌కు అప్పగిస్తారా? ప్రారంభించిన పనులకే మళ్లీ శంకుస్థాపనలు చేస్తారా? అని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు.