వరంగల్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆరు నూరైనా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న హంగామాకు తాజా పరిణామాలు ఆశనిపాతంలా మారనున్నాయా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయని రాజకీయ, న్యాయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్థానిక సంస్థ ల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో చేసిన బిల్లుపై గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండానే ప్రభుత్వం జీవోతో పాటు మార్గదర్శకాలు విడుదల చేసింది.
ఈ నేపథ్యంలో శనివారం అన్ని జిల్లాల యంత్రాంగం అందుకు అనుగుణంగా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో డ్రా తీసి రిజర్వేషన్లను ఖరారు చేసింది. మండల ప్రాదేశిక నియోజకవర్గాలు (ఎంపీటీసీ), జిల్లా ప్రాదేశిక నియోజకవర్గాలు (జడ్పీటీసీ), మండల ప్రజాపరిషత్ (ఎంపీపీ) స్థానాల్లో రిజర్వేషన్లను ఖరారు చేసే కసరత్తు దాదాపు పూర్తి కావచ్చింది. ఈ తరుణంలో హైకోర్టు చేసిన కీలక వ్యాఖ్యల నేపథ్యంలో ఏం చేయాలి? అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. పొద్దంతా తీసిన డ్రా, చేసిన కసరత్తు, రిజర్వేషన్ ఖరారు చేసిన స్థానాలు మొదలైన అంశాలపై ప్రభుత్వం నుంచి ఏ విధమైన ఆదేశాలు వస్తాయనే దానిపై జిల్లా యంత్రాంగం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది.
కసరత్తు ‘డ్రా’పేనా?
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన విషయంలో కాంగ్రెస్ సర్కా ర్ మొదటి నుంచి చేస్తున్న హంగా మా మూడు అడుగుల ముందుకు ఆరు అడుగుల వెనక్కి అన్న చందంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ చేసిన 42 శాతం బీసీ రిజర్వేషన్ల హామీ, అందుకోసం అనుసరించిన అశాస్త్రీయ కసరత్తు వెరసి బడుగుల ఆత్మగౌరవం ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్ రాజకీయ క్రీడకు తాము అవమానాల పాలవుతున్నామని బీసీలు ఆందోళన చెందుతున్నారు.
బీసీ రిజర్వేషన్ల కల్పన విషయంలో నెలకొన్న అనిశ్చితి తొలగిపోకముందే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం మార్గదర్శకాలు విడుదల చేయడమే కాకుండా ఉన్నఫళంగా ప్రాదేశిక నియోజకవర్గాలను వాటికి అనుగుణంగా కేటాయించాలని, శనివారమే ఆ ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించడంతో ఉదయం నుంచి రాత్రి వరకు రిజర్వేషన్ల కేటాయింపు కోసం అధికార యంత్రాంగం కసరత్తు చేసింది. ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలను డ్రా పద్ధతిన కేటాయించింది.
వరంగల్ ఉమ్మడి జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీపీపీ స్థానాల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ రిజర్వేషన్లకు లాటరీ పద్ధతిన కేటాయింపును దాదాపు పూర్తి చేసింది. ఎస్సీ, ఎస్టీ స్థానాలకు 2011 జనాభా లెకలను, బీసీ రిజర్వేషన్లను సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులగణన ప్రకారం కేటాయించింది. కొన్నిచోట్ల సంతకాలతో, మరికొన్నిచోట్ల సంతకాలు చేయకుండా అధికారులు రిజర్వేషన్లను విడుదల చేశారు. అయితే, సాయంత్రం హైకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలతో కింకర్తవ్యం ఏమిటనే డైలమాలో పడ్డారు.
రిజర్వేషన్లు అమలు చేసే ఉద్దేశం లేకనే?
కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని స్థానిక సంస్థల్లో నిలబెట్టుకోవాలనే చిత్తశుద్ధి లేదని బీసీ వర్గాలు మండిపడుతున్నాయి. బీసీ రిజర్వేషన్ల బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్ ఉండగానే రిజర్వేషన్ల కోసం జీవో విడుదల చేసిందని, న్యాయస్థానం ముందు ఆ కసరత్తు నిలవదని తెలిసే ఉద్దేశపూర్వకంగా బీసీలను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవటానికి తాము ప్రయత్నం చేశామని, విపక్షాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో అలా చేయలేకపోయామనే సాకును కాంగ్రెస్ సర్కార్ వెతుక్కోవడంలో భాగమేనని వారు ఉదహరిస్తున్నారు.
జడ్పీలు ఖరారు
హనుమకొండ, సెప్టెంబర్ 27 : జడ్పీ పీఠాలు ఖరారయ్యాయి. ఈ మేరకు శనివారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎస్టీలకు రెండు, ఎస్సీలకు రెండు, ఒకటి బీసీ, ఒక జనరల్ సీటు ఖరారు చేసింది. వీటిలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా జడ్పీ బీసీ జనరల్ కాగా, ములుగు, వరంగల్ జడ్పీలు ఎస్టీలకు, హనుమకొండ, జనగామ ఎస్సీలకు, మహబూబాబాద్ జనరల్‌కు కేటాయించారు.
జడ్పీ చైర్మన్ల రిజర్వేషన్ వివరాలు
జిల్లా పేరు : రిజర్వేషన్
ములుగు : ఎస్టీ మహిళ
వరంగల్ : ఎస్టీ జనరల్
హనుమకొండ : ఎస్సీ మహిళ
జనగామ ఎస్సీ మహిళ
భూపాలపల్లి : బీసీ జనరల్
మహబూబాబాద్ : జనరల్
స్థానిక రిజర్వేషన్లు ఇలా..
డ్రా పద్ధతిన ఖరారు చేసి ప్రకటించిన అధికారులు
స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. జడ్పీటీసీ, జడ్పీచైర్మన్, ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు ఎట్టకేలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఆయా జిల్లాల కలెక్టర్లు అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో డ్రా పద్ధతిన రిజర్వేషన్లను ఖరారు చేసి ప్రకటించారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్